Hospital Negligence: డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషంట్ ప్రాణం పోతుందని తెలిసినా..
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:56 PM
Hospital Negligence: సునీల్‌కు వైద్యం చేయడానికి అక్కడ ఉన్న డాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. పలుమార్లు బతిమాలినా పట్టించుకోలేదు. ఓ డాక్టర్ కుర్చీలో కూర్చుని నిద్రపోయాడు తప్పితే.. వైద్యం చేయడానికి రాలేదు.
‘వైద్యో నారాయణో హరి’ అంటారు. వైద్యం చేసే వాడు దేవుడితో సమానం అని దానర్థం. వైద్యం చేసి ప్రాణం పోయాల్సిన డాక్టర్లే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణం పోగొట్టుకుంటున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్రగాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాధితుడికి వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ హాయిగా నిద్రపోయాడు. మిగిలిన డాక్టర్లూ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు.
దీంతో అతడి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరట్, హాసన్‌పుర్ కాలా గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే యువకుడిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సునీల్‌ను మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే సునీల్ కుటుంబసభ్యులు, ఊరి పెద్ద జగ్గీ కూడా ఆస్పత్రికి వెళ్లారు.
సునీల్ బంధువులు చెబుతున్న దాని ప్రకారం.. సునీల్‌కు వైద్యం చేయడానికి అక్కడ ఉన్న డాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. పలుమార్లు బతిమాలినా పట్టించుకోలేదు. ఓ డాక్టర్ కుర్చీలో కూర్చుని నిద్రపోయాడు తప్పితే.. వైద్యం చేయడానికి రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఓ డాక్టర్ వారి దగ్గరకు వచ్చాడు. ఎక్స్ రే తీయకుండానే కాలు తీసేయాలని అన్నాడు. ఆపరేషన్ చేయడానికి ఫామ్ మీద సంతకాలు పెట్టమంటూ కుటుంబసభ్యుల్ని బలవంతం చేశాడు.
చాలా సేపటి ఆలస్యం తర్వాత అతడ్ని అడ్మిట్ చేసుకున్నారు. అయితే, అప్పటికే సునీల్ పరిస్థితి విషమించింది. చికిత్సపొందుతూ అతడు చనిపోయాడు. మరుసటి రోజు ఉదయం పెద్దసంఖ్యలో గ్రామస్థులు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏసీ గుప్తాను కలిశారు. విధుల్లో అలసత్వం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
స్టార్ హీరో ఫ్యాన్స్‌పై హీరోయిన్ పోలీస్ కంప్లైంట్
షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..
Updated Date - Jul 28 , 2025 | 06:08 PM