CERT-In: పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ
ABN, Publish Date - Jul 06 , 2025 | 05:44 PM
వివిధ దేశాల వారి 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీకైన నేపథ్యంలో భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఈఆర్‌టీ కీలక సూచనలు చేసింది. తక్షణం యూజర్లు తమ లాగిన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. పాత పాస్‌వర్డ్స్ స్థానంలో స్ట్రాంగ్‌గా ఉన్న వాటిని క్రియేట్ చేసుకోవాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల యూజర్లకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్ ఇటీవల లీకైన నేపథ్యంలో భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ సీఈఆర్‌టీ-ఐఎన్ భారతీయులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, గిట్‌హబ్, వీపీఎన్‌లతో పాటు ఇతర సర్వీసుల యూజర్లు తక్షణం చేపట్టాల్సిన చర్యలను వివరించింది.
సీఈఆర్‌టీ-ఐఎన్ సూచించిన చర్యలు ఏంటంటే..
యూజర్లు తమ లాగిన్ వివరాలు ఇతరుల చేతుల్లో పడకుండా ఉండేందుకు వెంటనే పాస్‌వర్డ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ పోర్టల్స్‌కు సంబంధించిన అకౌంట్‌లు ఉన్న వారు తక్షణం పాస్‌వర్డ్స్‌ను మార్చుకోవాలి. వాటి స్థానంలో అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్‌తో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌ను సిద్ధం చేసుకోవాలి. ఒకే పాస్‌వర్డ్‌ను పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లల్లో లాగిన్‌కు వాడకూడదు.
పాస్‌వర్డ్స్ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వీలైన చోట్ల మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వ్యవస్థను యాక్టివేట్ చేసుకోవాలి. ఆథెంటికేషన్ యాప్స్, హార్డ్‌వేర్ టోకెన్స్, ఎస్‌ఎమ్ఎస్ ఆధారిత వ్యవస్థలతో పాస్‌వర్డ్స్‌కు అదనపు భద్రత జోడించొచ్చు.
ఫిషింగ్ దాడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పాస్‌వర్డ్ రీసెట్, అర్జెంట్ నోటిఫికేషన్‌ల పేరిట వచ్చే లింకులపై అస్సలు క్లిక్ చేయొద్దు. పాస్‌వర్డ్ మేనేజర్స్ సాయంతో ప్రతి సర్వీసు కోసం ప్రత్యేకమైన స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌ను క్రియేట్ చేసుకోవాలి.
ఏమిటీ పాస్‌వర్డ్ లీక్
ఇటీవల వివిధ సర్వీసుల యూజర్లకు చెందిన సుమారు 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీకయ్యాయి. మొత్తం 30 దేశాలకు చెందిన వారి లాగిన్ వివరాలు బయటకుపొక్కాయి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్, ఆథెంటికేషన్ కోడ్స్,సెషన్ కుకీలు, యూజర్లు ఏయే ప్లాట్‌ఫార్మ్‌లతో అనుసంధానమై ఉన్నారో చెప్పే మెటా డేటా లింకులు బయటపడ్డాయి. ఇన్ఫోస్టీలర్ అనే మాల్‌వేర్ తస్కరించిన డేటాతో పాటు సరైన భద్రతా వ్యవస్థ లేని డేటా బేస్‌ల ద్వారా ఈ వివరాలు లీకైనట్టు తెలిసింది. డేటా లీక్ విస్తృతి దృష్ట్యా భారతీయులను అప్రమత్తం చేస్తూ సీఈఆర్‌టీ-ఐఎన్ తాజాగా పలు సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి:
మీ ఫోన్‌కు హ్యాకింగ్ బెడద వద్దనుకుంటే ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి
చాట్‌జీపీటీని గుడ్డిగా నమ్ముతున్నారా.. దీని సృష్టికర్త చేస్తున్న వార్నింగ్ ఏంటో వినండి
Read Latest and Technology News
Updated Date - Jul 06 , 2025 | 06:17 PM