Former Kho Kho Star Sarangapan: ఆటగాడిగా గెలిచి.. జీవితంలో ఓడి..
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:50 AM
ఖోఖో క్రీడనే ప్రాణంగా భావించి.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రానికి, దేశానికి ఎన్నో పతకాలు అందించాడు
అనారోగ్యంతో కన్నుమూసిన ఖోఖో మాజీ ఆటగాడు సారంగపాణి
ఖోఖో క్రీడనే ప్రాణంగా భావించి.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రానికి, దేశానికి ఎన్నో పతకాలు అందించాడు. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం పేదరికం, కష్టాలతో సహవాసం చేశాడు. బతికినంతకాలం ఆర్ధిక ఇబ్బందులతోనే సతమతమై, చివరకు అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు. అతనే తెలంగాణకు చెందిన ఖోఖో మాజీ ఆటగాడు, 50 ఏళ్ల సారంగపాణి. అంతర్జాతీయ పోటీల్లో 21 సార్లు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సారంగపాణి.. శుక్రవారం ఉదయం తన స్వస్థలమైన వరంగల్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు.
ఆటలో అదరగొట్టినా..
తొంభయ్యో దశకంలో భారత ఖోఖోలో తిరుగులేని డిఫెండర్‌గా పేరు తెచ్చుకున్న సారంగపాణి.. కోల్‌కతా వేదికగా 1996లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో టీమిండియా స్వర్ణ పతకం గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. 1999లో మణిపూర్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తన సారథ్యంలో కాంస్య పతకం అందించాడు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 30కిపైగానే పతకాలు కొల్లగొట్టాడు. అమోఘమైన ప్రదర్శనతో తన క్రీడలో వెలుగొందిన అతను.. ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేక జీవితంలో మాత్రం ఓడిపోయాడు.
సరైన గుర్తింపు, ఉపాధి లేక..
క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక సారంగపాణి కొన్నాళ్లు వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కాంట్రాక్టు కోచ్‌గా పని చేశాడు. ఆ తర్వాత నిధుల కొరతతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో నాయీ బ్రాహ్మణుడైన అతను కుల వృత్తి చేసుకుంటూ జీవనం వెళ్లదీశాడు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడినైన తనకు కనీసం చిన్న ఉద్యోగం కానీ, నగదు ప్రోత్సాహకం కానీ లభించకపోవడంపై సారంగపాణి తరచూ మధనపడేవాడని అతని సన్నిహితులు తెలిపారు. కోచ్‌గా కాకపోయినా, స్వీపర్ ఉద్యోగమైనా ఇవ్వాలని నెలరోజుల క్రితమే అతను కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఇక, జీవితంలో స్థిరపడలేదన్న కారణంతో అతను పెళ్లి కూడా చేసుకోలేదన్నారు.
ప్రభుత్వాలు అండగా నిలవాలి
క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి కొన్ని క్రీడలకే ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల సారంగపాణిలాంటి ప్రతిభావంతులైన అంతర్జాతీయ క్రీడాకారులు ప్రపంచానికి తెలియకుండానే కనుమరు గవుతున్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ వంటి గ్రామీణ క్రీడలతో పాటు స్విమ్మింగ్, హ్యాండ్‌బాల్ వంటి ఒలింపిక్ క్రీడల అభివృద్ధి, ఆ క్రీడాకారుల సంక్షేమంపై కూడా ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు దృష్టి పెట్టాలని క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వాళ్లకు ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
Updated Date - Aug 09 , 2025 | 03:50 AM