ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YouTube: ఆ ఊర్లో యూట్యూబ్‌ సిరులు..

ABN, Publish Date - Jul 20 , 2025 | 10:56 AM

పల్లెటూరు అనగానే ఏం గుర్తుకొస్తుంది? పంటపొలాలు, రైతులు, కూలీలు, ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు.. ఇవే కదా! కానీ ఛత్తీస్‌గఢ్‌లోని తుల్సి గ్రామానికి వెళితే.. ఎక్కడ చూసినా షూటింగ్‌ బృందాలే కనువిందు చేస్తాయి. కెమెరాల సందడి చెప్పక్కర్లేదు. నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో ఆ ఊరు మినీ ఫిల్మ్‌నగర్‌ను తలపిస్తుంది.

పల్లెటూరు అనగానే ఏం గుర్తుకొస్తుంది? పంటపొలాలు, రైతులు, కూలీలు, ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు.. ఇవే కదా! కానీ ఛత్తీస్‌గఢ్‌లోని తుల్సి గ్రామానికి వెళితే.. ఎక్కడ చూసినా షూటింగ్‌ బృందాలే కనువిందు చేస్తాయి. కెమెరాల సందడి చెప్పక్కర్లేదు. నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో ఆ ఊరు మినీ ఫిల్మ్‌నగర్‌ను తలపిస్తుంది. దేశంలోనే అత్యధిక యూట్యూబర్స్‌తో పేరుతెచ్చుకున్న తుల్సి గ్రామం ఇప్పుడందర్నీ ఆకర్షిస్తోంది..

‘‘ఏంది మామా.. మేమేమైనా రాళ్లు కొట్టడానికి రమ్మన్నామా? లేదంటే వరినాట్లు వేయడానికి పిలిచామా? ఏదో యూట్యూబ్‌ ఛానల్‌ కోసం షూటింగ్‌కు రమ్మన్నామంతే!. ఈ మాత్రానికే నీ ఇంటి చుట్టూ ఇన్నిసార్లు తిప్పుకోవాలా? ఏ రోజు కూలీ ఆ రోజే చేతిలో పెట్టేసి, భోజనం కూడా పెడతామని బతిమాలుతున్నా రావడం లేదు నువ్వు!’’

‘‘లేదులే అల్లుడూ.. ఏమీ అనుకోవద్దు. నిన్న రాత్రి నుంచీ మా అత్త కొడుకు వెంటపడతానే ఉన్నాడు. నాకు సూపర్‌ క్యారెక్టర్‌ ఇస్తామన్నాడు కూడా. దిన కూలీనే కాకుండా యూట్యూబ్‌లో వచ్చే ఆదాయంలో షేరింగూ ఇస్తాడట. అందుకనే ఇక, ఏమాత్రం ఆలోచించలేదు. వాళ్ల టీమ్‌లో కలుస్తానని మాటిచ్చేశా.. నువ్వు వేరే వాళ్లను చూసుకో అల్లుడూ..’’

‘‘మన ఊర్లో ఏంది మామా ఇంత అన్యాయం. ఇంటింటికీ తిరుగుతూనే ఉన్నా. ఒక్క మనిషి కూడా ఒప్పుకోవడం లేదు. కూలీల కొరత దేశమంతా ఉంది.. కానీ మన పల్లెలో మాత్రం యూట్యూబ్‌ కూలీలకు ఎక్కడలేని గిరాకీ వచ్చేసింది. కలికాలం.. ఏం చేస్తాం? ఇలాంటి కొత్త డిమాండ్‌ వస్తుందని కలలో కూడా ఊహించలేదు...’’

‘‘ఊర్లో డిమాండ్‌ అట్లుంది అల్లుడూ.. ఒకప్పుడు పొలం పనులకు మాలాంటి కూలోళ్లు దొరికే వాళ్లు కాదు. యూట్యూబ్‌ షూటింగ్‌ల పుణ్యమాని మళ్లీ ఇన్నేళ్లకు అదే గిరాకీ వచ్చేసింది. పొలాల్లో కూలీ పనులు చేస్తే కేవలం డబ్బులే వస్తాయి.. కానీ యూట్యూబ్‌లో కనిపిస్తే.. డబ్బులకు డబ్బులు.. పేరుకు పేరు వచ్చేస్తుంది.. అదృష్టం బాగుంటే రాత్రికి రాత్రే చిన్న స్టార్‌ అయిపోవచ్చు.. సుడి తిరిగితే సినిమాల్లోకీ వెళ్లొచ్చు..’’

