TAG ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ABN, Publish Date - Nov 10 , 2025 | 04:33 PM
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని మ్యూనిక్, కొలోన్ నగరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలోని మ్యూనిక్, కొలోన్ నగరాలలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మనీ ఇ.వి. (TAG) ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారాంతంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది. టీటీడీ డిప్యూటీ ఇ.ఇ. మల్లయ్య పర్యవేక్షణలో టీటీడీ వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ క్రతువును నిర్వహించింది. వేద మంత్రోచ్చారణలు, సంప్రదాయ సంగీతం, మంగళవాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది (Sri Venkateshwara Kalyana mahotsavam Munich).
విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. తిరుమలలో జరిగే విధంగా అర్చకులు కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా తీర్చిదిద్దారు. ప్రాంగణం మొత్తం ‘గోవిందా... గోవిందా...’ నినాదాలతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ సహా వివిధ రాష్ట్రాల భక్తులతో పాటు అనేక విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం, కళ్యాణ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జర్మనీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కళ్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం తమ భాగ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
TAG అధ్యక్షులు నరేష్ కోనేరు, జనరల్ సెక్రటరీ సుమంత్ కొర్రపాటి, ట్రెజరర్ డా. శ్రీకాంత్ కుడితిపూడి, మాట్లాడుతూ జర్మనీలో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం తమకు లభించిన అదృష్టమని పేర్కొన్నారు.
మ్యూనిక్‌లో జరిగిన శ్రీనివాస కళ్యాణానికి శర్మ ఆర్యసోమయాజుల, పవన్ భాస్కరలతో కూడిన శివాలయం బృందం, TAG బవేరియా టీమ్, వెంకట్ కండ్ర, రామ్ బోళ్ళ, టిట్టు మద్దిపట్ల, శివ నక్కల, బాల అన్నమేటి, శ్రీనివాస్ దామ, విద్యాసాగర్ రెడ్డి, వికాస్ రామడుగు, రంజిత్, శ్రీనివాస రెడ్డి, కృష్ణ కాంత్, అశోక్ రెడ్డి, కళ్యాణ్ దుళ్ల, కిషోర్ నీలం, హరి, లీల మనోరంజన్, రవి పేరిచర్ల, బాబు రమేష్, శ్రీకాంత్, బాధ్యత తీసుకున్నారు.
కొలోన్‌లో జరిగిన కళ్యాణానికి TAG - NRW బృందం కిశోర్ నల్లపాటి, సందీప్ కొర్రపాటి, రవి తేజ కాజా, కృష్ణుడు, సతీష్, శివ బత్తుల, SVK- NRW సభ్యులు రవి శంకర్, ఆనంద్, వంశీ, సతీష్ రెడ్డి, రామ్, బాధ్యత తీసుకున్నారు.
యూరప్, యు.కె. కళ్యాణాల ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని, షెంగెన్ ఏరియా కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ చైర్మన్ డాక్టర్ రవి వేమూరి, వారి టీమ్ ఈ కార్యక్రమం విజయవంతం అవటంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
జర్మనీలో వైభవంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
Updated Date - Nov 10 , 2025 | 04:55 PM