US Visa: భారతీయ విద్యార్థుల వీసా ఇక్కట్లు.. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గే ఛాన్స్
ABN, Publish Date - Jul 18 , 2025 | 09:50 AM
వీసా స్లాట్స్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఈ స్లాట్స్ అందుబాటులోకి రాకపోతే ఈసారి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గుతుందని వీసా కన్సల్టెంట్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో అమెరికా యూనివర్సిటీల్లో ఫాల్ సెమిస్టర్ మొదలు కానుంది. కానీ, వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల ఊసే లేకపోవడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వీసా దరఖాస్తుల తిరస్కరణలు కూడా పెరగడంతో ఈ సీజన్‌లో అమెరికాకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ సంఖ్య ఏకంగా 70 శాతం మేర తగ్గే అవకాశం ఉందని వీసా కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి.
కన్సల్టెన్సీలు చెప్పే దాని ప్రకారం, సాధారణంగా భారతీయులు ఈపాటికి వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని యూఎస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైపోయింది. అనేక మంది ఇప్పటికీ వీసా స్లాట్ కోసం రోజూ సంబంధిత వెబ్‌సైట్స్‌లో చెక్ చేస్తూ గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని కొందరు కన్సల్టెంట్లు వ్యాఖ్యానించారు.
వీసా స్లాట్స్‌ను దశల వారీగా అందుబాటులోకి తెస్తామని అమెరికా అధికారులు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ స్లాట్స్ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడిపోతున్నారు. ఈ మధ్య కొన్ని స్లాట్స్ అందుబాటులోకి వచ్చినా వాటిని బుక్ చేసుకున్న వారికి ఇంకా ధ్రువీకరణ రాకపోవడంతో ఏం చేయాలో తెలీని స్థితిలో పడిపోయారు. కన్ఫర్మేషన్ లేకుండా స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం ఇవ్వడంలో ఔచిత్యం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తమ దరఖాస్తులను కూడా ఉపసంహరించుకుంటున్నారు.
తమకు వీసా స్లాట్ కోసం వేచి చూసేంత సమయం లేదని చెబుతున్న కొందరు భారతీయ విద్యార్థులు జర్మనీ లాంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లుతున్నారు. మరికొన్ని రోజుల్లో స్లాట్స్ అందుబాటులోకి రాకపోతే అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఏకంగా 70 శాతం మేర కోత పడొచ్చని కొందరు వీసా కన్సల్టెంట్లు చెబుతున్నారు.
ఇక వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటం కూడా విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అన్ని అర్హతలు ఉండి వీసా దక్కాల్సిన వారికి కూడా చుక్కెదురవుతోంది. సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఎలాంటి అభ్యంతరకరమైన అంశాలు లేకపోయినా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చదువులు పూర్తయ్యాక భారత్‌కు తిరిగొస్తామనే నమ్మకాన్ని అభ్యర్థులు కలిగించలేకపోవడంతో తిరస్కరణలు ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
30 ఏళ్ళ నాటి ఫోర్జరీ కేసు.. సౌదీలో తెలుగు ఇంజినీరు అరెస్ట్
డాలస్‌లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి
Updated Date - Jul 18 , 2025 | 10:05 AM