చిన్న ఊరికి పెద్ద పేరు..

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు 55 కి.మీ., తాలూకా కేంద్రం సిమ్గాకు 14 కి.మీ. దూరాన ఉంటుంది తుల్సి అనే గ్రామం. ఇల్లు వాకిలీ, చెట్టు పుట్టా.. ఎక్కడ చూసినా గుంపులే గుంపులు. పెద్ద గొడుగులు.. షూటింగ్‌ కెమెరాలు. ఇదేం పల్లెటూరా... లేదంటే ఫిల్మ్‌సిటీనా? అని భ్రమపడేంతటి దృశ్యాలు కనిపిస్తాయి. ఊర్లో ఏ నలుగురు కలిసినా.. ఏం బామ్మర్ది.. మీ స్టోరీ చర్చలు ఎప్పుడు మొదలవుతాయి? అన్నా కొత్త షార్ట్‌ఫిల్మ్‌కు ముహూర్తం ఎప్పుడు? తమ్ముడూ మొన్న మీరు అప్‌లోడ్‌ చేసిన వీడియో దుమ్ములేపుతోంది కదా? ఆ క్యారెక్టర్‌ నువ్వు ఇరగదీశావు మరదలా..!, ఊహలకు అందని ముగింపుతో ఆశ్చర్యపరిచావు తాతా, నువ్వు వంట ఎంత బాగా చేస్తావో..

ఆ పాత్ర కూడా అంత బాగా చేశావు వదినా... ఇలాంటి ముచ్చట్లే ఉంటాయక్కడ. హైదరాబాద్‌ కృష్ణానగర్‌లోని సినిమా వాతావరణమే తుల్సి గ్రామంలో కనిపిస్తుంది. అయితే అక్కడ సినిమా.. ఇక్కడ యూట్యూబ్‌.. అంతే వ్యత్యాసం!. రెండక్షరాలున్న ఈ ఊరి పేరు ఎంత చిన్నదో జనాభారీత్యా కూడా అంతే చిన్నది. ప్రతీ ఊరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తుల్సికి మాత్రం ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేవు. చుట్టుపక్కలున్న ఊర్లలో ఏమంత పరపతి లేదు. అదే ఆ ఊరికి కలిసి వచ్చింది. ‘మా ఊరు ఏదో ఒకటి చేయాలి. ఈ పల్లెల్లో మాకంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకోవాలి..’’ అన్న పంతానికి పోయారు గ్రామీణ యువకులు. ఇక్కడితో కట్‌ చేస్తే.. ఏకంగా దేశాన్ని టచ్‌ చేసేంత పెద్ద వార్త అయ్యింది తుల్సి గ్రామం. ఇప్పుడా ఊరికి యూట్యూబ్‌ ఇంటి పేరు అయ్యింది. అత్యధిక ఛానళ్లు కలిగిన విలేజ్‌గా రికార్డు సాధించింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు ప్రవాసభారతీయులు సైతం తుల్సి సృజనకు ఫిదా అవుతున్నారిప్పుడు!.

పరిస్థితులే నడిపించాయ్‌..

ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతం. కొన్నిచోట్ల సారవంతమైన భూములు, మరికొన్ని ప్రాంతాల్లో విలువైన ఖనిజాలు సొంతం. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు పెట్టింది పేరు. రాష్ట్రంలో రెండొందల స్టీల్‌రోలింగ్‌ మిల్లులు, 195 స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంట్లు, 6 స్టీల్‌ ప్లాంట్లు, 60 ప్లైవుడ్‌ ఫ్యాక్టరీలు, 35 ఫెర్రో అలయ్‌ ప్లాంట్లు, 500 అగ్రో పరిశ్రమలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాసరే.. కొన్ని పల్లెలు ఇప్పటికీ వెనకబడే ఉన్నాయి. కారణం నిరక్షరాస్యత, పేదరికం, ఉన్నత చదువులకు వెళ్లలేకపోవడం. గ్రామాల్లో ఎక్కువగా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన ప్రజలు కూలీ పనులకే పరిమితం కావడం మరో కారణం.

