కొండల నడుమ చరిత్ర పుటల్లోకి...
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:29 PM
పాపులర్ దేశాలకు పర్యాటకం మామూలే. అందుకే విభిన్న దేశంగా, అనేక ప్రత్యేకతలున్న జార్జియాను చూడాలనే ఆసక్తి కలిగింది. 1991లో సోవియట్ యూనియన్‌లో ఉన్న జార్జియా దేశ రాజధాని టిబిలిసి ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం దిగాం. ఇండియన్ పాస్‌పోర్టు ఉన్నవారికి గతంలో ‘ఆన్ అరైవల్ వీసా’ సదుపాయం ఉండేది.
పురాతన, చారిత్రాత్మక ప్రదేశాలు చూడాలంటే జార్జియాను మించింది లేదు. అందుకే మన తెలుగు సినిమాలు కూడా షూటింగుల కోసం అక్కడికి వెళ్తున్నాయి. నల్ల సముద్రాన్ని, రష్యాను ఆనుకుని ఉన్న ఈ దేశంలో చూడదగ్గ ప్రాంతాలకు కొదవ లేదు. ఆ విశేషాలే ఇవి...
పాపులర్ దేశాలకు పర్యాటకం మామూలే. అందుకే విభిన్న దేశంగా, అనేక ప్రత్యేకతలున్న జార్జియాను చూడాలనే ఆసక్తి కలిగింది. 1991లో సోవియట్ యూనియన్‌లో ఉన్న జార్జియా దేశ రాజధాని టిబిలిసి ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం దిగాం. ఇండియన్ పాస్‌పోర్టు ఉన్నవారికి గతంలో ‘ఆన్ అరైవల్ వీసా’ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ముందే వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. జార్జియాలో కరెన్సీ పేరు ‘లారీ’. వినటానికి గమ్మత్తుగా ఉందనుకున్నాం. ఒక్క లారీ మన 30 రూపాయలకు సమానం. ఎయిర్‌పోర్టులోనే లోకల్ సిమ్ తీసుకుని, నగరంలోని హోటల్‌కు బయలుదేరాం. దారికి రెండు వైపులా సోవియట్ కాలంనాటి భవనాలు కనిపించాయి. రోడ్లకు ఆనుకుని కనుచూపుమేర ఆకుపచ్చ, పసుపు వర్ణపు ఆకులతో ఎత్తయిన ఎసెర్, ప్లాటనస్ చెట్లు చూపు తిప్పుకోనివ్వవు. వాటి నుంచి రాలిన ఆకులతో ముస్తాబైన ఫుట్‌పాత్‌ల మీద ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న స్థానికులను చూడగానే నాక్కూడా వారితో పాటు నడవాలనిపించింది.
66 అడుగుల ‘మదర్’ ...
సిటీ సెంటర్‌గా చెప్పుకునే చోట ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ థియేటర్ ఎదురుగా ఉంది మా హోటల్. గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుని టిబిలిసి నగరం చూడటానికి బయల్దేరాం. సాధారణంగా కేబుల్ కార్లు నగరానికి దూరంలో ఎత్తయిన కొండలపై ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం నగరంలోనే ఉన్నాయి. టికెట్ తీసుకొని కేబుల్ కార్ ఎక్కాం. ఎదురుగా ఉన్న కొండపై ఏటవాలుగా ఉన్న రంగు రంగుల ఇళ్లు బొమ్మరిల్లుల్లా కనిపించాయి. అప్పటికి సూర్యాస్తమయం దాటింది. కొండపైన కేబుల్‌కార్ గ్లాస్‌డోర్లు తెరచుకోగానే చల్లటిగాలి రివ్వున తాకింది. 4వ శతాబ్దానికి చెందిన ‘నారికలా’ కోట కనిపించింది. ఈ కోట ఉన్న కొండ పేరు సోలోలకి.
