ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనిర్వచనీయం... కైలాస శిఖర దర్శనం

ABN, Publish Date - Aug 10 , 2025 | 12:33 PM

ఎవరు దేనికి అర్హుడో దాన్ని పొందుతాడు అనేది పరమ సత్యం. ఈ సకల చరాచర విశ్వాన్ని నడిపించే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర నివాసమైన కైలాస భూమిలో అడుగుపెట్టే అదృష్టం నాకు కలిగింది.

ఎవరు దేనికి అర్హుడో దాన్ని పొందుతాడు అనేది పరమ సత్యం. ఈ సకల చరాచర విశ్వాన్ని నడిపించే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర నివాసమైన కైలాస భూమిలో అడుగుపెట్టే అదృష్టం నాకు కలిగింది.

కైలాస శిఖరం చుట్టూ పరిక్రమ చేసినన్ని రోజులు అణువణువులో మహాదేవుడినే చూశాను. కైలాస శిఖరం చుట్టుపక్కల సుందర ప్రకృతి దృశ్యాలు ఉన్నా... శిఖరాన్ని విడిచి, మనసు ఏ దిక్కుకూ చూడదు... ‘హర హర మహాదేవ’ అనే నామం తప్ప నోరు మరో మాట పలకదు.

5 ఏళ్ల విరామం తర్వాత...

దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత భారత, చైనా ద్వైపాక్షికసంబంధాల్లో భాగంగా మళ్లీ ‘కైలాస మానస సరోవర యాత్ర’ ప్రారంభ మైంది. భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యాత్ర కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. లాటరీ ద్వారా యాత్రికులను ఎంపిక చేసి, మొత్తం 15 బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 50 మంది సభ్యులు ఉంటారు. రెండు మార్గాల ద్వారా యాత్ర కొనసాగిస్తారు. వాటిలో ఒకటి... సిక్కిం రాష్ట్రం నాథుల పాస్‌ గుండా 10 బృందాలు. రెండోది... ఉత్తరాఖండ్‌ రాష్ట్రం లిపి లేక్‌ పాస్‌ మార్గం గుండా 5 బృందాల యాత్ర సాగుతుంది.

సిక్కిం రాష్ట్రం నాథుల పాస్‌ మార్గం గుండా వెళ్లే బృందాల్లో మాది 4వ బృందం. జూన్‌ 28న ఢిల్లీ దగ్గర ఘాజియాబాద్‌లో కైలాస మానస సరోవర్‌ భవన్‌కు చేరుకున్నాం. మా బృందంలో మొత్తం 47మంది యాత్రికులు వచ్చారు. నాలుగు రోజులు అక్కడే బస. మొదటిరోజు యాత్రికుల రిజిస్ట్రేషన్‌, రెండవ రోజు మెడికల్‌ ఫిట్నెస్‌ పరీక్షలు, మూడోరోజు అధికారులతో మాటామంతి, నాలుగో రోజు యాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి విమానంలో బాగ్‌ డోగ్రా విమానాశ్రయంలో దిగి... అక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌ చేరుకున్నాం. సిక్కిం టూరిజం హోటల్‌లో బస చేశాం. షేర్‌ తాంగ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బస ఉంటుంది.

మెడికల్‌, ఫిట్నెస్‌ టెస్ట్‌...

అత్యంత క్లిష్టమైన ఈ యాత్ర చేయాలంటే ప్రతీ ఒక్క యాత్రికుడు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకే ఈ పరీక్షల్లో పాస్‌ అవడం తప్పనిసరి. ‘ఢిల్లీ హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో అన్ని రకాల పరీక్షలు చేపడతారు. పరీక్షలు నిర్వ హించే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యులందరూ ఆసుపత్రిలోనే ఉండాలి. ఫలితాలను మరుసటి రోజు ఐటీబీపీ (ఇండియన్‌ టిబెట్‌ బోర్డర్‌ పోలీస్‌) చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పరిశీలించి, ఫిట్నెస్‌ లేని వాళ్లను బృందం నుంచి తప్పిస్తారు. అదే రోజు చైనా వీసా అప్లై చేసుకోవడం, ఫీజు చెల్లించడం జరుగుతుంది. చైనా దేశంలోకి వెళ్తున్నాం కాబట్టి... నడవడిక, ప్రవర్తన నియమావళి గురించి అధికారులు వివరిస్తారు. గతంలో యాత్ర చేసి వచ్చిన అధికారులు వారి అనుభవాలు తెలియజేస్తారు. యాత్రికుల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. ప్రతి యాత్రికునికి భారత ప్రభుత్వం ముద్రతో ఒక గుర్తింపు కార్డు ఇస్తారు.

