Fake Educational Certificate: 30 ఏళ్ళ నాటి ఫోర్జరీ కేసు.. సౌదీలో తెలుగు ఇంజినీరు అరెస్ట్
ABN, Publish Date - Jul 17 , 2025 | 03:50 PM
ముప్ఫై ఏళ్ల నాటి నకిలీ సర్టిఫికేట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ తెలుగు వ్యక్తిని తాజాగా సౌదీలో స్థానిక అధికారులు అరెస్టు చేశారు. హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వెళుతుండగా ఎయిర్‌పోర్టులో అదపులోకి తీసుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో నకిలీ పట్టాలతో ఒకప్పుడు వెలుగొందిన అనేక మంది ఇంజినీర్లు, వైద్య సిబ్బంది, అకౌంటెంట్లు ఇప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాల క్రితం చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తున్నారు. ప్రపంచంలోకెల్లా భారీ నిర్మాణాలతో ముందు వరుసలో ఉండే సౌదీ అరేబియాలో కొంత మంది భారతీయులు తప్పుడు డిగ్రీలు సమర్పించి ఇంజినీర్లుగా వెలుగొందారు. చేస్తున్న ఉద్యోగాలకు సరిపడా విద్యార్హతలు కలిగి ఉండాలనే నిబంధనను అమలు చేయడంతో అనేక మంది దానికి తగినట్టుగా విద్యార్హతలను సంపాదించుకున్నా కొందరు మాత్రం ఫోర్జరీ సర్టిఫికెట్లతో తాత్కాలికంగా గట్టెక్కారు. ఈ సర్టిఫికేట్లపై తరువాత విచారణ మొదలవడంతో అనేక మంది తమ ఉద్యోగాలను వదిలి గుట్టుచప్పుడు కాకుండా స్వదేశానికి వచ్చేశారు.
కరీంనగర్ నగరానికి చెందిన 66 ఏళ్ళ వ్యక్తి ఒకరు బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజి నుండి ఇంజినీరింగ్ డిగ్రీ చేసి సౌదీ అరేబియాలో ఇంజినీర్‌గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో గడుపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను తన జీవితపు చివరి మజిలీలో హజ్ యాత్ర చేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో వీల్ చెయిర్‌పై యాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా విమానాశ్రయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు.
30 సంవత్సరాల క్రితం ఆయన సమర్పించిన ఇంజినీరింగ్ డిగ్రీ నకిలీదని తేలినందున ఆయనపై ఆ తరువాత కేసు నమోదై ఉందని తేలింది. దీని విచారణకు ఆయన రియాధ్ నగరంలో వీల్ చైర్‌పై హాజరవుతున్నారు. మరొకరి సాయం లేకుండా మూత్రవిసర్జకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న సదరు మాజీ ఇంజినీరు తనకు సౌదీ చట్టాలపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉందని చెప్పారు.
తాను 1990లో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసానని, ఎలాంటి ఫోర్జరీ చేయలేదని ఆయన చెబుతున్నారు. న్యాయస్థానం తీర్పు వెలువరించే వరకు ఆయన దేశాన్ని విడిచి వెళ్ళడానికి వీలు లేదు. డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ అయినప్పటికీ ఎంబసీ ధ్రువీకరణ తప్పుడు విధానంలో జరిగితే దాన్ని కూడా సౌదీలో ఫోర్జరీ కింద పరిగణిస్తారు. అసలైన ఏజెంట్ల ద్వారా అధికారిక విధానంలో మాత్రమే అటెస్టేషన్ చేయించుకోవాలి.
కొందరు తెలుగు ఫార్మాసిస్టులు, అకౌంటెంట్లు, ఇంజినీర్లు ఫోర్జరీ సంగతి బయటపడక ముందే గుట్టుచప్పుడు కాకుండా స్వదేశానికి వెళ్ళిపోయారు. వీరిలో కొందరు మక్కా యాత్ర లేదా అమెరికా, యూరోప్‌లకు గల్ఫ్ మీదుగా ప్రయాణం చేసే సమయంలో పట్టుబడుతున్నారు. సర్టిఫికేట్లు, ఇతర దస్తావేజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏ రకమైన మోసానికి పాల్పడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డాలస్‌లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి
సింగపూర్‌లో స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ టోర్నమెంట్ విజయవంతం
Updated Date - Jul 17 , 2025 | 04:22 PM