Telangana Revenue Department: నేను చెబితేనే ఫైళ్లు పంపాలి!
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:36 AM
రెవెన్యూ శాఖలో ఏదైనా పనికి సంబంధించిన ఫైలుకు.. తొలుత తహసీల్దార్, ఆపై ఆర్డీవో స్థాయిలో ఆమోదం..
ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఓ కలెక్టర్ హుకుం
స్థలాలకు ఎన్‌వోసీ జారీ చేసే ఫైళ్లే ఎక్కువ
ముందుగా కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని..యజమానులకు చెబుతున్న తహసీల్దార్లు
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో ఏదైనా పనికి సంబంధించిన ఫైలుకు.. తొలుత తహసీల్దార్, ఆపై ఆర్డీవో స్థాయిలో ఆమోదం తెలిపితే ఆ తరువాత జిల్లా కలెక్టర్ స్థాయిలో దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ, రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి ప్రాంతంలో పని చేస్తున్న ఓ జిల్లా కలెక్టర్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోల నుంచి వచ్చే ఫైళ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి.. తాను చెబితేనే ఫైళ్లను తన వద్దకు పంపించాలని హుకుం జారీ చేస్తున్నారు. అలా కాకుండా వారే ఫైళ్లను పంపిస్తే మాత్రం చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా రొటీన్‌గా ఫైలు పంపితే.. ఆ కలెక్టర్ వద్ద ఉండే సీసీ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. కలెక్టర్ కంటే కూడా సీసీయే ఎక్కువగా బెదిరింపులకు పాల్పడుతున్నారని కిందిస్థాయి అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుచోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కలెక్టర్.. మరోసారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఈ కలెక్టర్ పరిధిలో ఆదాయ మార్గాలకు అవకాశం ఉన్న ఫైళ్లు, స్థలాలకు నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేసేవే ఎక్కువ ఉంటాయి. అవి కూడా 200 నుంచి 500 గజాల లోపు ఉన్న స్థలాలకు సంబంధించిన ఫైళ్లే ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వాటిపై నేరుగా ఫైళ్లు పంపితే కలెక్టర్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని క్షేత్ర స్థాయి అఽధికారులు వాపోతున్నారు. ఏదైనా సమాచారం ఉంటే తొలుత తన దృష్టికి తేవాలని, ఆ ఫైల్ పెట్టాలా, వద్దా అనే విషయంపై తాను స్పష్టత ఇస్తానని, దానినే అందరూ అనుసరించాలని కలెక్టర్ చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అనుమతుల కోసం తహసీల్దార్లను కలుస్తున్న స్థల యజమానులకు.. ‘ముందుగా కలెక్టర్‌తో మాట్లాడుకొని అక్కడి నుంచి మాకు చెప్పిస్తేనే ఫైలు పంపిస్తాం’ అని సంబంధిత అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అత్యంత కీలకమైన ఆ జిల్లాలో పౌరసరఫరాల వ్యవహారాలు రెవెన్యూ పరిధిలో లేవు. ఈ సబ్జెక్టును చీఫ్ రేషనింగ్ అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే ఆ అధికారాలనూ మనమే ఎందుకు తీసుకోకూడదంటూ ఆర్డీవోలపై కలెక్టర్ ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 05:36 AM