Revanth Reddy: ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:23 AM
ఉద్యోగుల డిమాండ్లు, రైతులకు పెట్టుబడి సహాయం, యువతకు ఉపాధి పథకాలపై తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గురువారం సచివాలయంలో జరగనున్న సమావేశంపై ఉద్యోగులు, రైతులు, యువత ఆశలు పెట్టుకున్నారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ చానల్?
రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం!.. ఒక డీఏకు సుముఖం.. రెండో డీఏపై చర్చ
ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైనా సానుకూలమే
ఏటా సాధారణ బదిలీలకు సుముఖత.. రైతు భరోసా, రైతుబీమా, బోన్‌సలపై చర్చ
యువ వికాసంపైనా చర్చించనున్న మంత్రి మండలి
ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతుభరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఈసారి జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం.. తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలను విని మే 31న తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరగనుంది. కాగా, ఉద్యోగులు కోరుతున్న ఐదు డీఏలలో ఒక డీఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా.. రెండో డీఏ ఇచ్చే విషయంపై చర్చ జరగనుంది. దీంతోపాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు రూ.11 వేల కోట్లను గ్రీన్ చానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నెలకు రూ.1000 కోట్ల చొప్పున చెల్లిస్తారా? లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా? అనే అంశాలపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది.
ఆర్థికేతర డిమాండ్లపై నిర్ణయం!
ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా.. అందులో దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపైనా క్యాబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తుతుందని, మరోవైపు పదోన్నతులు అందక నష్టపోయే ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్టును కొత్తగా మంజూరు చేసే విషయంపైనా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎ్‌స) రూపకల్పనపై ప్రభుత్వం వైద్యశాఖ నుంచే లెక్కలు, ఖర్చులు, వివరాలు సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు.
వారి ప్రతిపాదనలేంటో తెలుసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద 1 శాతం ఇస్తామని సర్కారుకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్యాబినెట్‌లో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
వ్యవ‘సాయం’ పైనా చర్చ..
క్యాబినెట్ భేటీలో వ్యవసాయానికి సంబంధించి ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో అందించే రైతు భరోసాకు అవసరమైన నిధులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వానాకాలం సీజన్‌లో 1.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మొత్తానికి కలిపి దాదాపు రూ.8400 కోట్ల వరకు నిధులు అవసరమని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. మరోవైపు ప్రస్తుత యాసంగి సీజ్‌న్‌లో ఇప్పటివరకు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కలిపి రూ.5 వేల కోట్లు మాత్రమే అందించారు. మరో రూ.2800 కోట్ల వరకు పెండింగ్ ఉంది. ఈ రెండు అంశాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, రైతు బీమా కోసం రూ.1440 కోట్లకు పైగా అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రైతు బీమా కోసం ఎల్‌ఐసీకి రూ.1443 కోట్లు చెల్లించారు. అయితే ఈసారి బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్న క్రమంలో బీమా కోసం నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. ఈ బీమా నిధులను ఆగస్టు 14 నాటికి ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఫసల్ బీమా అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు బీమా లేదు. దాంతో రైతులు చెల్లించే బీమా వాటాను కూడా తామే చెల్లిస్తూ కొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.3 వేల కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా కూడా వేశారు. దీనిపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వడ్లకు ఇచ్చే బోనస్ విషయంలోనూ చర్చించనున్నారు. ఈ ఏడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.1000 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల నివేదికల్లో పేర్కొన్నారు.
యువ వికాసం ఎలా..!
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించగా దాదాపు 16.23 లక్షలు వచ్చాయి. వీటన్నింటిని నాలుగు కేటగిరీలుగా విభజించి వాటి ప్రకారం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. కానీ, పథకం కింద ఎక్కువ ధరఖాస్తులు రావడం, అర్హులను గుర్తించే ప్రక్రియలో జాప్యం జరగడంతో ముందుగా నిర్దేశించుకున్న జూన్ 2న పథకాన్ని ప్రారంభిచలేకపోయారు. ఈ పథకానికి నిధుల సర్దుబాటు, ప్రారంభంపైనా క్యాబినెట్ భేటీ చర్చ జరగనుంది. దీంతోపాటు కాళేశ్వరంపై ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చిన నివేదికపైనా చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రులకు సీఎం ఇచ్చిన విందులో, ఆదివారం జరిగిన మంత్రుల సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావును విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ కమిషన్ నివేదికపై, నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇందిరమ్మ ఇళ్లు.. హ్యామ్ రోడ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 44 వేల ఇళ్లకు పైగా మంజూరు చేసింది. రెండో విడత కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందుకు అవసరమైన నిధుల చెల్లింపు, నిధుల సమీకరణపై చర్చ జరగనుంది. మరోపు రాష్ట్రంలోని పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కలిపి దాదాపు 30 వేల కిలోమీటర్ల రహదారులను హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ఈ రెండు శాఖలు మొదటి దశలో ఎన్ని వేల కిలోమీటర్లను అభివృద్ధి చేయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపైనా చర్చ జరగనుంది. ఈ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్షించారు. హ్యామ్ విధానంలో ఫేజ్-1లో 5,190 కిలోమీటర్ల రహదారులకు సంబంధించిన సమత్ర అంచనాలు, వాటి అమలు విధానాలను అధికారులు మంత్రికి వివరించారు.
డిప్యూటీ సీఎం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు
ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి జేఏసీ ప్రతినిధులకు మంగళవారం సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశం అవుతున్నందున ఆ సమావేశానికి 40 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల జాబితాను పంపాలని కోరినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. క్యాబినెట్ సమావేశానికి ఒక రోజు ముందు ఉద్యోగులతో భట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశం అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 06:13 AM