అక్కడక్కడ బాగా చదువుకున్న పిల్లలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే తిరిగి రావడం లేదు. పల్లెల్లో నిలిచిపోయిన గ్రామీణులు ఉన్నచోటే చిన్నచిన్న ఉపాధి అవకాశాలను వెదుక్కోవడం, కూలీ పనులు చేసుకోవడం.. కుటుంబాన్ని నెట్టుకురావడం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి గ్రామీణ వాతావరణంలోనే మగ్గుతోంది తుల్సి. సిమ్గా తాలూకాలోని 124 పల్లెల్లో ఒకటైన ఈ పల్లె గ్రామ పంచాయతీ. పోస్టల్‌ సర్వీసు కూడా ఉంది. పాత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఊరి జనాభా 4 వేలు. ప్రభుత్వాలు ఎంతో చైతన్యం తీసుకువస్తే తప్ప అక్షరాస్యత 69 శాతం దాటలేదు. ప్రజా రావాణా రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. పది కి.మీ. దూరంలో రైల్వే స్టేషను ఉంది.

ఊరు మొత్తానికి కలిపి ఉన్న భూ విస్తీర్ణం 743 హెక్టార్లు. అయినా సరే ఎక్కువమంది రైతు కూలీలే ఉన్నారిక్కడ. ఒక అంచనా ప్రకారం తొంభై శాతం మంది కార్మికులు, కూలీలు. ఆర్నెళ్లు పనుంటుంది. ఇంకో ఆర్నెళ్లు ఉపాధి లభించదు. కేవలం వ్యవసాయ పనులు తప్పిస్తే ఇంకో పని లేదు. పట్టణాల్లోని కర్మాగారాల్లో ఏ కొందరో తప్పిస్తే అందరూ స్థిరపడలేదు. పనుల్లేక ఇళ్ల ముందున్న అరుగుల మీద, రచ్చబండల పైన, చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకునేవారు ఊరి జనం. సరదాగా మొదలయ్యే సంభాషణలు మెల్లగా రాజకీయాలవైపు వెళ్లి.. వైషమ్యాలను రగిలించేవి. ఒక్కోసారి ఘర్షణలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఊర్లో ప్రశాంత వాతావరణం సైతం చెడింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్‌ ఛానల్స్‌ను మొదలుపెట్టారు కొందరు యువకులు. అక్కడి నుంచే మార్పు ఆరంభమైంది.

ఆ ఇద్దరు....

ఊరికి ఒక్కడుంటే చాలు అంటారు కదా!. తుల్సిలో మాత్రం ఇద్దరు తోడయ్యారు. జైవర్మ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పట్టభద్రుడు. జ్ఞానేంద్ర శుక్లా, నెట్‌వర్క్‌ ఇంజనీర్‌. పేరుకు రసాయనశాస్త్రం చదివాడు కానీ అందుకు తగ్గ ఉద్యోగం లేదు వర్మకు!. దగ్గర్లోని పట్టణంలో అధ్యాపకునిగా చేరితే నెలకు పన్నెండువేలు ఇచ్చేవారు. ఒక్క రోజు లీవు పెట్టినా జీతం కట్‌ అనేది యాజమాన్యం. పూటకూలీ కంటే ఘోరం. ఇక, శుక్లా పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇంజనీర్‌ అనే పేరేకానీ అందుకు తగ్గ వేతనం ఎప్పుడూ వచ్చేది కాదు. ఇద్దరూ పట్టణాల నుంచి ఊరికి వచ్చినప్పుడు కష్టాలు కలబోసుకునేవారు. ఏందీ పరిస్థితి? ఎన్నాళ్లిలా? మన తల్లిదండ్రులదీ ఇదే బతుకు.. మనదీ ఇదే జీవితమా? అనుకుని మధనపడని రోజు లేదు.

అప్పటికే అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వచ్చేశాయి. మొదట్లో వచ్చిన యూట్యూబ్‌ ఛానళ్లలో అయితే నగర యువతీ యువకులు, సెలబ్రిటీలు, సినిమా స్టార్లు.. ఓ మోస్తరు గ్లామర్‌ కలిగిన ముఖాలే కనిపించేవి. పల్లెల్లోని గ్రామీణులు కూడా అప్పుడప్పుడే యూట్యూబ్‌లో ఛానళ్లను ప్రారంభించారు. కలర్‌ కంటే కంటెంటే ముఖ్యమిక్కడ. నానా తంటాలు పడితేకానీ వ్యూస్‌ వచ్చేవి కావు. పట్టణాలు, నగరాలతో పోలిస్తే గ్రామీణ జీవితంలో వైవిధ్యం ఎక్కువ. సహజత్వం తరగని సంపద. పల్లె జీవనశైలిలో ఉన్నన్ని నవరసాలు నగర బతుకుల్లో ఎక్కడివి? బుర్రకు పదును పెట్టాలే కానీ.. కంటెంట్‌కు కొదవ లేదు. ఈ కిటుకును కనుక్కున్నారు జైవర్మ, జ్ఞానేంద్ర శుక్లా. ఉన్నఫలంగా ఉద్యోగాలు మానేశారు. యూట్యూబ్‌ ఛానళ్లను ప్రారంభించారు.

