CM Revanth Reddy: దక్షిణాదిపై కక్ష
ABN, Publish Date - Mar 08 , 2025 | 03:29 AM
లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిన దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతీకారం
ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభజన ఆయుధం
అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు?
1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి
హిందీ జాతీయ భాష కాదు.. బలవంతంగా రుద్దొద్దు
దేశంలో రెండోస్థానంలో ఉన్న తెలుగుకు ప్రాధాన్యమేదీ?
గుజరాత్‌కు ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను
తెలంగాణకు.. ఆయనది టెస్టు మ్యాచ్.. నాది టీ-20
ప్రధానిగా మోదీని గౌరవిస్తా.. రాజకీయంగా విభేదిస్తా
ఉచితాలు పంచడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి
ఒలింపిక్స్‌కు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ ఉత్తమం
ఇండియా టుడే కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిన దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణను తాము సమగ్రంగా అమలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పునర్విభజనతో దక్షిణాది మాత్రమే కాకుండా పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయని, రాజస్థాన్, బిహార్, యూపీ వంటి బీమారు రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకే పునర్విభజన చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రో రేటా ప్రకారం చేసినా ఇదే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. ‘‘ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. ప్రో రేటా ప్రకారం 50 శాతం సీట్లు పెంచాలని అనుకుంటే అక్కడ 120కి పెరుగుతాయి. అదే సమయంలో, తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లున్నాయి. అక్కడ 50 శాతం చొప్పున పెంచితే 60 సీట్లు అవుతాయి. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల మధ్య తేడా 40 మాత్రమే. కానీ, ప్రో రేటా ప్రకారం సీట్లను పెంచితే ఈ తేడా ఏకంగా 60కి చేరుతుంది. ఒక్క రాష్ట్రంలోనే ఇంత తేడా ఉంటే.. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?’’ అని ప్రశ్నించారు. దక్షిణాదిలో ప్రస్తుతం 126 లోక్‌సభ సీట్లు ఉన్నాయని, ఇక్కడ 50 శాతం పెంచితే గరిష్ఠంగా 62 పెరుగుతాయని.. మొత్తంమీద 185 సీట్లకు దాటదని వివరించారు. దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి వచ్చిన 240 సీట్లలో ఇక్కడ గెలిచింది కేవలం 29 సీట్లు మాత్రమేనని గుర్తు చేశారు. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందని ఆరోపించారు. అందరికీ మంచి జరగాలని ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. ప్రభుత్వపరమైన నిర్ణయాన్ని అధికారులపై ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలను పిలిచి చర్చించాలని డిమాండ్ చేశారు. కుటుంబ నియంత్రణ విధానానికి ముందు 1971 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారుగా అని ప్రశ్నించగా.. ‘‘30ఏళ్ల తర్వాత పునర్విభజన చేపట్టమనండి. అప్పుడు దక్షిణాది సత్తా ఆధారంగా సంఖ్య పెరుగుతుంది. అప్పుడు మా నియోజకవర్గాలూ పెరుగుతాయి’’ అంటూ నవ్వులు పూయించారు. హిందీ ఈ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమేనని, అది జాతీయ భాష కానేకాదని రేవంత్ చెప్పారు. హిందీని బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదని, ఎవరైనా ఏ భాషనైనా నేర్చుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ‘‘హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు, బెంగాలీ భాషలు మాట్లాడే వారున్నారు. మరి, తెలుగుకు ఎంతమేర ప్రాధాన్యం ఇస్తున్నారు? సివిల్స్ పరీక్షల్లో తెలుగు ఎందుకు లేదు!?’’ అని ప్రశ్నించారు.
ప్రత్యర్థులను ఐస్ చేసేందుకు ‘నైస్’
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించి, వారిని బలహీనపరిచి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్యార్థి, యువజన, మహిళ తదితర సంఘాలు కాంగ్రె్‌సకు అనుబంధ సంస్థలైతే.. ఈడీ, సీబీఐ, ఐటీలు బీజేపీకి అనుబంధ సంస్థలని ఎద్దేవా చేశారు. నార్కోటిక్స్, ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలను రేవంత్ రెడ్డి ‘నైస్’గా అభివర్ణించారు. ప్రత్యర్థులను ఐస్ చేసేందుకు నైస్‌ను ప్రయోగిస్తున్నారని అన్నారు.
