అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గురించి తెలుసా..
ABN, Publish Date - Aug 10 , 2025 | 09:15 AM
నిప్పు, నీరు ఒకే చోట ఉండవు.. కానీ రష్యాలోని పసిఫిక్ ద్వీపకల్ప ప్రదేశం ‘కమ్చట్కా’లో కనిపిస్తాయి. ఒకవైపు భగభగ మండే అగ్నిపర్వతాలు.. మరోవైపు మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
- నిప్పు, నీరు కలిస్తే కమ్చట్కా...
నిప్పు, నీరు ఒకే చోట ఉండవు.. కానీ రష్యాలోని పసిఫిక్ ద్వీపకల్ప ప్రదేశం ‘కమ్చట్కా’లో కనిపిస్తాయి. ఒకవైపు భగభగ మండే అగ్నిపర్వతాలు.. మరోవైపు మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇంతకూ ఈ కమ్చట్కా పేరు ఎప్పుడో విన్నట్లే ఉంది కదూ.. అవును.. ఇటీవలే ప్రపంచాన్ని బెంబేలెత్తించిన సునామీ ప్రకటనకు కారణం.. ‘కమ్చట్కా’నే!.
......
‘‘సునామీ వచ్చేస్తోంది.. సునామీ వచ్చే స్తోంది.. తీర ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలి.. ఇక సమయం లేదు.. త్వరగా.. త్వరగా.. వెళ్లండి!’’ మొన్నీ మధ్య అనేక ప్రపంచ దేశాలను కల వర పెట్టిన ప్రకటన ఇది. అటు రష్యా మొదలుకొని, ఇటు జపాన్, హవాయి, అమెరికాలోని పశ్చిమ తీరం వరకు అన్ని దేశాలు, ప్రాంతాలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాయి. అసలీ సునామీ ఎక్కడ మొదలైంది? అంటే రష్యా పరిధిలోని, పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ‘కమ్చట్కా’లో!. జూలై 29న ఉదయం 4.54 గంటలకు అగ్నిపర్వతాలు బద్ధలై, భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 8.8గా నమోదైంది. ఫలితంగా సముద్రం సునామీగా మారింది. ఇప్పుడా విషయం పక్కనపెడితే.. ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలన్నీ ‘కమ్చట్కా’వైపు చూశాయి. భూగోళంపై అత్యంత మారుమూల ప్రాంతం.. అంతకన్నా ప్రమాదకరమైన ప్రదేశం.. ఇంకా చెప్పాలంటే మానవ మనుగడే కష్టమైన డేంజ రస్‌ప్లేస్!. ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. అనేకమంది పర్యాటకులు ఆ ద్వీపకల్పంపై దృష్టి పెట్టారిప్పుడు. నెట్‌లో కూడా తెగ శోధిస్తున్నారు.
రష్యా దేశ పరిధిలోకి వస్తుందీ ‘కమ్చట్కా’. ఇదొక ద్వీపకల్పం. మాస్కో నుంచి విమానంలో వెళితే పదిగంటల ప్రయాణం. వాతావరణ రీత్యా కూడా ఇదొక విచిత్రమైన ప్రాంతం. కొండలన్నీ మంచు కప్పుకుని తెల్లగా మెరుస్తుంటే.. కొండల కొసన మాత్రం ఎర్రటి నిప్పుల్ని చిమ్ముతూ లావా ఉబికి వస్తుంటుంది. ఆ పక్కనే వేడి నీటి బుగ్గలు, మరోవైపు మంచు గడ్డలు.. ఇంకోవైపున చల్లటి సరస్సులు, వొంపులు తిరిగి ప్రవహించే నదులు.. ఆశ్చర్యం కలుగుతుంది. భూగోళంలో ఒకేచోట ఎడారి, ఆ పక్కనే మంచు, అగ్ని, నీళ్లు కలబోసిన ప్రకృతి మాయా జాలం.. ఏదైనా ఉందంటే అది కమ్చట్కానే అవుతుంది.
2.70 లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించిన ఈ ద్వీప కల్పం పసిఫిక్ మహా సముద్రపు వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అందుకనే దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు. ఇక్కడ భీకరమైన అడవులు, కొండలు, లోయలు ఉండటంతో.. నివాసయోగ్యమైనది కాదు. అయినా సరే .. మానవుడు అడుగుపెట్టాడు. ఇప్పుడక్కడ 2.88 లక్షల జనాభా ఉంది. విచిత్రమేంటంటే మనుషులతో పోటీపడేలా.. ముప్పయి వేల ఎలుగుబంట్లు ఉన్నాయిక్కడ. ప్రతీ ముప్పయిమంది ప్రజలకు ఒక ఎలుగు దర్శనమిస్తుంది. నక్కలు, నీటిగుర్రాలు, సీళ్లు, సాల్మన్‌చేపలు, రెయిన్‌డీర్లు, తిమింగళాలు, తోడేళ్లు.. ఇలా రకరకాల జంతువులు, సముద్ర జీవులకు ఈ ప్రాంతం ఆవాసం.అభయారణ్యం ఎంత పెద్దదంటే.. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లను కలిపితే ఎంత విశాలమో అంత పెద్దది!. చలి కాలంలో మొత్తం గడ్డకట్టిపోతుంది. వసంత కాలం, వేసవిలో మాత్రం కాస్త ఉపశమనం. అప్పుడే జంతువులన్నీ బయటికొచ్చి చేపల్ని వేటాడతాయి. గుడ్లు పెట్టడానికి సాల్మన్ చేపలన్నీ నదుల్లోకి ఎగబాకుతాయి. వాటిని పట్టుకుని తినేందుకు ఎలుగుబంట్లు, తోడేళ్లు పోటీపడే దృశ్యం పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది.
కమ్చట్కాలో మొత్తం 300 అగ్ని పర్వతాలున్నాయి. అందులో ఓ పాతిక చురుకైనవి. కొన్ని ఎప్పుడూ నిత్యాగ్ని హోమంలా భగభగ మండుతూనే ఉంటాయి.
ఇంత ప్రమాదకరమైన కమ్చట్కాలోప్రజలు ఎలా జీవిస్తున్నారు? వాళ్లు ఏం చేస్తుంటారు? అనే ప్రశ్నలు ఆసక్తికరం. ఇక్కడున్న వాళ్లలో మెజారిటీ ప్రజలు రష్యన్లు. ఆ తర్వాత మైనారిటీలైన కొరియాక్‌లు జీవిస్తున్నారు. రష్యన్లు ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి, నౌకల తయారీ, చేపలవేట, సముద్ర ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమలను నిర్వహి స్తుంటారు. కొరియాక్‌లు మాత్రం రెయిన్‌డీర్ జింకల్ని పెంచుకుంటూ జీవనోపాధి పొందు తున్నారు. ఒకరకంగా గొర్రెలకాపర్ల మాదిరన్న మాట. కమ్చట్కాలో ఇన్నేసి వైవిధ్యభరిత దృశ్యాలు కనిపిస్తాయి కాబట్టి.. పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. సాహసోపేత పర్యాటకులు ఎక్కువ. అగ్నిపర్వతాలు పేలి సునామీ మొదలవ్వడంతో కమ్చట్కా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 10 , 2025 | 09:15 AM