Hyderabad: భవనం పైనుంచి దూకి బీఆర్‌ఎస్ నేత ఆత్మహత్య
ABN, Publish Date - May 30 , 2025 | 03:48 AM
హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్ బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సర్దార్ (33) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్
దంపతుల వేధింపులే కారణమంటూ
బోరబండలో బంధువుల ఆందోళన
ఇంటి ఆధునికీకరణ పనులు చేస్తుంటే
డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ
ఫసియుద్దీన్, ఆయన భార్య, పీఏపై కేసు
బోరబండ, మే 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్ బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సర్దార్ (33) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దంపతుల వేధింపులే సర్దార్ ఆత్మహత్యకు కారణమంటూ ఆయన బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. దీనితో బోరబండ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎండీ సర్దార్ ఎస్‌ఆర్‌టీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు.
బాబా ఫసియుద్దీన్ దంపతుల వేధింపులతోనే సర్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ బంధువులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బోరబండ ప్రాంతంలో, ఫసియుద్దీన్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్దార్ సోదరుడు ఇబ్రహీం ఫిర్యాదు మేరకు ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబాషేక్, పీఏ సప్తగిరితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడు ఇటీవల ఇంటి ఆధునీకరణ పనులు చేపట్టారని.. దీనితో డబ్బులు డిమాండ్ చేస్తూ వారు వేధించారని ఇబ్రహీం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సర్దార్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
Updated Date - May 30 , 2025 | 03:48 AM