మోదీది టెస్టు మ్యాచ్.. నాది 20-20
ప్రధాని మోదీది టెస్టు మ్యాచ్ అని, తనది 20 - 20 మ్యాచ్ అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ‘‘గుజరాత్ నమూనాకు కాలం చెల్లింది. ఇప్పుడిక తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం. తెలంగాణ నమూనా ముందు గుజరాత్ నమూనా ఎందుకూ పనికి రాదు. గుజరాత్‌కు మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయితే, తెలంగాణకు నేనే బ్రాండ్ అంబాసిడర్’’ అని అన్నారు. గిఫ్టు సిటీ పేరుతో కేవలం గుజరాత్‌నే అభివృద్ధి చేయాలని మోదీ అనుకుంటున్నారని, అక్కడ కల్పించిన రాయితీలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విదేశీ పెట్టుబడులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. అన్ని పెట్టుబడులు గుజరాత్‌కే తరలిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు అహ్మదాబాద్‌లో ఎక్కడున్నాయని నిలదీశారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించామని, అది ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి పలానా వ్యక్తి కారణమంటే తాను అంగీకరించబోనని, బ్రిటిష్ వారు, కులీ కుతుబ్ షా, నిజాం నుంచి మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ఇలా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధికి కారణమయ్యారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీయే రిజర్వేషన్లు కల్పించిందని, ఇప్పుడు ఓబీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని తాము భావిస్తున్నామని తెలిపారు. వాళ్ల డిమాండ్ సరైనప్పుడు ఇవ్వడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ప్రతి మత విశ్వాసాన్ని తాము గౌరవిస్తున్నామని, తిరుపతి వెళ్లే వారికి రాయితీలు ఇస్తున్నామని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. ‘‘దేశ ప్రధానిగా మోదీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా. తెలంగాణకు సీఎంగా రాష్ట్రానికి కావాల్సినవి డిమాండ్ చేస్తా. అది నా హక్కు.. బాధ్యత. కాంగ్రెస్ ప్రతినిధిగా బీజేపీతో రాజకీయంగా విభేదిస్తా’’ అని అన్నారు. మోదీకి, తనకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీని వ్యక్తిగా కాకుండా విధానపరంగానే తాను వ్యతిరేకిస్తున్నానని వివరించారు.
ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పడు కేవలం రూ69 వేల కోట్లు మాత్రమే అప్పు ఉండేదని, పదేళ్లలో రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అయినా, ప్రజలకు ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు రైతులకు అందించామన్నారు. రుణ భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఉచితాలు పంచడంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అది తన ఒక్కడి సమస్య కాదని చెప్పారు. మోదీ కూడా ఢిల్లీలో అనేక గ్యారెంటీలు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ఉచితాల కారణంగా నిజానికి మౌలిక సదుపాయాలపై రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్‌కు హైదరాబాద్ అత్యుత్తమ నగరం
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రి మాండవీయకు తాను వినతిపత్రం సమర్పించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరమని చెప్పారు. ఎన్నో అంతర్జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించామని, ఇక్కడ ఉన్నన్ని మౌలిక సదుపాయాలు ఎక్కడా లేవని చెప్పారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న సానియా మీర్జా, పీవీ సింధు, నిఖత్ జరీన్ హైదరాబాద్‌కు చెందిన వారేనని గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్‌ను కాదని మోదీ అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలని చూస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రె్‌సలో ప్రజాస్వామ్యం ఎక్కువ
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కావడం బలహీనతేనని రేవంత్ అంగీకరించారు. ఐదు సార్లు రాజ్యసభ సీటు వచ్చినా.. ఆరోసారి రాలేదని బహిరంగంగా విమర్శిస్తారని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలను పక్కన పెట్టినా అడిగేవాళ్లు లేరన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం చెబితే.. అదానీ నిధులను తాను వెనక్కి ఇవ్వలేదని, ప్రతిపక్షాలు నిందలు వేసినందుకే ఆ పని చేశానని చెప్పారు. కుంభమేళాను తాను వ్యతిరేకించలేదని, తన కుటుంబ సభ్యులు కుంభమేళాకు వెళ్లారని చెప్పారు. అయితే, భద్రాద్రిలో పురాతనమైన రామ మందిరం ఉందని, దానికి మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 08 , 2025 | 03:29 AM