ఊర్లోని విశేషాలే కథాంశాలు. రైతులు - కూలీలే నటీ నటులు. రచ్చబండ దగ్గర చలోక్తులు విసిరే మాటకార్లే రైటర్లు, వేడుకలకు మేళతాళాలు వాయించే సన్నాయి వాయిద్యకారులే మ్యూజిక్‌ డైరెక్టర్లు. పెళ్లి పందిళ్లు వేయించే పెద్దలే కళా దర్శకులు. నాగళ్లు దున్నే యువకులే కెమెరామెన్‌లు. సినిమా తీయాలంటే స్టూడియోలే అక్కర్లేదు.. ఉన్న ఊర్లోనూ తీయొచ్చని నిరూపించారు తుల్సి గ్రామస్థులు. ఆ పల్లెలో తీసిన లఘు చిత్రమే వారికి పాన్‌ ఇండియా మూవీ!. ‘‘మొదట్లో యూట్యూబ్‌ ఛానళ్లలో పనిచేసిన అనుభవం లేదు మాకు. ఇద్దరం చాలా కష్టపడ్డాం. వీడియో ఎడిటింగ్‌, డిజిటల్‌ ప్రొడక్షన్‌, కాపీరైట్స్‌, అప్‌లోడింగ్‌, సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాం. ఒక్కొక్క సమస్యకు పరిష్కారం వెదుక్కుంటూ నేర్చుకున్నాం.

సరదాగా మొదలుపెట్టిన ఈ ప్రయాణం.. ఇంత సీరియస్‌ ప్రొఫెషన్‌ అవుతుందని ఊహించలేదు..’’ అన్నారు జైవర్మ. 2018లో బీయింగ్‌ చత్తీస్‌ఘరియా అనే ఛానల్‌తో ప్రాచుర్యం పొందారు. సబ్‌స్ర్కైబర్స్‌ మెల్లగా పెరిగారు. యూట్యూబ్‌ ద్వారా స్థిరమైన ఆదాయం రావడం మొదలైంది. ‘‘మేము సక్సెస్‌ అయ్యాక ఊర్లోని కొందరు యువతీ యువకులు మా బృందంలో చేరడానికి ఆసక్తి చూపించారు. డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఉపాధి పొందవచ్చన్న భరోసా కలిగింది. మాతో కలిసి పనిచేసిన వాళ్లు.. కొన్నాళ్ల తర్వాత బయటికెళ్లి సొంత యూట్యూబ్‌ ఛానళ్లు పెట్టుకోసాగారు. ఇలా మా ఊర్లో ఛానళ్ల సందడి జోరందుకుంది..’’ అని వివరించారు శుక్లా. ఏ షూటింగ్‌ జరిగినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకుసాగారు. తుల్సి వాసులు ఏ ఛానల్‌ పెట్టినా సక్సెస్‌ అయ్యింది.

ఊర్లోనే బుల్లి స్టూడియో..

ఇదొక అసంఘటిత రంగం. ఇప్పుడంతా డిజిటల్‌ యుగం కాబట్టి.. కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత.. కొత్త కొత్త సాంకేతిక వ్యవస్థలు వచ్చేస్తాయి. యూట్యూబ్‌కు అంత డిమాండ్‌ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా... ఎప్పటికప్పుడు ఆకట్టుకునే కంటెంట్‌ ఉండాల్సిందే! లేకపోతే పోటీ తట్టుకోలేమని గుర్తించారు తుల్సి యూట్యూబర్లు. అందుకే వర్మ, శుక్లా అందర్నీ ఏకం చేసి ఒక సంఘంలాగ ఏర్పడ్డారు. వీలున్నప్పుడల్లా సమావేశం అవుతున్నారు. కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఐడియాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు కూడా!. ‘‘యూట్యూబ్‌ అనేది మా ఊరి జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.

