ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఇసుకపై నిఘా హైడ్రాకు..

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:02 AM

ఇప్పటికే హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకొనే బాధ్యతను హైడ్రా చేపట్టిన సంగతి తెలిసిందే. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్షించారు.

  • హైదరాబాద్‌ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత

  • సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి

  • ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక.. పేదలకు తక్కువ ధరకే అందించాలి

  • ఇసుక రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు.. నేనే తనిఖీలు చేస్తా

  • గనుల సమీక్షలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో సేకరిస్తున్న ఇసుకలో 80 శాతం హైదరాబాద్‌లో వినియోగం అవుతున్న నేపథ్యంలో రాజధాని నగరం పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే కీలక బాధ్యతను ఐపీఎస్‌ రంగనాథ్‌ నేతృత్వంలోని హైడ్రాకు అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకొనే బాధ్యతను హైడ్రా చేపట్టిన సంగతి తెలిసిందే. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఉచిత ఇసుకను అందించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టి, పేదలు, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమించాలని చెప్పారు.


ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఖనిజాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఇసుక రీచ్‌ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్‌ లైట్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్‌ యార్డుల వద్ద కట్టుదిట్టమైన కంచె వేయాలని, రాకపోకలు నిర్దిష్ట గేట్ల ద్వారా జరిగేట్లు చూడాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా చేసే లారీలన్నీ ముందే ప్రభుత్వం దగ్గర నమోదయ్యేలా చూడాలని చెప్పారు. ఇసుక రీచ్‌లను అధికారులు తనిఖీ చేయాలని, ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇసుకను బుక్‌ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాంతాల వారీగా సమీప రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.


సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థలు సిద్ధం చేయాలని చెప్పారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సీఎం చెప్పారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో సీఎం పలు మార్పులను సూచించారు. మధ్యాహ్నం నుంచి కాకుండా కార్యాలయ వేళల్లో మాత్రమే బుకింగ్‌ చేసుకునేలా వేళలను మార్చాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. ఇసుక అమ్మకాలు పారదర్శకంగా, అక్రమాలకు తావులేకుండా జరగాలని, ఇందుకోసం శాశ్వత ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇసుక రవాణాకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకను అందజేస్తారంటూ ‘ఆంధ్రజ్యోతి’ డిసెంబరు 31న ఓ కథనాన్ని ప్రచురించింది.


  • సీఎంతో సచిన్‌ పైలట్‌ భేటీ

  • దేవనారాయణ్‌ ఆలయ ప్రాణప్రతిష్ఠకు

  • హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేత

  • తెలంగాణ ఇన్‌చార్జిగా పరిశీలనలో పైలట్‌ పేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇక్కడి అబ్దుల్లాపూర్‌ మెట్‌లో భగవాన్‌ శ్రీ దేవనారాయణ్‌ ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పైలట్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పైలట్‌, రేవంత్‌రెడ్డి కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు పైలట్‌ వెళ్లారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి నియామకానికి ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భగేల్‌తోపాటు సచిన్‌ పైలట్‌ పేరునూ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎంతో పైలట్‌ భేటీ.. కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Updated Date - Feb 11 , 2025 | 04:02 AM