Narsing: షాపులో మంటలు.. భవనమంతటా వ్యాప్తి!
ABN, Publish Date - Mar 01 , 2025 | 04:50 AM
ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు తగులబడ్డాయి. ఆ రెండింటిలో ఒక వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది.
నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతి.. ఒకరికి గాయాలు
2 కార్లు దగ్ధం.. ఒక కారులో పేలిన సిలిండర్.. ఇంట్లో పేలిన మరో రెండు
నార్సింగ్‌లో ఘటన
నార్సింగ్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు తగులబడ్డాయి. ఆ రెండింటిలో ఒక వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఫలితంగా తీవ్రత పెరగడంతో మంటలు భవనంలోని రెండు అంతస్తులకూ పాకాయి. ఆ ఇళ్లలోని ఆరు సిలిండర్లలో రెండు పేలడంతో మంటలు మరింత ఉధృతమయ్యాయి. ఎగిసిపడ్డ అగ్నికీలలు.. దట్టమైన పొగకు ఊపిరాడక ఆ భవనంలో నివసిస్తున్నవారిలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గాయపడ్డారు. నార్సింగ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులు, గాయపడ్డవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నార్సింగ్‌లోని పాషా కాలనీలో ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తి.. తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి ఉండేందుకు జీ ప్లస్ 2 భవనం నిర్మించుకున్నాడు.
ఆ భవనంలోని రెండు ఫోర్లలో ఉస్మాన్‌ఖాన్, ఆయన సోదరులు, వారి భార్యా పిల్లలు అంతా కలిసి 15 మంది నివసిస్తున్నారు. శుక్రవారం గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణాషాపులో మంటలు చెలరేగి.. కొద్దిసేపటికే భవనం రెండు అంతస్తులకూ వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. మంటలను గమనించి ఉస్మాన్‌ఖాన్ బయటకు పరిగెత్తుకొచ్చారు. మంటలు అంతటా వ్యాపించాక పైనున్నవారికి మెట్లపై నుంచి దిగే అవకాశం లేకపోయింది. స్థానికులు దిండ్లు తెచ్చి వేయడంతో కొందరు బిల్డింగ్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఖాన్ కుటుంబసభ్యుల్లో మహిళలు మంటలను చూసి భయభ్రాంతులకు గురై బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు. వారిలో కొందరు పొగకు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. నార్సింగ్ పోలీసులు, అగ్నిమాపకశాఖ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది అక్కడికొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మహిళలు లోపల చిక్కుకుపోయారని తెలుసుకొని.. తాళ్లు, నిచ్చెన సాయంతో బెడ్‌రూంలో ఉన్న మహిళలను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జమీల్ ఖాటూన్ (75), సహానాకాటూన్ (40), షిజ్రా కాటూన్ (4) మృతి చెందినట్లు నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ వెల్లడించారు. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో యూన్‌సఖాన్ (45) బిల్డింగ్‌పై నుంచి దూకడంతో అతడి కాలు విరిగింది. ఉస్మాన్‌ఖాన్ కుటుంబసభ్యుల రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.
Updated Date - Mar 01 , 2025 | 04:50 AM