RCB IPL 2025: బయటపడిన ఆర్సీబీ వీక్‌నెస్.. ఈసారీ కప్పు కష్టమే!
ABN , Publish Date - May 24 , 2025 | 05:28 PM
తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. కానీ అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఫుల్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టు కాస్తా.. ఒక్క ఓటమితో బలహీనతల్ని బయటపెట్టుకుంది.
ఐపీఎల్-2025 ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కానీ సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ వరుస విజయాలతో ఫేవరెట్స్‌లో ఒకటిగా మారింది ఆర్సీబీ. సగం మ్యాచులు పూర్తయ్యేసరికి టాప్ స్పాట్‌కు చేరుకుంది. సీజన్ రీస్టార్ట్ అవగానే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకొని ఈసాలా కప్ నమ్దే అంటూ అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఒకే ఒక్క ఓటమి ఆ టీమ్‌లోని పలు బలహీనతల్ని బయటపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన పోరులో 42 పరుగుల భారీ తేడాతో పరాభవం పాలైంది కోహ్లీ టీమ్. ఈ ఓటమితో ఫైనల్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకోవడమే గాక తమ అభిమానుల్ని ఆందోళనలోకి నెట్టేసింది. అసలేం జరిగిందంటే..
అంతా హ్యాండ్సప్
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండింట్లో దారుణంగా విఫలమైంది ఆర్సీబీ. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, యశ్ దయాల్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. రొమారియో షెఫర్డ్ తప్పితే అందరూ వికెట్ల వేటలో వెనుకబడ్డారు. బ్యాటింగ్‌లో సాల్ట్-కోహ్లీ అద్భుతమైన ఆరంభం అందించినా లాభం లేకపోయింది. మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా.. ఇలా అందరూ విఫలమయ్యారు. మంచి స్టార్ట్‌ను యూజ్ చేసుకోలేదు. వీళ్లలో ఏ ఇద్దరు ఆఖరి వరకు బ్యాటింగ్ చేసినా టీమ్ విజయానికి చేరువయ్యేది. బౌలింగ్‌లో రాణించిన షెఫర్డ్.. బ్యాటింగ్‌లో చేతులెత్తేశాడు. టిమ్ డేవిడ్ గాయం కూడా టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది.
కోహ్లీ ఆడకపోతే అంతేనా..
కోహ్లీ ఔట్ అయితే ఆర్సీబీ పరిస్థితి అంతేనా.. చేజింగ్‌లో చేతులెత్తేయడం తప్ప వేరే ఆప్షన్ లేదా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 200కి పైచిలుకు టార్గెట్‌ను ఛేదించడం బెంగళూరుకు కష్టమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిడిలార్డర్-లోయరార్డర్‌లో ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలబడకపోవడం, పట్టుదలతో ఆడకపోవడంతో ప్లేఆఫ్స్‌లో ఇలాగే ఆడితే కప్పు వచ్చినట్లే అని సోషల్ మీడియాలో నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. గాయంతో బాధపడుతున్న టిమ్ డేవిడ్ మిగిలిన మ్యాచుల్లో ఎంతవరకు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. హేజల్‌వుడ్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఎంగిడి ప్లేఆఫ్స్‌కు ముందే సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేస్తాడు. దీంతో బెంగళూరు కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. బ్యాటింగ్‌లో కోహ్లీ మీద అతిగా ఆధారపడటం బలహీనత అనే చెప్పాలి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇలా చాలా వీక్‌నెస్‌లు బయటపడటంతో తదుపరి మ్యాచుల్లో వీటిని అధిగమిస్తే గానీ ట్రోఫీ కలను కోహ్లీ టీమ్ నెరవేర్చుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు
కోహ్లీ రిటైర్‌మెంట్‌పై బీసీసీఐ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి