రెక్కలు విప్పితే... ఆకాశమే హద్దుగా...
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:51 AM
అమెరికాకు చెందిన ‘బి-2 బాంబర్’ యుద్ధవిమానాలు ఇరాన్ మీద మెరుపు దాడి చేశాయన్న వార్తలు ఇటీవల పతాక శీర్షికల్లో నిలిచాయి. అత్యంత వేగవంతమైన ఈ బి -2 బాంబర్ విమానాల తయారీకి స్ఫూర్తి ఓ పక్షంటే నమ్మగలరా? వేగం విషయంలో కొన్ని పక్షుల సామర్థ్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
అమెరికాకు చెందిన ‘బి-2 బాంబర్’ యుద్ధవిమానాలు ఇరాన్ మీద మెరుపు దాడి చేశాయన్న వార్తలు ఇటీవల పతాక శీర్షికల్లో నిలిచాయి. అత్యంత వేగవంతమైన ఈ బి -2 బాంబర్ విమానాల తయారీకి స్ఫూర్తి ఓ పక్షంటే నమ్మగలరా? వేగం విషయంలో కొన్ని పక్షుల సామర్థ్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. గాలితో పోటీపడుతూ... అత్యంత వేగవంతమైన పక్షులుగా పేరుతెచ్చుకున్న అలాంటి కొన్నింటిపై విహంగ వీక్షణం...
ఉభయచరం
ఉత్తర అమెరికా, యూరేసియా సముద్ర తీరాల్లో, సరస్సులలో ఎక్కువగా కనిపించే పక్షి ‘రెడ్ బ్రీస్టెడ్ మెర్గాన్సర్’. ఇది ఒకలాంటి బాతు. నీళ్లలో బాగా ఈదుతాయి. అదేవిధంగా ఆకాశంలోనూ దూసుకుపోతాయి. నీటిలోపల వేగంగా ఈదడానికి తగినట్టుగా ఈ పక్షుల కాళ్ల వేళ్ల మధ్య చర్మం ఉంటుంది. వీటి ముక్కు సన్నగా, పొడవుగా ఉండడం వల్ల చేపల్ని సులభంగా పడతాయి. మెడ కూడా పొడవుగా ఉంటుంది. బలమైన రెక్కల వల్ల వేగంగా ఎగిరే శక్తి దీనికుంది.
రెడ్ బ్రీస్టెడ్ మెర్గాన్సర్
వేగం - 130 కిమీ.
స్వేచ్ఛకు చిహ్నం
జర్మనీ, మెక్సికో, కజకిస్తాన్, అల్బేనియా తదితర దేశాల జాతీయ పక్షి ‘గోల్డెన్ ఈగిల్’. చాలా దేశాల సంస్కృతుల్లో స్వేచ్ఛ, శక్తి, పౌరుషానికి మారుపేరుగా గోల్డెన్ ఈగిల్‌ను భావిస్తారు. ఉత్తరార్థగోళంలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. మన హిమాలయాల్లోనూ ఉన్నాయి. ఈ పక్షుల రెక్కల పొడవు అక్షరాలా ఏడడుగులు. ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఇదే. అత్యధిక ఎత్తులో ఎగురుతూ ఆహారం కోసం కింద ఉన్న వాటిని పసిగట్టి, వాయువేగంతో నేల మీదకి వచ్చి దాన్ని వేటాడటం వీటి ప్రత్యేకత. వీటి కంటి చూపు అమోఘం. ఈ పక్షుల తల వెనక, మెడ మీద బంగారు వర్ణంలో మెరుస్తుంటుంది. అందుకే ‘గోల్డెన్ ఈగిల్’ అనే పేరు వచ్చింది. రెక్కలను ‘వి’ ఆకారంలో విప్పి ఎగురుతుంటాయి. ఇవి నక్కలను సైతం వేటాడగలవు. కొంగలు, కుందేళ్లను ఎక్కువగా ఆరగిస్తుంటాయి. గోల్డెన్ ఈగిల్ పక్షులకు నిగూఢమైన శక్తులు ఉన్నాయని కొన్ని పురాతన తెగలు విశ్వసిస్తాయి.
గోల్డెన్
ఈగిల్
వేగం - 320 కి.మీ.
