గిల్ సేనకు కఠిన సవాల్
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:18 AM
పాతికేళ్ల కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడబోతోంది. క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ సిరీస్ శుక్రవారం....
మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
సంధి దశలో టీమిండియా
నేటి నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
లీడ్స్: పాతికేళ్ల కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడబోతోంది. క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ సిరీస్ శుక్రవారం నుంచే ఆరంభం కాబోంది. అలాగే ఇందులో భాగంగా జరిగే తొలి టెస్టుకు హెడింగ్లీ వేదిక కానుంది. అయితే దశాబ్దాలుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, స్పిన్నర్ అశ్విన్ లేకుండానే భారత జట్టు ఇప్పుడు బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అదికూడా అత్యంత కఠిన పరిస్థితులు ఎదురయ్యే ఇంగ్లండ్ గడ్డపై కావడం గమనార్హం. ప్రస్తుతం సంధిదశలో ఉన్న జట్టును కోచ్ గంభీర్ సహకారంతో కెప్టెన్ గిల్ ఎలా ముందుకు తీసుకెళ్లగలడన్న ఆసక్తి నెలకొంది. గత 93 ఏళ్లుగా ఇక్కడ పర్యటిస్తున్నా.. కేవలం మూడు సార్లు (1971, 1986, 2007) మాత్రమే భారత జట్టు సిరీ్‌సను సాధించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక హెడింగ్లీలో భారత జట్టు ఏడుసార్లు ఆడితే ఓ మ్యాచ్ డ్రా చేసుకుని కేవలం రెండింట్లోనే నెగ్గింది.
బ్యాటింగ్ ప్రభావమెంత?
ఇంగ్లండ్ పిచ్‌లపై భారత బ్యాటర్లు ఏమేరకు ప్రభావం చూపగలరనే సందేహం నెలకొంది. ఓపెనర్ జైస్వాల్ ఇక్కడ మొదటిసారి ఆడబోతున్నాడు. ఇక అతడికి జతగా రాహుల్ దిగే అవకాశముంది. సాయి సుదర్శన్‌కు అరంగేట్రం చాన్సిస్తే వన్‌డౌన్‌లో రావచ్చు. ఇక కీలక నాలుగో నెంబర్‌లో కెప్టెన్ గిల్ ఖాయమే. ఆ తర్వాత పంత్, కరుణ్ నాయర్ దిగవచ్చు. అయితే ఇంగ్లండ్‌లో గిల్ 3 టెస్టులు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు. గత పర్యటనలో రాహుల్, పంత్ శతకాలు సాధించారు. అలాగే బౌలింగ్ విభాగంలో పేసర్ బుమ్రాపైనే అధికంగా ఆధారపడింది. సిరాజ్, ప్రసిద్ధ్ ఇతర పేసర్లుగా బరిలోకి దిగనున్నారు. ఒకే స్పిన్నర్‌ను తీసుకుంటే అది జడేజానే అవుతాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కుమార్ కంటే శార్దూల్ ఠాకూర్‌కే చాన్సులున్నాయి.
జో రూట్ అండగా..
అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేని ఇంగ్లండ్ బౌలింగ్ దళం కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. పేసర్లు వోక్స్, కార్స్, టంగ్, స్పిన్నర్ బషీర్ భారత బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. అయితే బ్యాటింగ్ విభాగం మాత్రం పటిష్టంగానే ఉంది. 36 శతకాలు, 13వేలకు పైగా టెస్టు పరుగులు సాధించిన జో రూట్ జట్టుకు కొండంత అండగా చెప్పవచ్చు. వన్‌డౌన్‌లో రానున్న ఒల్లీ పోప్ జింబాబ్వేపై 170 రన్స్‌తో ఫామ్ కనబర్చాడు. క్రాలే, డకెట్ శుభారంభం అందిస్తే రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్‌లతో కూడిన మిడిలార్డర్ భారీ స్కోరు అందించే అవకాశం ఉంది. 8వ స్థానంలో వచ్చే వోక్స్ ఖాతాలో ఓ సెంచరీ ఉంది.
తుది జట్లు
భారత్ (అంచనా): రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, కరుణ్ నాయర్, జడేజా, శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌ల్లో కలిపి ఎక్కువ రన్స్ సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు జో రూట్ మరో 179 పరుగులు సాధిస్తే చాలు. ప్రస్తుతం విరాట్ (4036) టాప్‌లో, సచిన్ (3990) రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు గవాస్కర్ (16) పేరిట ఉన్నాయి. రూట్ మరో ఆరు అర్ధసెంచరీలు సాధిస్తే ఈ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది.
పిచ్, వాతావరణం
లీడ్స్‌లో శుక్రవారం 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. దీనికి తోడు పిచ్‌పై 8 మి.మీ మేర పచ్చిక ఉండడంతో ఆరంభంలో వికెట్ సీమర్లకు అనుకూలించనుంది. అయితే సమయం గడిచేకొద్దీ పిచ్ పొడిబారి బ్యాటింగ్‌కు సులువుగా మారుతుంది. దీంతో బ్యాటర్లు ఓపిగ్గా నిలిస్తే భారీ స్కోర్లు ఖాయమే. ఆకాశం మబ్బులతో కూడి ఉన్నా వర్షం పడే అవకాశం లేదు.
ఆ విజయం ఐపీఎల్‌కంటే పెద్దది
‘ఐపీఎల్ ప్రతీ ఏడాది వస్తుంటుంది. అలాగే ప్రతీ సీజన్‌లోనూ గెలిచే అవకాశా లుంటాయి. కానీ ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, కివీస్‌లలో ఆడి టెస్టు సిరీస్ గెలవడం ఐపీఎల్‌కన్నా మిన్న. ఇక టెస్టు జట్టుకు నాయకత్వం వహించడాన్ని అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ఈ ఫార్మాట్‌లో ఎన్ని పరుగులు సాధించినా 20 వికెట్లు తీయలేకపోతే గెలుపు సాధ్యం కాదు. మా బౌలర్ల లక్ష్యం కూడా అదే’
గిల్
బుమ్రాకు భయపడం..
‘బుమ్రా అద్భుత బౌలర్. కచ్చితంగా తను ప్రమాదకారే. కానీ మేం కేవలం ఒక్క బౌలర్‌పై దృష్టి సారించి ముందుకెళ్లలేం. అంతర్జాతీయ క్రికెట్‌లో భయమనేది ఉండదు. అతడొక్కడే సిరీస్‌ను గెలిపిస్తాడని భావించలేం. సమష్టి ప్రదర్శన వల్లే విజయం వరిస్తుంది. అలాగే విరాట్, రోహిత్, అశ్విన్ లేని భారత జట్టును మేమేమీ తేలిగ్గా తీసుకోవడం లేదు’ - స్టోక్స్
శుభ్‌మన్‌కు సమయమివ్వాలి
సచిన్ టెండూల్కర్
న్యూఢిల్లీ: సంధి దశలో ఉన్న భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్‌కు తగినంత సమయం, సహకారం అందిస్తే విజయాలను అందుకోగలడని సచిన్ టెండూల్కర్ అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ బయట నుంచి వచ్చే వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా.. తనదైన వ్యూహంతో సాగాలని కొత్త కెప్టెన్‌కు మాస్టర్ సలహా ఇచ్చాడు. ఇక, ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటర్లు తమ ఆటతీరును మార్చుకోవాలని సూచించాడు. లీడ్స్ వికెట్ సంక్లిష్టమైనదని సచిన్ అభిప్రాయపడ్డాడు. పిచ్ పొడిబారి ఉండడంతో తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటుదక్కే అవకాశం ఉందన్నాడు. జడేజాతోపాటు సుందర్ లేదా కుల్దీ్‌పను తీసుకోవచ్చన్నాడు.
అన్నీ సవాళ్లే..: ఇంగ్లండ్ పరిస్థితులు కెప్టెన్ గిల్‌కు సవాళ్లు విసురుతాయని భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నాడు. ఇక్కడ విజయాలు సాధించాలంటే ఓర్పు, నేర్పు అవసరమని చెప్పాడు. ఈ పర్యటనతో గిల్ ఎంతో కొంత అనుభవం గడిస్తాడన్నాడు. కాగా, గొప్ప నాయకుడిగా ఎదిగే లక్షణాలు గిల్‌లో ఉన్నాయని భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చెప్పాడు. అంతర్జాతీయ వేదికపై సత్తాచాటడానికి అతడు సిద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానన్నాడు.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 20 , 2025 | 06:03 AM