కచ్చితంగా తీసుకువెళ్లాల్సిన పత్రాలు...

ఈ యాత్ర చైనా దేశం మీదుగా సాగు తుంది కాబట్టి... 6 నెలల పరిమితితో కూడిన పాస్‌పోర్ట్‌ ఉండాలి. ఫిట్నెస్‌లో ఎంపికైన అభ్యర్థులు, ఇండెమ్నిటి బాండ్‌ నోటరీ చేయించి ఇవ్వాలి. ఎందుకంటే సముద్ర మట్టానికి 6,500 మీటర్ల ఎత్తులో ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ‘ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదు.. ఒకవేళ అక్కడ చనిపోయినా,

ఆ దేశ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయొచ్చు’ అంటూ యాత్రికుని అంగీకారం తెలుపుతూ రాతపూర్వకంగా నోటరీ చేయించి ఇవ్వాలి. దానితోపాటు అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని కన్సంట్‌ పత్రం, అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ద్వారా తరలించేందుకు ధ్రువీకరణ పత్రం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

విదేశీ నగదు మార్పిడి

యాత్రలో భాగంగా చైనాలో 11 రోజులు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి విదేశీ నగదు మార్పిడి తప్పనిసరి. కైలాస శిఖరం చుట్టూ పరిక్రమ చేసేందుకు ఒక కుర్రాణ్ణి సహాయకుడిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. చైనా, టిబెట్‌లలో బస చేసే పట్టణాలలో షాపింగ్‌ చేయాలంటే చైనా కరెన్సీ ‘యువాన్‌’ తప్పని సరి.ఢిల్లీలో ఎంఈఏ ఏర్పాటు చేసిన ఏజెంట్‌ ద్వారా నగదు మార్పిడి సులభంగా చేసుకో వచ్చు. విదేశీ కరెన్సీ మిగిలితే వచ్చేప్పుడు వారి దగ్గరే మార్పిడి చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక యాత్ర గనుక ఆయా బృందాలతో... భారతీయ వంటకాలు చేసేందుకు వంటవారు ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి కావాల్సిన భోజన సదుపాయాలు సిద్ధం చేస్తారు.

సమన్వయం అవసరం...

యాత్ర ప్రారంభమయ్యేసరికి మా బృందంలో 43 మంది సభ్యులం ఉన్నాం. ప్రభుత్వం నియమించిన ఇద్దరు లైసెనింగ్‌ అధికారులు, ఒక ఐటీబీపీ డాక్టర్‌, నలుగురు వంట సిబ్బంది మాతో ఉన్నారు. తెలుగు వాళ్ళం నలుగురం... ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ త్రివిక్రమ్‌ వర్మ, ఆయన సతీమణి, విశాఖపట్నానికి చెందిన శివకుమార్‌, నేను ఉన్నాం. యాత్ర జరిగిన 21 రోజులు బృంద సభ్యులంతా కలిసిమెలిసి, ఒకరికి ఒకరు అవసరమైన చోట సహాయకంగా ఉండేవాళ్లం. బృందంలో 30 ఏళ్ల లోపు ఉన్న నలుగురు యువకులం తప్ప, మిగిలిన వారందరూ అధిక వయసు గలవారే.

యాత్ర సజావుగా సాగాలంటే బృందంలో సమన్వయం అవసరం. అందుకోసం మాలో మేమే కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఫైనాన్స్‌, లాజిస్టిక్‌, ఫుడ్‌, పూజా, డిసిప్లేన్‌ కమిటీలు ఏర్పాటు చేసుకొని, ఎవరి బాధ్యతలు వారు చేపట్టి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డాం.

చైనా, టిబెట్‌లో ప్రయాణం...

