Tuber Farming Plan: దుంప కూరల సాగు పెంపునకు కార్యాచరణ
ABN, Publish Date - May 21 , 2025 | 05:49 AM
దేశంలో దుంప కూరగాయల వాణిజ్య సాగు పెంపునకు ఐసీఏఆర్ కార్యాచరణ రూపొందిస్తోంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేసి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్
రాజేంద్రనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో దుంప కూరగాయల వాణిజ్యసాగును భారీగా పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల వేదికగా ‘దేశంలో దుంప కూరగాయాల సాగు- అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం’ అంశంపై రెండు రోజులపాటు సదస్సు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి హాజరైన సుధాకర్ పాండే మాట్లాడారు. కందలో డ్రిప్ ఇరిగేషన్, దూది పురుగు యాజమాన్యానికి జీవ నియంత్రణ పద్ధతులు, భూమిలోని మిగిలిన తేమను వాడుకొని దిగుబడి పెంపొందించేలా కార్యాచరణ, పొటాషియం మోతాదును తగ్గించే అంశాలపై పరిశోధనలను ముమ్మరం చేస్తామని తెలిపారు. గ్రామాలను క్లస్టర్లుగా చేసి దుంప పంటలపై ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో భారీగా దుంప కూరల జనక రకాలను సేకరించి పరిశీలించాలని శాస్త్రవేత్తలను కోరారు. సందర్భంగా తెలంగాణకు చెందిన దుంప కూరగాయల రైతులతో శాస్త్రవేత్తల బృందం ముఖాముఖి నిర్వహించింది.
Updated Date - May 21 , 2025 | 05:50 AM