ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నవతరం నాయకుడు వచ్చాడు

ABN, Publish Date - May 25 , 2025 | 05:43 AM

టెస్టుల్లో కొన్నేళ్లుగా జట్టుకు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్‌, కోహ్లీ ఒక్కసారిగా గుడ్‌బై చెప్పడంతో.. సంధి దశలో ఉన్న టీమిండియాను నడిపించే నవతరం నాయకుడిగా శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాడు...

శుభ్‌మన్‌ గిల్‌కే టెస్టు జట్టు పగ్గాలు

సుదర్శన్‌, అర్ష్‌దీప్‌కు పిలుపు

  • వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌

  • బుమ్రా ఆడేది కొన్ని మ్యాచ్‌లే

  • ఫిట్‌నెస్‌ లేమితో షమి అవుట్‌

టెస్టుల్లో కొన్నేళ్లుగా జట్టుకు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్‌, కోహ్లీ ఒక్కసారిగా గుడ్‌బై చెప్పడంతో.. సంధి దశలో ఉన్న టీమిండియాను నడిపించే నవతరం నాయకుడిగా శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాడు. యువ సారథిగా భవిష్యత్‌ భారత జట్టును నిర్మించనున్నాడు. ఇంగ్లండ్‌ టూర్‌లో గిల్‌ నూతన ప్రస్థానం ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో అదరగొడుతున్న సాయి సుదర్శన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు తొలిసారి రెడ్‌బాల్‌ జట్టులో చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్‌ నాయర్‌కు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.


ముంబై: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత జట్టు పగ్గాలు అందుకొనేది ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. ఊహాగానాలకు తగినట్టుగానే భారత టెస్టు జట్టు కొత్త కొప్టెన్‌గా 25 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చేనెల 20 నుంచి జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే టీమిండియాను శనివారం సెలెక్టర్లు ప్రకటించారు. డాషింగ్‌ బ్యాటర్‌, 27 ఏళ్ల రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. రోహిత్‌, కోహ్లీ రిటైర్మెంట్‌ తర్వాత సంధి దశలో ఉన్న భారత జట్టుకు అంతగా అనుభవం లేని 18 మంది సభ్యుల జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసి ఒకరకంగా సాహసమే చేశారు. 32 టెస్టులు ఆడిన గిల్‌ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. కాగా, ఈ పర్యటన నుంచి పెద్దగా ఆశిస్తున్నదేమీ లేని నేపథ్యంలో గిల్‌ సాధించే అనుభవం భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని సెలెక్టర్లు చెబుతున్నారు. ‘ఏడాది క్రితమే గిల్‌పై దృష్టిసారించాం. భవిష్యత్‌లో భారత జట్టును నడిపించగల సామర్థ్యం అతడిలో ఉందని భావించాం’ అని చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నాడు. కాగా, సుదీర్ఘ సిరీస్‌కు ఫిట్‌గా ఉండడన్న కారణంతో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమిని జట్టు నుంచి తప్పించారు. అయితే, వైద్యుల సూచనల మేరకు షమిని పరిగణనలోకి తీసుకోలేదని అగార్కర్‌ తెలిపాడు. అతడి స్థానంలో ఐపీఎల్‌లో అదరగొ డుతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ను తొలిసారి టెస్టులకు ఎంపిక చేసినట్టు చెప్పా డు. ‘ఐపీఎల్‌ సందర్భంగా గతవారం గాయానికి గురైన షమి ఇటీవలే ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయించుకొన్నాడు. అయితే, సిరీస్‌కు అతను ఫిట్‌గా ఉండడని వైద్యులు తేల్చారు’ అని అగార్కర్‌ తెలిపాడు. మొత్తంగా టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (2025-27) కోసం భారత జట్టు నిర్మాణం ఇంగ్లండ్‌ సిరీస్‌తో ఆరంభమవుతుంది. గిల్‌ భారత టెస్టు జట్టుకు 37వ కెప్టెన్‌.

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), యశస్వి జైస్వాల్‌, రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, నితీశ్‌ కుమార్‌, జడేజా, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ యాదవ్‌.


పిన్న వయసులో భారత టెస్టు జట్టు సారథిగా ఎంపికైన ఐదో ఆటగాడు గిల్‌ (25 ఏళ్ల 258 రోజులు). మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి (21 ఏళ్లు), సచిన్‌ (23 ఏళ్లు), కపిల్‌ దేవ్‌ (24 ఏళ్లు), రవిశాస్త్రి (25 ఏళ్ల 229 రోజులు).. గిల్‌ కంటే ముందున్నారు.


