Bangalore Landlord: ఇలాంటి ఇంటి ఓనర్లు కూడా ఉంటారా.. అద్దెకున్న యువకుడికి ఎలాంటి గిఫ్ట్
ABN, Publish Date - Jul 22 , 2025 | 08:11 AM
ఇళ్లు ఖాళీ చేసే సమయంలో ఓనర్ ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి యువకుడు ఆశ్చర్యపోయాడు. తమ ఇంటి ఓనర్ ఎంత మంచి వ్యక్తో చెబుతూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇలాంటి వాళ్లు భూమ్మీద ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోందని కొందరు కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి ఓనర్లు అద్దెకున్న వారిని ఇక్కట్ల పాలు చేసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. తాము ఎలాంటి అగచాట్ల పాలైందీ చెబుతూ బాధితులు నెట్టింట పోస్టులు పెడుతుంటారు. అయితే, ఇందుకు భిన్నమైన ఆసక్తికర ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఇంటి ఓనర్ ఎంత మంచి వ్యక్తో చెబుతూ ఓ యువకుడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అంటూ జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
తాను ఒక అపార్ట్‌మెంట్‌లో దాదాపు రెండేళ్ల పాటు అద్దెకు ఉన్నానని ఆ యువకుడు తన పోస్టులో తెలిపాడు. అక్కడ ఉన్నన్ని రోజులు ఇంటి ఓనర్ తనను సొంత కొడుకులా ఆదరించారని వివరించారు. ఏ సహాయం కావాలన్నా వెంటనే చేసేవారని తెలిపారు. ఇంటి ఓనర్ స్కూటర్‌ను తాను అవసరమైన సందర్భాల్లో తీసుకుని వాడుకునే వాడినని చెప్పారు. తమ మధ్య ఒక్కసారి కూడా అభిప్రాయ భేదం రాలేదని అన్నారు.
చివరకు ఇల్లు ఖాళీ చేసిన సమయంలో ఓనర్ తనకు ఓ వెండి కడియాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారని అన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి తనకు జీవితంలో ఎప్పుడూ తారసపడలేదని చెప్పి సంబరపడ్డారు. ‘బెంగళూరులో ఇంటి ఓనర్లు కనీసం ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగివ్వరు. కానీ మా ఇంటి ఓనర్ మాత్రం నాకు ఫేర్‌వెల్ గిఫ్ట్ ఇచ్చారు’ అని సదరు యువకుడు సంబరపడ్డారు.
రెడిట్‌లో యువకుడు పెట్టిన ఈ పోస్టు సహజంగానే తెగ వైరల్ అయిపోయింది. అనేక మంది సదరు ఇంటి ఓనర్‌పై ప్రశంసలు కురిపించారు. మానవత్వం అంటే ఇదీ అంటూ కామెంట్ చేశారు. ఆ ఇంటి ఓనర్ నుంచి స్ఫూర్తి పొంది ఇతరులతో కూడా అలాగే వ్యవహరించాలని యువకుడికి కొందరు సూచించారు. సమాజానికి మనం ఇచ్చేదే ప్రతిఫలంగా తిరిగొస్తుందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. తాము కూడా అద్దెకు ఉండేవారికి ఇలాగే సాయపడుతుంటామని కొందరు చెప్పారు. చిన్న పట్టణాలు, నగరాల్లో సాధారణంగా పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మహానగరాల్లో ఇలాంటి ఇంటి ఓనర్లు లభించడం అరుదేనని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం
రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..
Updated Date - Jul 22 , 2025 | 01:06 PM