70 Year Old Woman Viral Video: ఆర్థరైటిస్ ఉన్న వృద్ధులెవరైనా ఇలా చేయగలరా..
ABN, Publish Date - May 02 , 2025 | 03:55 PM
70 ఏళ్ల వయసులో జిమ్ మొదలెట్టి కీళ్ల నొప్పులపై విజయం సాధించిన ఓ వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: 70 ఏళ్ల వృద్ధులు చాలా వరకూ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటారు. పట్టుమని రెండు అడుగులు వేసేందుకు కూడా ఇబ్బంది పడతారు. కానీ ఈ వయసులో ఆర్థరైటిస్ బారిన పడ్డ ఓ వృద్ధురాలు చివరకు జిమ్‌లో కసరత్తులు మొదలెట్టి ప్రస్తుతం 60 కేజీల వెయిట్స్ కూడా సునాయసంగా ఎత్తుతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అందుకే ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఆరాధ్య ఛటర్జీ అనే ఇన్‌ప్లుయెన్సర్ ఈ ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోష్ణీ దేవీ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని పరిచయం చేస్తూ ఆమె ఎలా కీళ్ల వ్యాధి, నొప్పుల నుంచి బయటపడిందీ చెబుతూ నెట్టింట పోస్టు పెట్టారు.
రోష్ణీ ఈ వయసులో కూడా రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. వ్యాయామశాలలో ఆమె ప్రతి రోజూ 60 కేజీల డెడ్ లిఫ్ట్స్ ఎత్తడంతో పాటు 40 కేజీ స్క్వాట్స్, 100 కేజీ లెగ్ ప్రెసెస్ చేస్తార చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం కీళ్ల నొప్పులు మొదలైనప్పటికీ దాన్నుంచి తేరుకుని ఈ స్థాయికి చేరుకోవడం సామాన్యం విషయం కాదని అన్నారు. అయితే, మొదట తను చాలా ఇబ్బంది పడేదాన్నని రోషణీ కూడా చెప్పుకొచ్చారు
68 ఏళ్ల వయసులో ఓసారి కీళ్ల నొప్పులు మొదలయ్యాక సాధాణ జీవితం గడపడం కూడా కష్టంగా మారిందని రోషణీ అన్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తరువాత కాలం గడిచే కొద్దీ సారీరక దృఢత్వం పెరిగిందని వివరించారు. ఇప్పటివరకూ జిమ్‌కు వెళ్లకుండా ఒక్క రోజు కూడా ఉండలేకుండా ఉన్నానని తెలిపారు. భారత్‌లో స్ట్రాంగ్ మహిళగా గుర్తింపు పొందటమే తన లక్ష్యమని కూడా చెప్పారు.
కాగా ఈ వీడియోపై కొందరు ఆర్థోపెడిక్ సర్జన్లు కూడా స్పందించారు. ఇంత పెద్ద వయసులో కసరత్తులు ప్రారంభించినా శరీరం క్రమంగా అలవాటు పడుతుందని చెప్పారు. బరువులు ఎత్తే క్రమంలో ఎముకలు దృఢంగా మారుతాయని, కండరాలు కూడా బలంగా అవుతాయని చెప్పారు. ఎముకలు, కండరాల బలం పెరిగే కొద్దీ కీళ్లపై కూడా ఒత్తిడి తగ్గి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోపై జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో కీళ్ల నొప్పుల్ని జయించడమంటే సామాన్యమైన విషయం కాదని అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - May 02 , 2025 | 03:59 PM