N Ramchander Rao: పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:57 AM
భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఎంత పెద్ద నేతలైనా సరే గీత దాటితే చర్యలు తప్పవని, ఆ విషయంలో పార్టీనే సుప్రీం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ.. రేవంత్ రెడ్డీ సొంత జిల్లాకు ఏం చేశావు?
బీసీల 42% రిజర్వేషన్ల పేరుతో మైనారిటీలకు మేలు చేసే కుట్రలు
కేంద్రం అదనంగా ఇచ్చిన యూరియా ఏది?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/నారాయణపేట/కొత్తూర్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఎంత పెద్ద నేతలైనా సరే గీత దాటితే చర్యలు తప్పవని, ఆ విషయంలో పార్టీనే సుప్రీం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పర్యటించిన ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్‌లు గెలుచుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బీ ఫాం ఇచ్చిన వారిని కష్టపడి గెలిపించుకోవాలని, విభేదాలు తెచ్చి ఇతరుల గెలుపునకు అవకాశం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటిమాటికీ ఢిల్లీకి వెళ్లడం కాదని, సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్ల పేరుతో 10ు మైనారిటీలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి తమ నాయకుడు రాహుల్‌గాంధీది ఏ కులమో చెప్పాలని ప్రశ్నించారు. మతాలు మారతారు కానీ కులాలు ఎవరూ మారరని ఈ విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చిందని, అదనంగా ఇచ్చిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి చేపట్టాలని, లేకపోతే ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కాం గ్రెస్ కార్యకర్తలకు కేటాయిస్తున్నారని, పేదలకు ఇళ్లు దక్కకపోతే కార్యకర్తలు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరికి టికెట్లు దక్కినా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆమె అన్నారు.
తిమ్మాపూర్‌లో ఘనస్వాగతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంచందర్ రావు మొట్టమొదటి సారిగా శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మునిసిపాలిటీలోని తిమ్మాపూర్ వద్ద ఆయనకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. రాంచందర్‌రావుతో పాటు.. ఎంపీ డీకే అరుణను గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన స్థానిక వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 04:57 AM