Sanjeev Maoist: మావోయిస్టు దంపతులు.. సంజీవ్, దీనా లొంగుబాటు
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:57 AM
ప్రజా గాయకుడు గద్దర్ సమకాలీకుడు.. మావోయిస్టు సంజీవ్ జనజీవన స్రవంతిలో కలిశారు. గురువారం ఆయన తన భార్య దీనాతో కలిసి రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఎదుట లొంగిపోయారు.
గద్దర్ సమకాలీకుడు సంజీవ్
45 ఏళ్లుగా అజ్ఞాతంలోనే సంజీవ్
దీనాది 33 సంవత్సరాల అజ్ఞాతం
మిగతా నక్సలైట్లూ లొంగిపోతే ఆదుకుంటాం : సీపీ సుధీర్‌బాబు
కొత్తపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా గాయకుడు గద్దర్ సమకాలీకుడు.. మావోయిస్టు సంజీవ్ జనజీవన స్రవంతిలో కలిశారు. గురువారం ఆయన తన భార్య దీనాతో కలిసి రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిపై రూ.20లక్షల చొప్పున రివార్డు ఉంది. సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. మాల సంజీవ్ అలియాస్ అశోక్ అలియాస్ లెంగు దాదా(62) సుమారు 45 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉంటూ.. నక్సలిజం, మావోయిజంలో కొనసాగారు. గద్దర్ సమకాలీకుడైన ఆయన.. దండకారణ్య జోనల కమిటీలో.. సెక్రటేరియేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య పెరుగుల పార్వతి అలియాస్ బొంతల పార్వతి అలియాస్ దీనా(50) కూడా 33 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ.. ప్రస్తుతం తెలంగాణ కమిటీ సభ్యురాలిగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసేవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని సుధీర్‌బాబు చెప్పారు. సంజీవ్, దీనా అనారోగ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
1980లో.. జన నాట్యమండలిలో..
సంజీవ్ స్వస్థలం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యాప్రాల్. గద్దర్ నేతృత్వంలోని జననాట్య మండలి(జేఎన్‌ఎం).. పీపుల్స్ వార్‌లో సాంస్కృతిక సేవలందించింది. 1980లో పీడబ్ల్యూజీలో భాగమైన జేఎన్‌ఎంలో చేరిన సంజీవ్.. 16 రాష్ట్రాల్లో డప్పు రమేశ్ దయా, విద్య, దివాకర్‌తో కలిసి.. 1986 వరకు ప్రదర్శనలిస్తూ యువతను పీపుల్స్ వార్ వైపు ఆకర్షించారు. 1982లో కరీంనగర్ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన పంజాల సరోజను పెళ్లి చేసుకున్నారు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో పనిచేశారు. 2002లో జరిగిన ఎదురుకాల్పుల్లో సరోజ మరణించగా సంజీవ్ తప్పించుకున్నారు. 2003 లో దండకారణ్య జోన్ కమిటీకి బదిలీ అయ్యారు. చైతన్య నాట్య మంచ్ (సీఎన్‌ఎం)ఇన్‌చార్జిగా బా ధ్యతలు నిర్వర్తించారు. 2007లో ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా వంకేశ్వరానికి చెందిన దీనాను పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరూ తెలుగు, హిందీ, గిరిజన భాషల్లో పాటలు ఆలపిస్తూ గిరిజనులను నక్సలిజంవైపు ఆకర్షించేవారు. 2005లో బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లోనూ సంజీవ్ తప్పించుకున్నారు.
ఇదీ.. దీనా నేపథ్యం
1992లో పీడబ్ల్యూజీలోకి అడుగుపెట్టిన దీనా.. ఆ తర్వాత జేఎన్‌ఎంలో సేవలందించారు. 1998 లో ఏరియా కమిటీ సభ్యురాలి(ఏసీఎం)గా పదోన్నతి పొందారు. ఏవోబీలోని విశాఖ జిల్లా గాలికొండ ఏసీఎంగా 2004-07 మధ్యకాలం లో పనిచేశారు. అదే ఏడాది ఛత్తీ్‌సగఢ్ చేరుకున్నారు. అక్కడ సంజీవ్‌ను పెళ్లిచేసుకుని, సీఎన్‌ఎం సభ్యురాలిగా చురుగ్గా పాల్గొనేవారు. 2018లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు.
Updated Date - Jul 18 , 2025 | 04:58 AM