ఎగురుతూ నిద్రపోతాయి
వలస పక్షికి చక్కని చిరునామా ‘వైట్ త్రోటెడ్ నీడిల్ టెయిల్’. వీటి తోక సూదుల్లా ఉంటాయి కాబట్టి ఆ పేరు. 20 సెంటీమీటర్ల పొడవుతో, 120 గ్రాముల బరువు తూగే ఓ మోస్తరు పక్షులు ఇవి. గొంతు దగ్గర తెల్లగా ఉంటుంది. ఒకచోట కూర్చునేందుకు అస్సలు ఇష్టపడవు. ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూనే ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఎగురుతూనే అప్పుడప్పుడు నిద్రపోతాయి కూడా. ఆసియా, ఆస్ట్రేలియాలోని అడవులు, రాతి కొండల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సెంట్రల్ ఆసియా, దక్షిణ సైబీరియాలకు సంతానోత్పత్తి కోసం వెళతాయి. శీతాకాలంలో భారతదేశం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తుంటాయి. యూరప్‌లో మాత్రం అరుదుగా కనిపిస్తాయి. 2013లో గ్రేట్ బ్రిటన్‌లో ఓసారి ఈ పక్షి కనిపించింది. కానీ కొద్దిసేపటికే గాలి దుమారంలో మరణించింది. ఆ పక్షి కళేబరాన్ని అక్కడి మ్యూజియానికి తరలించడం విశేషం. పేడపురుగులు, కీటకాలు, తేనెటీగలు, సీతాకోకచిలుకల్ని తింటూ జీవిస్తుంటాయి.
వైట్
త్రోటెడ్ నీడిల్
టెయిల్
వేగం - 169
కి.మీ.
ఫైటర్‌జెట్‌లకు స్ఫూర్తి
భూమిపై చిరుతను మించిపోయే వేగంతో... గాలిలో దూసుకుపోయే పక్షిరాజం ‘పెరిగ్రిన్ ఫాల్కన్’. అందుకే అత్యంత వేగవంతమైన పక్షిగా పెరిగ్రిమ్‌ను పిలుస్తారు. చూడడానికి పెద్ద కాకిలా అనిపిస్తుంది. అంటార్కిటికా తప్పించి మిగతా అన్ని ఖండాలలో ఇవి నివసిస్తున్నాయి. పర్వతాలు, తీరప్రాంతాలు, నగరాల్లో కనిపిస్తుంటాయి. అలా అత్యంత వేగంగా ఎగిరేందుకు కారణం ఈ పక్షి దేహ నిర్మాణమే. వీటి ముక్కు రంధ్రాలలో చిన్న గడ్డల లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వేగంగా ఎగిరేప్పుడు గాలి బలంగా ఊపిరితిత్తుల లోపలికి వెళ్లకుండా ఈ గడ్డలు అరికడతాయి. వీటి గుండె చాలా శక్తివంతమైనది. పెరిగ్రిన్ కళ్లపై అదనంగా ఇంకో కనురెప్ప ఉంటుంది. అలాగే వెడల్పయిన రొమ్ము వీటి సొంతం. వెన్నెముక తోక దగ్గర రెండు వెన్నుపూసలు అదనంగా ఉంటాయి. బలంగా ఎగిరేలా ఇవి తోడ్పడతాయి. గాల్లో ఎగిరే సమయంలో ఈ పక్షులు కళ్లను రక్షించుకునేందుకు గ్లిజరిన్ లాంటి చిక్కని కన్నీళ్లని ఉత్పత్తి చేస్తాయి. వేటాడే సమయంలో వీటి వేగం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఫాల్కన్ల వాయుగతి శాస్త్రం ఆధారంగా అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ‘బి-2 బాంబర్’ ఫైటర్‌జెట్ విమానాలను రూపొందించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పక్షి శక్తిసామర్థ్యాలు
ఏపాటివో.
పెరిగ్రిన్ ఫాల్కెన్
వేగం - 380 కి.మీ.
