IPL 2025 RCB vs CSK: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీదే పైచేయి.. పోరాడి ఓడిన చెన్నై
ABN, Publish Date - May 03 , 2025 | 11:31 PM
క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజా అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను చివరి బంతి వరకు అలరించింది. చివరకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజా అందింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను చివరి బంతి వరకు అలరించింది. చివరకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రెండు పరుగుల తేడాతో చెన్నైపై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలకు దూరమై ఈ సీజన్ ట్రోఫీకి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు ప్రదర్శించింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే (94) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ జాకబ్ బెతల్ (55) కూడా చక్కగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగుల జోడించారు.
చివర్లో షెపర్డ్ (14 బంతుల్లో 53 పరుగులు) ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి బెంగళూరుకు భారీ స్కోరు అందించాడు. సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియంను హోరెత్తించాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మహేష్ పతిరణ మూడు వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్, సామ్ కరన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై దీటుగా స్పందించింది. ఆయుష్ మాత్రే (94) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ షేక్ రషీద్ (14)తో కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. రషీద్ అవుటైన తర్వాత వచ్చిన సామ్ కరన్ (5) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (74) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆయుష్‌తో కలిసి మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించాడు. సెంచరీకి చేరువలో ఉండగా ఆయుష్ అవుటయ్యాడు.
ఆ తర్వాత బంతికే బ్రేవిస్ పెవిలియన్ చేరాడు. చివర్లో ధోనీ (12) చెన్నైకు గెలిపించడానికి ప్రయత్నించాడు. అయితే బెంగళూరు బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ చివరి వరకు వచ్చింది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో చెన్నై బ్యాటర్ సింగిల్ మాత్రమే చేయడంతో ఆర్సీబీ విజయం సాధించింది.
Updated Date - May 03 , 2025 | 11:32 PM