Local Elections: క్యాబినెట్ తరువాతే.. ‘స్థానికం’పై స్పష్టత!
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:45 AM
బీసీ రిజర్వేషన్ల ఖరారు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మధ్య పడిన పీటముడిపై క్యాబినెట్ తరు వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 285(ఏ)ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది.
గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్.. కేంద్రానికి పంపిన బిల్లులు పెండింగ్‌లోనే
వీటిపై మంత్రివర్గంలో కీలక చర్చ..
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల ఖరారు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మధ్య పడిన పీటముడిపై క్యాబినెట్ తరువాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 285(ఏ)ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది. దానికి ఇంకా ఆమోదం రాలేదు. మరోవైపు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతానికి పెంచేందుకు అ సెంబ్లీలో ఆమోదించి రెండు బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించడంతో పాటు వాటిని రాజ్యాంగంలోని షెడ్యుల్ 9లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపింది. ఇది ఇప్పట్లో తేలే అవకాశాల్లేవు. అదే సమయంలో రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు సూచించిన గడువు శుక్రవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు-బీసీ రిజర్వేషన్లపై ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రభుత్వం సోమవారం నిర్వహించే మంత్రివర్గంలో చర్చించనుంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఒక గడువు విధించింది. జూలై 25 నాటికి స్థానిక ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని, సెప్టెంబరు 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. అయితే జూలై 25 నాటికి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. ఇదే అంశంపై కోర్టులో గతంలో పిటిషన్ వేసిన వారు మరోసారి కోర్టుకు వెళ్లి.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని తెలిపే అవకాశం ఉంది. అదే జరిగితే కోర్టు కూడా దాని మీద ఈసారి కచ్చితమైన ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి. కాగా రాష్ట్రంలో ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు, మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్లు కొలిక్కిరావాలంటే పై రెండింటిలో ఏదో ఒకటి జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Updated Date - Jul 27 , 2025 | 07:16 AM