Rajashree Job Appointment: తండ్రి చనిపోయిన 19 ఏళ్లకు కారుణ్య నియామకం
ABN, Publish Date - May 28 , 2025 | 05:08 AM
హెడ్ కానిస్టేబుల్ మృతితో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసిన రాజశ్రీకి 19 ఏళ్ల తర్వాత ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని మంజూరు చేశారు.
1996లో హెడ్ కానిస్టెబుల్ మృతి
కారుణ్య నియామకానికి అప్పట్లోనే ఆయన కూతురు రాజశ్రీ దరఖాస్తు
తిరస్కరించిన గత ప్రభుత్వాలు
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్
జూనియర్ అసిస్టెంట్‌గా నియామకం
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి) కారుణ్య నియామకం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆమె, ఎట్టకేలకు సాధించింది. తండ్రి చనిపోయిన 19 ఏళ్ల తర్వాత ఆమెకు కారుణ్య నియామకం లభించింది. ఆమెకు హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్‌కు చెందిన భీమ్ సింగ్, పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 1996 సెప్టెంబరు 24న మృతిచెందారు. కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు రాజశ్రీ దరఖాస్తు చేసుకుంది. వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. కారుణ్య నియామకానికి సంబంధించి రాజశ్రీ ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎంవో అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా రాజశ్రీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకం కల్పించినందుకు రాజశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.
Updated Date - May 28 , 2025 | 05:10 AM