NRI: గల్ఫ్ దేశాలు తెలంగాణ వారికి ఉపాధిని ఇచ్చే కల్పతరువు: మంత్రి గడ్డం వివేక్
ABN, Publish Date - Sep 04 , 2025 | 06:58 PM
తెలంగాణ వాసులు రాష్ట్రం బయట ఎక్కువ సంఖ్యలో ఉపాధి పొందుతోంది గల్ఫ్ దేశాలలో మాత్రమేనని మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. గురువారం దుబాయ్‌లో మంత్రి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలు తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చే కల్పతరువు అని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖా మంత్రి గడ్డం వివేక్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వాసులు రాష్ట్రం బయట ఎక్కువ సంఖ్యలో ఉపాధి పొందుతోంది గల్ఫ్ దేశాలలో మాత్రమేనని పేర్కొన్నారు.
గురువారం దుబాయ్‌లో మంత్రి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. యువతలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు సంక్షేమానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో తాను అధికార బృందంతో కలిసి గల్ఫ్ దేశాల పర్యటనకు వస్తానని కూడా ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాలలో మరణించిన ప్రవాసీయుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, దీనికి అదనంగా గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రణాళికాబద్ధమైన మరిన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తితో ఉన్నారని వివేక్ చెప్పారు.
అంతకుముందు, దుబాయ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సెల్ కన్వీనర్ ఎస్‌వీ రెడ్డి నేతృత్వంలో పార్టీ అభిమానులు కొందరు మంత్రిని కలిశారు. దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తనను కలిసిన వారితో మంత్రి వివేక్ మాట్లాడుతూ దేశ విదేశాలలో అసంఘటిత రంగాలలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు గిగ్ వర్కర్ల సంక్షేమానికి విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. అదే విధంగా, నిర్మాణ రంగంలోని కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షల నిర్వహణ, ఇతర సంక్షేమ పథకాల అమలు గురించి ఎడారి దేశాలలోని ప్రవాసీయుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని మంత్రి వివేక్ నొక్కి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిరుద్యోగులతో చెలగాటం.. సౌదీలో తెలుగు ప్రవాసీ సంఘం ప్రచార ఆరాటం
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Updated Date - Sep 04 , 2025 | 07:44 PM