‘రైతు భరోసా’లో కొత్తగా 1.4లక్షల మంది
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:14 AM
రైతుభరోసా పథకంలో కొత్త రైతుల నమోదు ప్రక్రియ పూర్తయింది. జూన్ 5వ తేదీ లోపు భూమి యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులు... రైతు భరోసా పథకంలో నమోదు చేసుకోవడానికి శుక్రవారం(20 తేదీ వరకు) దాకా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
పోర్టల్‌లో నమోదుకు పూర్తయిన గడువు
త్వరలోనే వారి ఖాతాల్లోనూ డబ్బులు జమ
5వ రోజు ఏడు ఎకరాల దాకా రైతు భరోసా: తుమ్మల
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకంలో కొత్త రైతుల నమోదు ప్రక్రియ పూర్తయింది. జూన్ 5వ తేదీ లోపు భూమి యాజమాన్య హక్కులు పొందిన కొత్త రైతులు... రైతు భరోసా పథకంలో నమోదు చేసుకోవడానికి శుక్రవారం(20 తేదీ వరకు) దాకా ప్రభుత్వం అవకాశం కల్పించింది. పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఽఖాతా, ఆధార్ కార్డు జిరాక్సు ప్రతులను రైతుల నుంచి తీసుకొని రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.40 లక్షల మంది రైతులు ఈ వానాకాలం రైతుభరోసాలో కొత్తగా నమోదైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిర్ణీత గడువులోగా ధ్రువ పత్రాలు సమర్పించిన రైతులకు ఈ సీజన్‌లోనే రైతు భరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈనెల 16 తేదీ నుంచే రైతుభరోసా డబ్బుల జమ ప్రారంభం కాగా.. శుక్రవారం నాటికి ఏడు ఎకరాల వరకు చెల్లింపులు చేశారు.
అయితే, కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా చెల్లింపులు చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ చేస్తున్న చెల్లింపులు మొత్తం పూర్తయ్యాక, కొత్త రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించే అవకాశాలున్నాయి. కాగా, శుక్రవారం 2.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.906కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని తెలిపారు. ఎలాంటి పరిమితి విధించకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నామని వివరించారు.
Updated Date - Jun 21 , 2025 | 03:14 AM