అచ్చంపేటలో పల్లి రైతు ఆగ్రహం
ABN, Publish Date - Jan 28 , 2025 | 05:53 AM
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తక్కువ ధర ప్రకటించడంపై వేరుశనగ రైతులు మండిపడ్డారు. కమీషన్‌దారులు, అధికారులు ఒక్కటయ్యారని ఆరోపిస్తూ అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారు.
మార్కెట్ కార్యదర్శి,చైర్‌పర్సన్ భర్త పై దాడి
మార్కెట్ కార్యాలయంలో సామగ్రి ధ్వంసం
గిట్టుబాటు ధర కల్పించాలంటూ రాస్తారోకో
కల్వకుర్తిలోనూ ఆందోళనకు దిగిన రైతులు
అచ్చంపేట, హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తక్కువ ధర ప్రకటించడంపై వేరుశనగ రైతులు మండిపడ్డారు. కమీషన్‌దారులు, అధికారులు ఒక్కటయ్యారని ఆరోపిస్తూ అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ భర్త మల్లేశ్, కార్యదర్శిపై చేయిచేసుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ఠంగా రూ.4,010 ధర పలికింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి దూసుకువచ్చి మార్కెట్ కార్యదర్శి నర్సింహ, సూపర్‌వైజర్ జహంగీర్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడే కూర్చున మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత భర్త మల్లేశ్ కలుగజేసుకునే యత్నం చేయగా.. ఆయనపై చేయి చేసుకుని, చొక్కాను చింపేశారు.
వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై తమను ముంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామగ్రిని ధ్వసం చేశారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో రైతులు రాస్తారోకో చేపట్టారు. చివరకు ఎస్సై రమేష్ రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా, కల్వకుర్తిలోనూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. కమీషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాస్తారోకో చేపట్టారు.మద్దతు ధర వచ్చేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజుకుమార్ యాదవ్, కమిటీ సభ్యులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించా రు. రైతుల ముసుగులో మార్కెట్ కార్యదర్శి, ఛైౖర్మన్‌లపై దాడి చేయడం, కార్యాలయం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్
Updated Date - Jan 28 , 2025 | 05:53 AM