నాథుల పాస్‌ బోర్డర్‌ దగ్గర భారతీయ ఇమిగ్రేషన్‌ అధికారులు పాస్‌పోర్ట్‌ పరిశీలన చేసిన అనంతరం చైనా అధికారులు మా బృందాన్ని రిసీవ్‌ చేసుకున్నారు. తర్వాత చైనాలో ఇమిగ్రేషన్‌ పూర్తయింది. అక్కడి నుంచి ‘కాంగ్‌ మా’ పట్టణానికి వెళ్లి బస చేశాం. అక్కడక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడే అవకాశం దొరికింది. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో పలకరించేవారు. చైనా భాష రాకపోయినా మొబైల్‌ సాంకేతికత ద్వారా అనువాదం చేసుకునేవాళ్ళం, చైనా మారుమూల గ్రామాల్లో కూడా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రయాణంలో భాగంగా కాంగ్‌ మా, లాసీ, డార్చిన్‌, జోంగ్‌ బా, జంజు పు, క్యూ గు ప్రాంతాల్లో బస చేశాం. భౌగోళిక వ్యత్యాసంతో రాత్రి తొమ్మిదిన్నరకి మాత్రమే చీకటి పడేది. ప్రయాణ మార్గంలో కొన్నిచోట్ల టాయిలెట్‌ సౌకర్యం లేక ఇబ్బంది పడ్డాం.

కైలాస శిఖరం పరిక్రమ...

టిబెట్‌, డార్చిన్‌ పట్టణంలో రాత్రి బస అనంతరం మూడు రోజులపాటు 44 కిలోమీటర్లు కైలాస శిఖరం చుట్టూ పరిక్రమ చేశాం. మొదటిరోజు యమద్వారం నుంచి బయలుదేరి 12 కిలోమీటర్లు నడిచి డేరాపుక్‌ చేరాం. అక్కడ రాత్రి బస చేయడంతో పాటు కైలాస శిఖరాన్ని దగ్గరగా దర్శించుకున్నాం. శిఖరాన్ని ముట్టుకునేందుకు అనుమతి లేనందున దగ్గరగా వెళ్లి, పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందాం. రెండోరోజు అక్కడి నుంచి బయలుదేరి అత్యంత క్లిష్టమైన డోల్‌ మా పాస్‌ కొండలను, లోయలను దాటి 22 కిలోమీటర్లు నడిచి జుంజుపు ప్రాంతానికి చేరుకున్నాం. మూడోరోజు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించి డార్చిన్‌ చేరుకోవడంతో కైలాస శిఖర కార్యక్రమం ముగిసింది. మూడు రోజుల ప్రయాణం కోసం గుర్రాల్ని, సహాయకుల్ని ఏర్పాటు చేసుకున్నారు కొందరు. నేను మాత్రం 44 కి.మీ. నడిచే వెళ్ళాను. దారిలో రాళ్లను తాకుతూ, సెలయేళ్లలో నీటిని తాగుతూ, ప్రకృతి రమణీయ సౌందర్య దృశ్యాలను ఆస్వాదించాను.

పవిత్ర మానస సరోవరం

కైలాస శిఖర కార్యక్రమం పూర్తి కాగానే, అక్కడ్నుంచి బ్రహ్మ మానసపుత్రిక ‘మానస సరోవరాని’కి చేరుకున్నాం. 27 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న సరోవరాన్ని చూడడానికి రెండుకళ్లు చాలవు. సరోవరం రోడ్డు నుంచి చూస్తే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస శిఖరం దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. మంచు దుప్పటి కప్పినట్టు కనిపించే కైలాస శిఖరం వాస్తవానికి ఎంతో దూరంలో ఉన్నా సరోవరం ఒడ్డున ఉన్నట్టే అనిపిస్తుంది. కొన్ని వేల ఏళ్లుగా ఎంతోమంది యోగులు, ఋషులు, మహాపురుషులు నడయాడిన ప్రాంతంలో రెండు రాత్రులు బస చేసి, మహాదేవుని నివాస స్థలమైన కైలాస శిఖరాన్ని దర్శిస్తూ ఆధ్యాత్మిక అలలపై విహరించాం. హర హర మహాదేవ... శంభో శంకర!

- వెంకట మహేష్‌ వెల్లంకి, విశాఖపట్నం

98489 19121

Updated Date - Aug 10 , 2025 | 12:33 PM