Meenakshi Natarajan: డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ పరిశీలకులు
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:29 AM
డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను నిర్వహించేందుకు ఏఐసీసీ నుంచి పరిశీలకులు రానున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు.
నెలాఖరు కల్లా మిగిలిన డీసీసీ భేటీలు పూర్తిచేయాలి
టీపీసీసీ పరిశీలకుల సమావేశంలో మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను నిర్వహించేందుకు ఏఐసీసీ నుంచి పరిశీలకులు రానున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. జూలై మొదటి వారంలో ఈ పరిశీలకులను ఏఐసీసీ పంపించనుందన్నారు. ఈ నెలాఖరు కల్లా మిగిలిపోయిన డీసీసీ, మండల, బ్లాకు, డివిజన్ కమిటీల సమావేశాలను పూర్తి చేసి నివేదికలు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ పరిశీలకులను ఆదేశించారు. బ్లాకు, మండల, జిల్లా కమిటీల నియామకానికి సంబంధించి పీసీసీ స్థాయిలో నియమించిన పరిశీలకులతో సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాలకు సంబంధించిన నివేదికలను పరిశీలకులు సమర్పించారు.
అయితే మిగిలిన సమావేశాలను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెలాఖరులోగా నివేదికలు సమర్పించాలని మీనాక్షి సూచించారు. ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నియోజకవర్గానికి ఇద్దరు లేక ముగ్గురు చొప్పున పేర్లతో సీనియారిటీ, వివిధ ప్రతిపాదికల ఆధారంగా ఎంపిక చేసిన జాబితాను పరిశీలకులు సమర్పించారు. కాగా, నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా ఎలాంటి కార్యాచరణను తీసుకోవాలన్న దానిపై టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీలో ప్రాథమికంగా చర్చించారు. ఇందులో మీనాక్షి, మహేశ్ గౌడ్, కమిటీ చైర్మన్ వంశీచంద్‌రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అలాగే కమిటీ విధి విధానాలపైనా చర్చించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటూ జై బాపూ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం సమన్వయకర్తలకు మీనాక్షి సూచించారు. వారితో భేటీ అయిన సందర్భంగా.. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పని చేయాలని చెప్పారు.
Updated Date - Jun 24 , 2025 | 04:29 AM