కొండ అంచున టిబిలిసి నగరం 1500వ వార్షికోత్సవం సందర్భంగా 1958లో ఏర్పాటుచేసిన ‘మదర్ ఆఫ్ జార్జియా’ విగ్రహం ఆకట్టుకుంది. 66 అడుగుల ఎత్తున ఈ విగ్రహం ఎడమ చేతిలో స్నేహితులను ఆహ్వానించడానికి వైన్ గిన్నె, కుడిచేతిలో శత్రువులను ఎదుర్కోవటానికి ఖడ్గం ఉన్నాయి. అతిథులను దేవుడు పంపిన బహుమతులుగా, శత్రువుల పట్ల దయలేనివారుగా జార్జియన్లు చూస్తారనడానికి ఉదాహరణగా ఈ విగ్రహాన్ని పేర్కొనవచ్చు. కొండపై నుంచి కిందికి చూస్తే నగరం బంగారు వర్ణపు దీపకాంతులతో ధగధగ మెరిసిపోతూ కనిపిస్తుంది. తిరిగి కేబుల్ స్టేషన్‌కు వచ్చి, తర్వాత రైలు పార్క్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి పూనిక్యులర్ అనే కేబుల్ రైలెక్కి మరో కొండ పైకి వెళ్లొచ్చు. పైకి వెళ్లేప్పుడు పూర్తి నిటారుగా, దిగేప్పుడు పూర్తి వాలుగా ఉంటుంది. పైన నైట్ మార్కెట్, రెస్టారెంట్ ఉన్నాయి. ఇది నారికలా కోట కన్నా ఎత్తయిన ప్రాంతం కావడంతో, చలికి ఎక్కువ సేపు ఉండలేక హోటల్‌కు తిరుగు ప్రయాణమయ్యాం.
స్టాలిన్ ఇల్లు...
రెండోరోజు నగరం నుంచి గంట ప్రయాణం చేసి ‘జ్వారి మొనాస్ట్రీ’కి చేరుకున్నాం. కొండ మీది నుంచి కిందకి చూస్తే... రెండు వేరు వేరు రంగుల్లో నదీ సంగమం ఇంగ్లీషు ‘వై’ ఆకారంలో కనిపిస్తుంది. 6వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ‘యునెస్కో’ గుర్తింపు పొందింది. అక్కడి నుంచి ‘గోరి’కి బయలుదేరాం. పెద్ద పార్కు ముందు కారు ఆపి, మా డ్రైవర్ కమ్ గైడ్ జాల్ ఒక ఇంటి వైపు చూపించాడు. వంద గజాల విస్తీర్ణంలో ఉందా ఇల్లు. అందులోనే సోవియట్ యూనియన్‌ను మూడు దశాబ్దాల పాటు పాలించడంతో పాటు, ప్రపంచంలోనే బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన జోసఫ్ ‘స్టాలిన్’ పుట్టాడని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా.
స్టాలిన్ తండ్రి చెప్పులు కుట్టింది ఈ ఇంటి నేలమాళిగలోనే. ఇంటి వెనుక స్టాలిన్ విగ్రహం, దానికి ఎదురుగా పెద్ద భవనంలో స్టాలిన్ మ్యూజియం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది స్టాలిన్ అభిమానులు ఇక్కడికి వస్తుంటారని తెలిసింది. ఉదయాన్నే బయల్దేరడం, కొండలెక్కి దిగడం, మ్యూజియం మొత్తం తిరగడంతో బాగా ఆకలేసింది. ఓ బేకరీలో ‘కచాపురి’ తిన్నాం. రొట్టెలో పెరుగు, చీజ్, ఎగ్, ఇతర పదార్థాలతో కలిపి తయారుచేసే జార్జియన్ సంప్రదాయ వంటకమిది. ఆ తర్వాత మరో 60 కిలోమీటర్లు ప్రయాణించి ‘ఎమ్‌స్కేతా’ నగరానికి చేరుకున్నాం. ప్రపంచ పురాతన నగరాల్లో ఇది ఒకటి.
ఒకప్పుడు జార్జియాకు రాజధానిగా ఉండేది. 4వ శతాబ్దంలో నిర్మించిన ఇక్కడి ‘స్వెటిత్‌ష్కావెలి’ కాథేడ్రల్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇక్కడే జార్జియన్ రాజుల పట్టాభిషేకాలు జరిగాయి. ఇక్కడే వారి సమాధులున్నాయి. ఈ చర్చి ముందే ‘కంచె’ సినిమాలో యూదులను కాపాడే సన్నివేశాలు చిత్రీకరించారట.
