వారు.. చదరంగంలో అలా దూసుకుపోతున్నారు..
ABN, Publish Date - Jul 20 , 2025 | 08:23 AM
చతురంగ బలాలతో, ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో, అపురూపమైన విజయాలతో... అంతర్జాతీయంగా దూసుకుపోతున్నారు మన నవ యువ చెస్ క్రీడాకారులు. నేడు (జూలై 20) ‘అంతర్జాతీయ చదరంగ దినోత్సవం’ సందర్భంగా కొందరు భారత ఛాంపియన్స్... ఈ 64 గళ్ల ఆటలోకి ఎలా ప్రవేశించారో, వారి మాటల్లోనే...
చతురంగ బలాలతో, ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో, అపురూపమైన విజయాలతో... అంతర్జాతీయంగా దూసుకుపోతున్నారు మన నవ యువ చెస్ క్రీడాకారులు. నేడు (జూలై 20) ‘అంతర్జాతీయ చదరంగ దినోత్సవం’ సందర్భంగా కొందరు భారత ఛాంపియన్స్... ఈ 64 గళ్ల ఆటలోకి ఎలా ప్రవేశించారో, వారి మాటల్లోనే...
అక్క వల్లే..
మా అక్క వైశాలి (గ్రాండ్ మాస్టర్) చిన్నప్పుడు టీవీతోనే ఎక్కువగా కాలక్షేపం చేసేది. తన దృష్టిని మరల్చడానికి మా అమ్మ ఒక చెస్ బోర్డు కొనిచ్చింది. తను ఇంట్లో ఆడుతూ ఉంటే నాకు కూడా తెలియకుండా చెస్‌పై ఆసక్తి కలిగింది. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక... త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర శిక్షణకు చేరా. నేను ఈ ఆటలోకి అడుగుపెట్టే సమయానికి నా వయసు నాలుగున్నరేళ్లే. చెస్ పోటీల కోసం అక్కా నేను ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం.
- ప్రజ్ఞానంద, తమిళనాడు
టెన్నిస్ వైపు వెళ్లబోయి...
మా అమ్మానాన్న ఇద్దరూ క్రీడా ప్రియులు. దాంతో నాకు ఏదైనా క్రీడలో శిక్షణ ఇప్పించాలను కున్నారు. అమ్మ నన్ను టెన్నిస్‌లో చేర్పించాలనుకుంది. ఒక టెన్నిస్ అకాడమీకి కూడా వెళ్లాం. ట్రైనర్ నన్ను చూసి ‘బక్కపలుచగా ఉన్నాడు... టెన్నిస్ ఏం ఆడుతాడు’ అన్నారు. ఆ తర్వాత అమ్మ తెగ ఆలోచించి నన్ను చెస్‌లో చేర్పించాలనుకుంది. సరిగ్గా అదే సమయంలో స్కూల్‌లో జరిగే వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్నా. చెస్‌లో చురుగ్గా ఉన్నానని, తర్ఫీదు ఇచ్చేందుకు శిక్షకులు ముందుకొచ్చారు. ఆ అడుగులే నాకు చెస్ జీవితాన్నిచ్చాయి.
- గుకేశ్ దొమ్మరాజు, తమిళనాడు
చదరంగం గదిలోకి...
స్కూల్‌లో మాకు జీరో పీరియడ్ ఉండేది. ఆ సమయంలో నేను, మా అన్నయ్య సరదాగా చెస్ గదిలోకి వెళ్లాం. అక్కడ చెస్ బోర్డు మీదున్న తెలుపు, నలుపు గడులు... రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, బంట్లు.. అవన్నీ నన్ను భలే ఆకట్టుకున్నాయి. నాకు కూడా పావులు కదపాలనిపించింది. ఇంటికి వెళ్లగానే మా అమ్మని చెస్ అకాడమీలో చేర్పించమని గోల చేశా. నా గోల భరించలేక ఇంటి వద్దే శిక్షణ ఇప్పించారు. అలా నా కొత్త ప్రయాణం ప్రారంభమై ఆటనే కెరీర్‌గా మలుచుకున్నా.
- వంతికా అగర్వాల్, ఉత్తరప్రదేశ్
టీచర్ల సలహాతో...
చిన్నప్పుడు చదువులో చురుగ్గా ఉండేవాడిని. ముఖ్యంగా లెక్కలు క్షణాల్లో చేసేసేవాడిని. అది మా టీచర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకరోజు మా అమ్మానాన్నను స్కూలుకు పిలిపించి, నాకు చెస్ నేర్పించమని సలహా ఇచ్చారు. చెస్ ఒక్కటే కాకుండా స్విమ్మింగ్, స్కేటింగ్‌లోనూ నన్ను చేర్పించారు. కానీ అన్నింటికన్నా చెస్ బాగా నచ్చడంతో హాబీగా మొదలై, క్రమంగా మెలకువలు నేర్చుకున్నా. కట్‌చేస్తే... తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచా.
- అర్జున్ ఇరిగేశి, తెలంగాణ
చాక్లెట్ల కోసం శిక్షణలో చేరా
నేను చదరంగంలోకి అనుకోకుండా వచ్చాను. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడనుకుంటా.. మా అక్కతో కలిసి బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్లేదాన్ని. చిన్నపిల్లని అవడంతో షటిల్‌కాక్‌ని అవతలి కోర్టులోకి కొట్టలేకపోయేదాన్ని. అయితే అక్కడే మరోవైపు చెస్ శిబిరం జరుగుతూ ఉండేది. మా పేరెంట్స్ నన్ను అక్కడ చేర్పించారు. మొదట నేను చెస్ క్లాసులకి వెళ్లనని మారాం చేసేదాన్ని. ‘‘బుద్ధిగా వెళితే రోజూ బోలెడన్నీ చాక్లెట్లు కొనిస్తా’’ అని నాన్న బంపరాఫర్ ఇచ్చారు. దాంతో ఉత్సాహంగా క్లాసులకి హాజరయ్యేదాన్ని. క్రమంగా చెస్‌పై ఆసక్తి ఏర్పడింది. ఇంట్లో నాన్నపై గెలుస్తోంటే.. సంతోషమేసేది. ఆ తర్వాత ఆటను సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగా.
- దివ్యా దేశ్‌ముఖ్, మహారాష్ట్ర
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 20 , 2025 | 08:26 AM