Android Security: మీ ఫోన్‌కు హ్యాకింగ్ బెడద వద్దనుకుంటే ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 07:39 PM
మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్‌ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని కాలంలో మనం జీవిస్తున్నాం. ఉద్యోగం, చదువు మొదలు ఎంటర్‌టైన్మెంట్ వరకూ అన్నింటికి స్మార్ట్ ఫోన్‌లే సాధనంగా మారిపోయాయి. కొందరు వ్యక్తిగత వివరాలను కూడా ఫోన్‌లో దాచుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఫోన్ హ్యాకింగ్‌కు గురైతే కలిగే నష్టాన్ని భరించడం ఎవరి వల్లా సాధ్యం కాదు. కాబట్టి, మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్లకు టార్గెట్‌గా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఏ యాప్‌నైనా సరే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర విశ్వసనీయమైన వేదికల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇతర సైట్ లేదా సోర్స్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ మాల్‌వేర్ ముప్పును తెచ్చిపెడతాయి.
స్మార్ట్ ఫోన్ ఓఎస్, ఇతర యాప్‌లు నిత్యం అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌లో సెక్యూరిటీ, పనితీరు లోపాలను సరిదిద్దే అనేక ఫిక్సెస్ అప్‌డేట్స్‌లో ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు. ఔట్‌డేటెడ్ యాప్స్, సాఫ్ట్‌వేర్‌ల ఆధారంగా హ్యాకర్లు ఫోన్‌లను తమ నియంత్రణలోకి తీసుకుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇప్పటికే ఫోన్‌లో ఉన్న యాప్స్‌ను సమీక్షించుకోవాలి. మీరు వాడని, మీకు అంతగా తెలియనివి ఏమైనా ఉంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. దీంతో, ప్రమాదకరమైన యాప్‌ల ముప్పు తొలగించుకున్నట్టు అవుతుంది.
మీ అనుమతి లేకుండా ఫోన్‌ను ఎవరూ చూడకుండా పాస్‌వర్డ్స్, పిన్స్, లేదా బయోమెట్రిక్‌తో లాక్ చేసుకోవాలి. దీంతో, డివైజ్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా సమాచార భద్రత, గోప్యతకు ఎలాంటి ఢోకా ఉండదు.
స్మార్ట్ ఫోన్‌లల్లో యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పనిసరి. ఫోన్‌లోకి చొరబడే మాల్‌వేర్‌లను ఇది ముందుగానే అడ్డుకుని ముప్పును తప్పిస్తుంది.
బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే ఉచిత వైఫై నెట్‌వర్క్‌ను వాడుకోకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై వినియోగం తప్పదని అనుకుంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసుకుని ఎన్‌క్రిప్టెడ్‌గా సమాచారాన్ని పంచుకోవచ్చు.
వీటితో పాటు కొత్తగా వస్తున్న సైబర్ ముప్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమయానికి తగ్గట్టు అప్రమత్తంగా వ్యవహరిస్తే మీ స్మార్ట్ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీని గుడ్డిగా నమ్ముతున్నారా.. దీని సృష్టికర్త చేస్తున్న వార్నింగ్ ఏంటో వినండి
చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా
Read Latest and Technology News