ఆ తర్వాత టిబిలిసీ నగర శివార్లలో సముద్రమట్టానికి 686 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ అంచుపై పెద్ద స్విమ్మింగ్‌పూల్‌ను తలపించే ‘టర్టల్’ సరస్సుకు వెళ్లాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ సరస్సు ప్రాంతం కుటుంబసమేతంగా సేద తీరడానికి సరైన ఛాయిస్.
170 ఏళ్ల ఒపేరా థియేటర్...
మూడోరోజు రెండు గంటలు ప్రయాణం చేసి ‘కాఖేటి’ చేరుకున్నాం. ప్రాచీన సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసే ఇక్కడి వైన్‌కి చాలా గుర్తింపు ఉంది. ఇళ్లల్లో తయారుచేసే బ్రెడ్, జామ్, వైన్ ఇక్కడ అమ్ముతారు. యూరోప్ దేశాల్లో ఓపెరా ప్రదర్శనలు జరిగినట్టే... ఇక్కడ కూడా 170 ఏళ్ల క్రితం నిర్మించిన ఒపేరా, బ్యాలే థియేటర్ ఉంది. వేయి మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సౌకర్యం ఉంది. ఒక్కసీటు కూడా ఖాళీలేదు. ఎప్పుడూ హౌస్‌ఫుల్‌గానే ప్రదర్శనలు ఉంటాయట. సినిమాహాల్లో తెరపై పేర్లు వేసినట్లుగా ఈ షోలో నటిస్తున్న కళాకారులతో పాటు సాంకేతిక నిపుణుల పేర్లు ఒక కాగితంపై ప్రింట్ చేసి ఇచ్చారు. ప్రదర్శన మొదలయ్యాక ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఆస్వాదిస్తూ, చప్పట్లతో అభినందిస్తుంటే అద్భుతం అనిపించింది.
మరుసటి రోజు టిబిలిసీలో హోటల్ ఖాళీ చేసి, ‘కజ్జెగి’ బయలుదేరాం. నగరం మధ్య నుంచి నిండుగా ప్రవహించే కుర నదికి రెండువైపులా రోడ్లు, మధ్యలో సోవియట్ పాలనలో నిర్మించిన భారీ వంతెనలున్నాయి. హైవే మీద ప్రయాణించిన కాసేపటికి గ్రేటర్ కాక్సస్ పర్వత శ్రేణులు మొదలయ్యాయి. మార్గమధ్యలో వ్యూపాయింట్ దగ్గర ఆగాం. అక్కడ జార్జియా, రష్యా దేశాల మైత్రికి గుర్తుగా అర్ధవృత్తాకారంలో ఒక నిర్మాణం ఉంది. అందులో రెండు దేశాల నాగరికతలకు, చరిత్రకు సంబంధించిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. జార్జియాలో ఎత్తయిన ప్రాంతం ‘కజ్జెగి’. అక్కడి హోటల్ నుంచి ఎటు చూసినా ఎత్తయిన పర్వతశ్రేణులు కనిపిస్తాయి.
జార్జియాలో చాలా చర్చ్‌లున్నాయి. అవన్నీ 4 నుంచి 14 శతాబ్దాల మధ్య కట్టినవే. కజ్జెగి నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే రష్యా దేశ సరిహద్దు చేరుకోవచ్చు. ఇక్కడి కొండలపై తిరుగుతున్న గుర్రాలను చూడగానే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాల షూటింగులు ఇక్కడే జరిగినట్టుగా గుర్తొచ్చింది. జార్జియాలో ఏ ప్రాంతానికి వెళ్లినా తత్వవేత్తలు, కవులు, రచయితల విగ్రహాలు కనబడతాయి. ఒక పార్కులో సుప్రసిద్ధ రచయిత పుష్కిన్ విగ్రహం చూశాం. ఆ కూడలి కూడా ఆయన పేరుతోనే ఉంది. టిబిలిసీలో లెనిన్ స్క్వేర్‌ను ఫ్రీడం స్క్వేర్‌గా మార్చారు. సోవియట్ సైన్యం దాడికి గుర్తుగా బండరాయిని పెట్టారు. అయినప్పటికీ ఓ మహారచయిత అయిన పుష్కిన్ విగ్రహ్నాన్ని కదపని, పేరు మార్చని జార్జియన్ల మనసు కాక్సస్ పర్వతాలకన్నా మహోన్నతంగా అనిపించింది.
- నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 20 , 2025 | 01:29 PM