నాయర్‌.. 8 ఏళ్ల తర్వాత

రోహిత్‌, కోహ్లీ స్థానాల్లో సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌ జట్టులోకొచ్చారు. ఈ ఐపీఎల్‌లో పరుగుల వరదపారిస్తున్న గుజరాత్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌కు తొలిసారి పిలుపు అందగా.. ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్‌లో సుదర్శన్‌ 638 రన్స్‌ చేసి టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇక, నాయర్‌ చివరిసారిగా 2017లో టెస్టు ఆడాడు. సెహ్వాగ్‌ తర్వాత టీమిండియాలో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన కరుణ్‌.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, దేశవాళీలో మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్ల తలుపులు తడుతూనే ఉన్నాడు. అయితే కోహ్లీ రాజీనామాతో నాయర్‌కు అదృష్టం కలిసొచ్చింది. పేసర్‌ హర్షిత్‌ రాణా, బ్యాటర్లు శ్రేయాస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. అయితే, సర్ఫరాజ్‌కంటే అనుభవజ్ఞుడైన నాయర్‌కు సెలెక్టర్లు ఓటేశారు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఫిట్‌నెన్‌ సమస్య లతో చోటు కోల్పోయాడు.


బుమ్రాకు ఎందుకు వద్దంటే..?

కెప్టెన్సీ కోసం గిల్‌తోపాటు బుమ్రా పేరు గట్టిగానే వినిపించింది. అయితే, ఫిట్‌నెస్‌ ఇబ్బందుల కారణంగానే బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించలేదు. అసలు సిరీస్‌లోని ఐదు టెస్ట్‌లకు బుమ్రా అందుబాటులో ఉండడం కష్టమేనని అగార్కర్‌ అన్నాడు. బుమ్రాపై పని ఒత్తిడి భారం పడకుండా చూడాలని ఫిజియో, వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బుమ్రా రెండు, మూడు టెస్టులకే అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని అగార్కర్‌ పేర్కొన్నాడు. రిజర్వు ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. అయితే, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ సామర్థ్యంపై సందేహాలుండ డంతో.. శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా జట్టులో చోటిచ్చారు. శార్దూల్‌ చివరిగా 2023లో టెస్టు ఆడాడు. గత ఇంగ్లండ్‌ పర్యటనలో ఓవల్‌ టెస్ట్‌లో శార్దూల్‌ వరుసగా అర్ధ శతకాలు బాదడంతో భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే.


ఇక ‘శుభ్‌’ ఆరంభం!

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

టెస్టుల్లో రోహిత్‌ వారసుడిగా 25 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌కు టెస్టు పగ్గాలు అప్పగించారు. భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన విరాట్‌, రోహిత్‌ దూరమైన వేళ ఈ సంధి దశను అధిగమించేందుకు బీసీసీఐ ఈ యువ ఆటగాడిపై భరోసా ఉంచడం విశేషమే. అరంగేట్రం చేసిన ఐదేళ్లకే కెప్టెన్‌గా అందలం దక్కడంతో గిల్‌ కెరీర్‌ గ్రాఫ్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. 2018 అండర్‌-19 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌పై సెంచరీతో గిల్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటి కోచ్‌ ద్రవిడ్‌ పట్టుబట్టి మరీ గిల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ టూర్‌లో ఇండియా ‘ఎ’ తరఫున రాణించాడు. అలాగే వెస్టిండీస్‌ ‘ఎ’తో జరిగిన టెస్టులో డబుల్‌ సెంచరీతో వెనుదిరిగి చూడలేదు. చక్కటి టెక్నిక్‌, టెంపర్‌మెంట్‌ కలిగిన బ్యాటింగ్‌ కారణంగా 2019లోనే వన్డే జట్టులోకొచ్చాడు. అయితే గిల్‌ సక్సెస్‌ వెనుక అతడి తండ్రి లఖ్విందర్‌ కృషి ఎనలేనిది. కొడుకు దృష్టంతా క్రికెట్‌పైనే ఉండేందుకు తమ గ్రామం నుంచి మొహాలీకి మకాం మార్చాడు. కొన్నేళ్లపాటు బంధువుల వివాహాలకు కూడా హాజరుకాలేదట. అప్పటి త్యాగాలకు ప్రస్తుతం ఘనమైన ప్రతిఫలమే దక్కింది. పాతికేళ్ల వయస్సులోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టును నడిపించే స్థాయికి ఎదిగాడు. మరోవైపు ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదే అయినా.. భారత టెస్టు జట్టు గిల్‌ ఆధ్వర్యంలో శుభ్‌’ ఆరంభంగా కొనసాగాలని ఆశిద్దాం.



ఆ ఇద్దరి లోటు పూడ్చలేనిది: అగార్కర్‌

జట్టులో రోహిత్‌, కోహ్లీ లేని లోటును పూడ్చడం కష్టమేనని అగార్కర్‌ అన్నాడు. కానీ, రాబోయే ఇంగ్లండ్‌ టూర్‌లో మిగతా ఆటగాళ్లు ఆ బాధ్యతలు అందుకొంటారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఈ నెల 7న రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. 12న కోహ్లీ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్టు బాంబ్‌ పేల్చాడు. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత గత నెలలోనే తాను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకొంటు న్నట్టు కోహ్లీ తనకు చెప్పాడని అగార్కర్‌ తెలిపాడు.


ఇవీ చదవండి:

బయటపడిన ఆర్సీబీ వీక్‌నెస్

టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 05:43 AM