అలసటే రాదు
ఫాల్కన్లలో పెద్ద పక్షులు ‘గిర్’. ఆర్కిటిక్, సబ్ ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా 130 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటాయి. అయితే వేటాడేప్పుడు ఈ వేగం మరింత ఉద్ధృతం అవుతుంది. వీటి దేహ నిర్మాణం అత్యంత దృఢమైనది. ఎంత సేపయినా వేటాడుతాయి, అస్సలు అలసిపోవు. సముద్ర పక్షులే వీటి ప్రధాన ఆహారం. రంగులు మార్చే పక్షులుగా వీటిని పిలుస్తారు. ఇవి నివసిస్తోన్న ప్రాంతాన్ని బట్టి వీటి తెలుపు రంగులో మార్పులు కనిపిస్తాయి.
గిర్ ఫాల్కన్‌్
వేగం - 130 కిమీ.
దొంగ తెలివి
సముద్ర పక్షుల రకానికి చెందినవి ‘ఫ్రిగేట్’లు. దక్షిణ అమెరికా, మెక్సికో, కరేబియన్ ద్వీప తీరాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మనదేశంలో ఎప్పుడో ఓసారి మాత్రమే కనిపిస్తాయి. రోజుల తరబడీ ఎగరుతూనే ఉండే పక్షులివి. సంతానోత్పత్తికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కిందకి వస్తాయి. మనుషుల అలజడి తక్కువగా ఉండే ద్వీపాలను ఎక్కువగా ఇష్టపడతాయి. వీటి శరీరం చిన్నగా అనిపిస్తుంది కానీ రెక్కలు మాత్రం పెద్దవి. ఇతర పక్షుల ఆహారం దొంగలించ డంలో ఇవి ఎక్స్‌పర్టులు. ఆహారాన్ని దొంగిలించేందుకు ఎంత వేగంగా వస్తాయో, కావాల్సింది దొరికిన తర్వాత అంతే వేగంగా ఎగిరిపోతాయి. ఫ్రిగేట్ల శక్తి అంతా బలమైన తోక వల్లే. మేటింగ్ సమయంలో ఈ జాతి మగ పక్షులకు ప్రత్యేకంగా మెడ దగ్గర బెలూన్ లాంటి తిత్తి ఏర్పడడం విశేషం.
ఫ్రిగేట్
స్పీడ్ - 153 కి.మీ.
ఛేజింగ్ మాస్టార్లు
యూకేలో సంరక్షణ పరిధిలో ఉన్న పక్షుల్లో ‘యూరేసియన్ హాబీ’ ఒకటి. సన్నగా కనిపించే చిన్న పక్షులు ఇవి. గాల్లో ఎగురుతోన్న కీటకాలని, పక్షులని గాల్లోనే వేటాడటంలో ఈ హాబీలు నిష్ణాతులు. ప్యాంటు వేసుకున్నట్టుగా హాబీ కాళ్ల దగ్గర ఎర్రగా ఈకలు ఉంటాయి. కాళ్ల రంగు పసుపుపచ్చ. నల్లని ముక్కు, దాని కింద పసుపే. కళ్ల చుట్టూ ఉండే వలయం కూడా పసుపే. యూరేసియన్ హాబీ రెక్కలు బయటకి చొచ్చుకుని చాలా పదునుగా ఉంటాయి. అందుకే ఇవి మిగతా వాటికన్నా వేగంగా ఆకాశంలో ఎగురగలుగుతున్నాయి.
యూరేసియన్ హాబీ
వేగం - 160 కి.మీ.
విషపూరితం
అతి పెద్ద నీటి పక్షులు ‘స్పర్ వింగ్డ్ గూస్’. ఈ పక్షులు ఆఫ్రికాకు చెందినవి. ఏడు కిలోలకు పైగా బరువుంటాయి. అయినప్పటికీ 142 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంటాయి. వీటి రెక్కలపై ముల్లుల్లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ పేరు వచ్చింది. వీటితో పోరాడటం మిగతా పక్షులకు, కొన్నిసార్లు జంతువులకు కూడా చాలా కష్టం. రెక్కలతో గీరేస్తాయి. విచిత్రంగా విషపూరిత కీటకాలను తింటూ తమ శరీరంలో కూడా విషాన్ని నింపుకొంటాయి. అందుకే వేట పక్షులకు, జంతువులకు, మనుషులకూ ఇవి హానికారకం.
స్పర్ వింగ్డ్ గూస్
వేగం- 142 కి.మీ.
Updated Date - Jul 06 , 2025 | 11:51 AM