ఏకాంత హోటల్..
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:17 PM
పేద్ద ఎడారిలో ఓ స్టార్ హోటల్. సిబ్బంది ఎక్కడా కనపడరు. మీకు అవసరమైన ఆహారపదార్థాలు ఫ్రిజ్‌లో ఉంటాయి. మీరే స్వయంగా వండుకోవాలి.. కనుచూపు మేరా భూమి, ఆకాశం.. అంతే! ఏది కొనాలన్నా గంట దూరం ప్రయాణించాలి సోలోగా. ఆ హోటలే ‘అవుట్‌పోస్ట్‌ఎక్స్’. ఈ హోటల్‌కి సంబంధించిన అంశాలన్నీ ఆశ్చర్యం కలిగించేవే.
చక్కటి భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు, రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం సాధారణంగా హోటళ్లకు వెళుతుంటాం. ‘స్టార్ హోటల్’, ‘ట్రీహోటల్’, ‘పడవ హోటల్’, ‘హెరిటేజ్ హోటల్’... ఇలా ఇష్టానికి తగినట్టుగా ఎంపిక చేసుకుని సరదాగా గడుపుతాం. అక్కడి సిబ్బంది ఇచ్చే ఆతిథ్యంలో మునిగిపోతాం. అందుకే ఎప్పటికప్పుడు అనేక థీమ్‌లతో కొత్తకొత్త హోటళ్లు వస్తున్నాయి. అయితే భూమ్మీదే ఉన్నా వేరే గ్రహంలో ఉన్న ఫీలింగ్ కలిగించే హోటల్ మాత్రం ‘అవుట్‌పోస్ట్‌ఎక్స్.’ అమెరికాలోని ఊతా రాష్ట్రంలో ఉన్న అవుట్‌పోస్ట్‌ఎక్స్ హోటల్‌కి టూరిస్టులు కేవలం విభిన్న అనుభూతి కోసమే వెళతారు.
అటు ఫ్యూచర్ ... ఇటు పాస్ట్
అవుట్‌పోస్ట్‌ఎక్స్‌లో ఒక్క రాత్రి గడిపితే, గెలాక్సీ... అదే పాలపుంతలో నెల రోజులు గడిపినట్లు అనిపించక మానదు. ‘ప్రాచీన - భవిష్యత్’ మేలుకలయికగా ఈ హోటల్‌ను తీర్చిదిద్దారు. మొత్తం 240 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ నిర్మించారు. ఇందులో వంద ఎకరాలు ఎండిపోయిన సరస్సు ప్రాంతం. శీతాకాలం మంచుదుప్పట్లో, ఎండాకాలంలో పగుళ్లతో విభిన్న లుక్‌లో ఉంటుంది. ఈ హోటల్‌లోకి అడుగుపెట్టగానే ఏదో సైంటిఫిక్ మూవీ సెట్‌లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. దూరంగా అక్కడక్కడ విసిరేసినట్టుగా పది హోటల్ గదులు. అన్నీ విభిన్నమైనవే. గుహల థీమ్‌లో రాళ్లతో హోటల్ గదులను రూపొందించారు. అక్కడ అన్ని వసతులతో కూడిన కిచెన్ ఉంటుంది. కానీ ఎవరికివారే ఆహారం వండుకోవాలి. ‘జీహుజూర్’ అనే సిబ్బంది అస్సలే ఉండరు. ఏ అవసరం వచ్చినా, ఏదైనా కొనాలన్నా గంట దూరం ప్రయాణించాల్సిందే.
నక్షత్రాలతో...
ఇక హోటల్ గదుల నిర్మాణశైలి అద్దిరిపోతుంది. వీటిల్లో మొదటి స్థాయిలో ఉన్న ఫాంటసీ లక్స్ ఈ గదులు అన్నిట్లోకీ ఖరీదైనవి. ఓరోజు బసకి సుమారు 500 డాలర్ల ఛార్జ్ చేస్తారు. హాలులోని కిటికీ అద్దాల ద్వారా 360 డిగ్రీల వ్యూ కనిపిస్తుంది. సూర్య కాంతి అంతటా ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రిళ్లు స్విచ్ నొక్కితే చాలు పడక గదిలోని బెడ్ గోడలు తెరచుకుని పరుపు ఆరు బయటికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నక్షత్రాలను లెక్కిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా అక్కడే నిద్రపోవచ్చు.
అతిథులకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. ఇక తరువాత స్థాయివి కేవ్ విల్లాలు. వీటి నిర్మాణపరంగా అద్భుతం అని చెప్పాలి. అన్ని వసతులతో కూడిన బస ఉంటుంది. ఏ గదిలో నుంచి అయినా నక్షత్రాలను చూసేలా తీర్చిదిద్దారు. ఆ తరువాతవి జెన్ డోమ్‌లు. పారదర్శకమైన గోళాకారంలో ఉన్న ఈ నిర్మాణం మధ్యలో పరుపు ఉంటుంది. పైనా, చుట్టూ అంతా కనిపిస్తుంది. బయటికి కనిపించకూడదంటే కర్టెన్లు వేసుకోవచ్చు. ఈ డోమ్ వెనక ఓవైపు నిలువెత్తు అద్దం ఉన్న గాజు బాత్‌రూమ్, లాంజ్ ఉంటాయి. అంతా మినిమలిస్టిక్ థియరీ పాటించాలన్నదే థీమ్. అందుకే టీవీ, ఇంటర్నెట్ లాంటివే కాదు ఎలాంటి వస్తువులూ ఉండవు. స్కైలాడ్జ్ పేరున ఓ చిన్న చెట్టు ఇల్లు కూడా ఉంది.
ఉదయ సాయంత్రాల్లో సూర్యోదయ, సూర్యస్తమయాలను, రాత్రిళ్లు నక్షత్రాలను చూస్తూ గడపవచ్చు. ఈ అవుట్‌పోస్ట్‌ఎక్స్‌లో విహరించడానికి స్టార్‌వార్స్‌లో ఉన్న ‘శాండ్ క్యూయిజర్లు’ ఉంటాయి. ఇసుక నేలల మీద స్వచ్ఛమైన ఆకాశం, గాలులు, వాతావరణంలో విహారం భలే థ్రిల్‌ను అందిస్తుంది, ఈ ఫాంటసీ హోటల్ వ్యవస్థాపకుడు ట్రేవిస్ ఛేంబర్స్. ప్రయాణాలు చేయడం ఆయనకు హాబీ. స్టార్‌వార్స్ సిరీస్‌లంటే మహాపిచ్చి. సహారా ఎడారి, మధ్యఆసియా విహరించి వచ్చాక ఆ థీమ్‌లో హోటల్‌ని నిర్మించి తన కలలకు రూపాన్ని ఇచ్చాడు. ఇలాంటి వింతైన హోటల్‌లో గడిపేందుకు ఎక్కడెక్కడినుంచో టూరిస్టులు వస్తుంటారు. ఓ జీవితకాలానికి సరిపడా మరుపురాని జ్ఞాపకాల్ని మూటకట్టుకుని వెళతారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News
Updated Date - Jun 01 , 2025 | 12:17 PM