Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై కేంద్రం నజర్!
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:49 AM
ప్రస్తుతం కేంద్రం వద్ద విజన్-2047 మినహా భారీ ప్రాజెక్టులను చేపట్టే కొత్త పథకాలు పెద్దగా లేవు. ఏదైనా కొత్త ప్రాజెక్టులను చేర్చాలంటే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రమే చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర సర్కారు లేఖ
ఏ పథకంలో చేర్చాలనే దానిపై కేంద్రం ఆలోచన
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం
కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్ల ఆహ్వానం
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఏ పథకం కింద చేపట్టాలన్న అంశంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్రం వద్ద విజన్-2047 మినహా భారీ ప్రాజెక్టులను చేపట్టే కొత్త పథకాలు పెద్దగా లేవు. ఏదైనా కొత్త ప్రాజెక్టులను చేర్చాలంటే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని ఏ స్కీమ్‌లోకి చేర్చాలి, అందుకు ఉన్న అవకాశాలేంటని కసరత్తు చేస్తోంది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ రాయాలని కూడా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని కేంద్రం పరిధిలోనే చేపట్టండంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై దృష్టి పెట్టిందని, దక్షిణభాగం వివరాలను ఆరా తీస్తోందని సమాచారం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రీజినల్ రింగు రోడ్డును తెలంగాణకు 2016లో మంజూరు చేసింది. 2017లో దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది.
ఉత్తరభాగం నర్సాపూర్ నుంచి తూప్రాన్ -గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ వరకు 161.2 కిలోమీటర్లు ఉండగా, దక్షిణభాగం చౌటుప్పల్‌లో ప్రారంభమై ఆమనగల్-షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుందని మంజూరు చేసినప్పుడు తెలిపింది. వీటిలో మొదటగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భూ సేకరణ, అటవీ అనుమతులు, సహా వివిధ అంశాలతో దాదాపు ఆరేళ్లుగా రహదారి పనుల్లో జాప్యం జరగ్గా.. గతేడాది డిసెంబరు 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రహదారి నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించడంతో కీలక అడుగు పడింది. అయితే దక్షిణభాగం రహదారికి సంబంఽధించిన పనులను మాత్రం కేంద్రం వెంటనే చేపట్టలేదు. పైగా భారత్‌మాల పరియోజన- 1, 2 ప్రాజెక్టుల్లో ఈ రహదారిని ప్రతిపాదించినా అది ముందుకు కదల్లేదు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ కింద రిజర్వ్ చేసి ఉంచారు. తాజాగా కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన విజన్-2047లో దక్షిణభాగాన్ని చేర్చింది. వాస్తవానికి ఈ రెండు భాగాలను కేంద్రమే పలు దఫాలుగా చేస్తామని చెప్పింది. విజన్-2047 ప్రకార మైతే.. దక్షిణ భాగానికి 2031లో అవార్డు పాస్ చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్రం రూపొందించిన విజన్-2047 రిపోర్టులో పొందుపరిచింది.
మూడోసారి టెండర్.. 3 మాడ్యూల్స్‌లో వివరాలు..
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణభాగాన్ని తామే సొంతంగా నిర్మించాలని భావించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోసం కన్సల్టెన్సీ సంస్థల ఎంపికకు గతేడాది నవంబరులో టెండర్లను ఆహ్వానించింది. కానీ, పలు కారణాల రీత్యా ఆ టెండర్లలో బిడ్‌లు దాఖలు కాకపోవడంతో వాటిలో పలు మార్పులు చేసి మళ్లీ ఈ ఏడాది జనవరిలో టెండర్లను పిలిచారు. మొదటిసారి ఆహ్వానించిన టెండర్ నోటీ్‌సలోని పలు నిబంధనలనూ మార్చారు. దీంతో ఈ మార్పులపై నివేదిక తీసుకునేందుకు కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆర్‌అండ్‌బీ శాఖ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌ల దాఖలుకు గడువు తేదీని ఫిబ్రవరి 25గా పేర్కొంది. తాజాగా పిలిచిన టెండర్ నోటీసు ప్రకారం.. రహదారి నిర్మాణానికి కావాల్సిన నిధులను సమీకరించడం, దక్షిణభాగం రహదారికి ఇరువైపులా అలైన్‌మెంట్, వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ సహా పలు విషయాలపై నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీకి సూచించింది. వీటిని మూడు మాడ్యూల్స్‌గా విభజించి.. ఏ పనిని ఎంత కాలంలో పూర్తిచేయాలనే విషయాన్ని కూడా తెలిపింది. మాడ్యూల్-1లో వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌ను (ప్రాజెక్టు సాఽధ్యత) ఇవ్వాలని పేర్కొంది. అంటే ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు, దాని దృక్ఫథం, ఆలోచన ఏంటనే అన్ని వివరాలను సమగ్రంగా రూపొందించాలని సూచించింది. అదే విధఃగా రహదారి అభివృద్ధి పర్యవేక్షణ, సమాచారానికి సంబంధించిన వ్యవస్థను కూడా తయారు చేయాలని పేర్కొంది. దీనిని రెండు నెలల సమయంలో పూర్తిచేయాలని నిర్దేశించింది. ఇక మాడ్యూల్-2లో రోడ్డు నిర్మాణం కోసం నిధుల సమీకరణ ఎలా, నిధుల ప్రణాళిక (ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్) ఏంటన్నది నాలుగు నెలల్లో తెలపాలని సూచించింది.
మార్పులతో కొత్త టెండర్లు..
మాడ్యూల్-3లో ప్రాజెక్టు అమలు సమయంలో వ్యవహరించాల్సిన విధానం, నిర్మాణం సహా పలు అంశాలను 30 నెలల్లో ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి గతేడాది నవంబరు 25న పిలిచిన టెండర్లలో ఇవే అంశాలున్నాయి. కానీ, బిడ్‌లు దాఖలు కాకపోవడంతో పలు మార్పులతో ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక వివరాల కోసం టెండర్లను ఆహ్వానించారు. మరోవైపు దక్షిణ భాగం పనులనూ కేంద్రమే చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో డీపీఆర్ సహా మిగిలిన ఏ పనులనైనా కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ, మళ్లీ దక్షిణభాగం డీపీఆర్‌ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే కన్సల్టెన్సీల ఎంపిక కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ రహదారి మంజూరైనప్పు డు ప్రాథమికంగా ఖరారైన అలైన్‌మెంట్ ప్రకారం చౌటుప్పల్- ఆమనగల్- సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఆ తరువాత దీనిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలనే ఆలోచన నేపథ్యంలో ప్రాథమిక అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం 11 కిలోమీటర్లు పెరిగి రోడ్డు మొత్తం దూరం 200 కిలోమీటర్లకు పెరిగింది. ఈ మేరకు 200 కిలోమీటర్లకు డీపీఆర్ ఇవ్వాలంటూ టెండర్ నోటీసులోనూ పేర్కొన్నారు. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం డీపీఆర్‌ను రూపొందించి, దాని ప్రకారమే రహదారి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అందుకోసమే డీపీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని కూడా ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Updated Date - Jan 27 , 2025 | 04:50 AM