భక్తుల కోసం భద్రాద్రి సమాచార యాప్
ABN, Publish Date - Mar 15 , 2025 | 03:57 AM
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. రామయ్య పెండ్లి పనులు ప్రారంభం కావడం, సీతమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో శుక్రవారం ఈ యాప్‌ను దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రారంభించిన ఈవో .. రాష్ట్రంలోనే తొలి దేవస్థానం
భద్రాచలం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. రామయ్య పెండ్లి పనులు ప్రారంభం కావడం, సీతమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో శుక్రవారం ఈ యాప్‌ను దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఆత్రేయ ఇన్ఫోటెక్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యాప్‌లో ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉన్న వివిధ సేవలు, క్షేత్ర మహత్యం, పట్టణం, పరిసరాల్లో దర్శనీయ స్థలాలు, దూరాలు.. ఇతర వివరాలు పొందుపరిచారు. దేవస్థానంలో ఇప్పటికే ఆన్‌లైన్, క్యూఆర్ కోడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పారదర్శకత కోసం బార్ కోడింగ్, అన్నప్రసాదంలో ఈ టికెటింగ్ విధానం అమల్లో ఉంది. రానున్న నెల రోజుల్లో ఈ యాప్ ద్వారా భక్తులు నేరుగా ఆర్జిత సేవలు, పూజలు, ఇతరత్రా వాటిని సైతం పొందేలా తీర్చిదిద్దనున్నట్లు ఈవో వెల్లడించారు.
కాగా స్వామివారి మహాప్రసాద అన్నదానంలో భాగంగా వెయ్యిమందికి అన్నప్రసాదం అందించేందుకు ప్రసాద్ పథకంలో నిర్మిస్తున్న హాల్‌ను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించామని ఈవో తెలిపారు. ప్రొటోకాల్ విధానం ప్రవేశపెట్టడంతో భక్తులకు పారదర్శకంగా దర్శనం లభిస్తోందని, దేవస్థానానికి ఆదాయం కూడా సమకూరుతోందన్నారు. వస్త్రాలకు బార్‌కోడింగ్ విధానం ప్రవేశపెట్టి, భక్తులకు దేవస్థానం నిర్దేశించిన ధరకే వాటిని విక్రయించాలని కాంట్రాక్టర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో భక్తులకు ఆన్‌లైన్, బార్‌కోడింగ్, ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి తెచ్చిన తొలి దేవస్థానంగా భద్రాద్రి ఖ్యాతినార్జించిందన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ రాఘవాచార్య, ఆత్రేయ ఇన్ఫోటెక్ సిస్టమ్స్ ఎండీ ఎ.రమేషన్ పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 03:57 AM