నాలుగువేల మంది జనాభాలో వెయ్యిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి? ఛత్తీస్‌గఢ్‌లోనే తుల్సికి ప్రత్యేకత వచ్చేసింది’’ అన్నారు ఊరి పెద్దలు. ఇప్పుడున్న ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటే!. ఉన్నచోటనే కొత్త కంటెంట్‌ను క్రియేట్‌ చేసి ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న తుల్సి గ్రామాన్ని అధ్యయనం చేసింది ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం. మరికాస్త ప్రోత్సాహం అందిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది సర్కారు ఆలోచన. జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరియా రంగంలోకి దిగారు. తుల్సి గ్రామానికెళ్లి.. జైవర్మ, జ్ఞానేంద్రశుక్లాలతో పాటు యూట్యూబర్లను కలిశారాయన. ఒక సమావేశం ఏర్పాటు చేసి అభినందించారు.

ఊర్లో యూట్యూబ్‌ ఛానళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. ఒక చిన్నపాటి స్టూడియోను ఏర్పాటు చేస్తే బావుంటుందని నిర్ణయించారు కలెక్టర్‌. పాతిక లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను మంజూరు చేశారు. ఆ రాష్ట్రంలో ఒక పల్లెటూరిలో ఓ మోస్తరు స్టూడియో ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. జిమ్‌బాల్స్‌, డ్రోన్‌కెమెరాలు, కటింగ్‌ ఎడ్జ్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌, కాంటెంపరరీ కెమెరాలు.. వంటివన్నీ సమకూర్చారు. అంతటితో ఆగలేదు. కొందరు యువతీ యువకులకు సినిమా నిపుణుల చేత షూటింగ్‌, రైటింగ్‌, ప్రొడక్షన్‌లలో ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ అందించారు. ‘‘డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి.

ముందుచూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి. మన చుట్టూ జరిగే మార్పుల్లో నుంచీ కథలను అల్లడం అలవాటు కావాలి.. ఈ అంశాలను అనుభవ పరిజ్ఞానంతో దృశ్యీకరించాలి. అప్పుడే యూట్యూబ్‌లో మీరు రాణిస్తారు. అనుకున్నంత ఆదాయమూ వస్తుంది. మరో పదిమందికి ఉపాధి అందివ్వగలుగుతారు..’’ అంటూ కలెక్టర్‌ తుల్సి యువతకు సందేశమిచ్చారు. ప్రస్తుతం గ్రామంలో యూట్యూబ్‌ ద్వారా నెలకు నలభై నుంచి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు. మారుతున్న ప్రపంచంతో పాటు తుల్సి కూడా మారుతూ వస్తోంది. ఊర్లోని యువతీ యువకులు కోరుకున్న కలల ప్రపంచం ఉన్నచోటే ప్రత్యేక్షమైంది. ఇంతకంటే ఏం కావాలి? తుల్సి.. పల్లె పొలాల్లో ఓ బుల్లి ఫిల్మ్‌నగర్‌ కావాలని ఆశిద్దాం.

- సండే డెస్క్‌

- ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యూట్యూబ్‌ యూజర్ల సంఖ్య

270 కోట్లు.

- యూట్యూబ్‌ యూజర్లు రోజుకు సగటున వెచ్చిస్తున్న సమయం ‘48 నిమిషాల 42 సెకన్లు’.

- ప్రపంచదేశాల్లో అత్యధిక సంఖ్యలో యూట్యూబ్‌ చూస్తున్న వాళ్లలో మనమే టాప్‌. వీక్షకుల సంఖ్య

49.1 కోట్లు.

- భారత్‌లో అత్యధిక సబ్‌స్ర్కైబర్స్‌ (29.2 కోట్లు) కలిగిన యూట్యూబ్‌ ఛానల్‌ ‘టి-సిరీస్‌’.. ఆ తర్వాత ‘కారీ మినాటీ’, ‘బీబీ కీ వైన్స్‌’.

- ఇండియాలో ఈ మాధ్యమం మొదలైంది 2008లో!.

- యూజర్ల సంఖ్య వారీగా చూస్తే భారత్‌ (49.1 కోట్లు), అమెరికా (25.3 కోట్లు), బ్రెజిల్‌ (14.4 కోట్లు), ఇండోనేసియా (14.3 కోట్లు), మెక్సికో, జపాన్‌, జర్మనీ, వియత్నాం, పిలిప్పీన్స్‌, టర్కీ, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌.. వరుస ర్యాంకుల్లో ఉన్నాయి.

- ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా ప్రకారం భారత్‌లో యూట్యూబ్‌ పదివేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను నిర్మించింది. సుమారు 7.50 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.

- స్థానిక భాషల్లో కంటెంట్‌ను సృష్టించడంలో తిరుగులేని మాధ్యమంగా యూట్యూబ్‌ దూసుకెళుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 10:59 AM