Gulzar House fire: ఏసీ కంప్రెషర్ పేలడంతోనే..
ABN, Publish Date - May 20 , 2025 | 05:42 AM
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదానికి కారణం ఏసీ కంప్రెషర్ పేలుడేనని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. అంబులెన్సులు ఆలస్యంగా రాలేదన్న వాదనను కలెక్టర్ అనుదీప్ తిప్పికొట్టగా, హెచ్‌ఆర్‌సీ జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
‘గుల్జార్ హౌజ్’ అగ్నిప్రమాదానికి కారణమదే?.. ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు!
అంబులెన్స్ 8 నిమిషాల్లో వెళ్లింది: కలెక్టర్
అంబులెన్సుల్లో ఆక్సిజన్ ఉంది: డీహెచ్
హైదరాబాద్ /సిటీ/చార్మినార్, మే 19 (ఆంధ్రజ్యోతి): ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే గుల్జార్ హౌజ్ ప్రాంతంలోని భవనంలో అగ్నిప్రమాదం జరిగిందా? ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతోనే మంటలు వ్యాపించాయా? అంటే అధికారులు అవుననే అంటున్నారు. అగ్ని ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణాధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్ పేలి, పక్కనే ఉన్న విద్యుత్తు మీటర్లకు మంటలు వ్యాపించాయని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టంగా పొగ వ్యాపించిందని అధికారులు చెబుతున్నారు. మంటలు, పొగ వ్యాపించడం తో కుటుంబసభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించారని.. టెర్రస్ నుంచి బయటకు వెళ్లలేక మళ్లీ కిందకు వచ్చారని.. మెట్ల మార్గంలో మంటలు ఎగసిపడడంతో లోపలే ఉండిపోయారని పేర్కొంటున్నారు. అయితే, దర్యాప్తు అంశంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత కుటుంబసభ్యుడు ఉత్కర్ష్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తన తండ్రి వినోద్ మోదీకి గుల్జార్ హౌజ్‌లోని ఇంట్లో ఉన్న రాహుల్ ఫోన్ చేసి అగ్నిప్రమాదం జరిగిందని, కాపాడాలని చెప్పారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకోగా.. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయని తెలిపారు. అప్పటికే డీఆర్‌ఎఫ్,పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఉన్న కృష్ణ పెరల్స్, మోదీ పెరల్స్ దుకాణాల్లోని ముత్యాలతోపాటు ఇతర సామగ్రి, నివాసం భవనంలోని సామగ్రి కాలి బూడిదైందని మోదీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు మృతుల అంత్యక్రియలు చేస్తుండడంతో అగ్నిప్రమాదం జరిగిన ఇంటికి పోలీసులు తాళంవేసి, బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆస్తి నష్టంపై అంచనా వేస్తామని పోలీసులు తెలిపారు.
అంబులెన్సులు వెంటనే రాలేదన్నది అవాస్తవం
అంబులెన్సులు సకాలంలో రాలేదని, బాధితులకు ఆక్సిజన్ సరిగా అందలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఓ ప్రకటనలో తెలిపారు. 15 మంది బాధితులను 7 అంబులెన్సులు, 108 వాహనాల్లో ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6.17 గంటలకు సమాచారం 108 కాల్ సెంటర్‌కు అందిన వెంటనే గోషామహల్ 108 అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఉద యం 6.25 నిమిషాలకు (8 నిమిషాలలో) వెళ్లిందన్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించిన అంబులెన్సుల్లో ఆక్సిజన్ లేదంటూ జరుగుతున్న ప్రచారా న్ని ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) రవీందర్ నాయక్ తప్పుపట్టారు. ఘటనాస్థలి నుంచి ఉదయం 6.25 గంటలకు అంబులెన్స్‌లో తొలిపేషెంట్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మొత్తం 8 అంబులెన్స్‌లను పంపించామన్నారు. ప్రతి అంబులెన్స్‌లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉందని తెలిపారు.
జూన్ 30లోగా నివేదిక ఇవ్వండి: హెచ్‌ఆర్‌సీ
అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన భద్రత, విద్యుత్తు నిర్వహణ, అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదంటూ మీడియాలో వస్తున్న కథనాలపై హెచ్‌ఆర్‌సీ స్పందించింది. కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్.. ప్రమాదంపై సుమోటోగా విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని సీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్ సీఈలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 05:42 AM