IPL 2025: చివరి నిమిషంలో విమానం దిగిన పంజాబ్ కోచ్ పాంటింగ్.. అసలేం జరిగిందంటే
ABN, Publish Date - May 11 , 2025 | 06:34 PM
ఐపీఎల్‌లో పాల్గొంటున్న చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ తమ స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం శనివారం వరకు భారత్‌లోనే ఉన్నాడు. అయితే ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా లేవని ఆస్ట్రేలియాకు వెళ్లిపోదామనుకున్నాడు.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL 2025)ను వారం రోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ తమ స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే పంజాబ్ కింగ్స్ (PBKS) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) మాత్రం శనివారం వరకు భారత్‌లోనే ఉన్నాడు. ఇక, ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా లేవని భావించి ఆస్ట్రేలియాకు వెళ్లిపోదామనుకున్నాడు. శనివారం సాయంత్రం ఆస్ట్రేలియా విమానం ఎక్కడానికి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
రికీ పాంటింగ్ ఢిల్లీలో విమానం ఎక్కిన తర్వాత కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దీంతో పాంటింగ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా విమానం దిగిపోయాడు. ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు పంజాబ్ జట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లను కూడా స్వదేశాలకు వెళ్లకుండా ఆపాడు. పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న మార్కస్ స్టోయినిస్, జాష్ ఇంగ్లీస్, బార్ట్‌లెట్, ఆరోన్ హార్టీ తమ స్వదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
వారి ప్రయాణం గురించి తెలుసుకున్న పాంటింగ్ వారితో మాట్లాడాడు. కాల్పుల విరమణ గురించి చెప్పి వారిలో ధైర్యం నింపాడు. వారు భారత్‌లోనే ఉండేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే పంజాబ్ జట్టులో కీలక ఆటగాడైన మార్కోస్ యన్‌సెన్ (దక్షిణాఫ్రికా) మాత్రం దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడు తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ పంజాబ్ జట్టుతోనే ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 11 , 2025 | 06:34 PM