NRI: విధివంచితుడయిన తెలుగు ఫుడ్ డెలివరీ బాయ్‌కి అండగా సాటా సెంట్రల్
ABN, Publish Date - May 29 , 2025 | 06:47 PM
పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన ఓ తెలుగు యువకుడికి యాక్సిండెంట్ కావడంతో ఇక్కట్ల పాలయ్యాడు. ఆపన్న హస్తం అందక అష్టకష్టాల్లో పడ్డ యువకుడిని అన్నీ తానై ఆదుకున్న సాటా సెంట్రల్ సురక్షితంగా స్వదేశానికిి పంపించింది.
మంచం నుండి విమానం టిక్కెట్టు వరకు అన్ని విషయాల్లో ఆసరగా మారిన వైనం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: శరవేగంగా పరిగెడుతున్న కాలం కంటే కూడా వేగంగా పరుగులు తీస్తూ సకాలంలో తాజాగా ఆహారాన్ని ఇంటికి అందించే ఫుడ్ డెలివరీ బాయ్స్.. తమ ప్రాణాలకు తెగించి మోటర్ బైకులు నడిపిస్తూ తమ పొట్ట పోసుకునే వీరు అనేక సార్లు పొట్టకూటి కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కార్ల వినియోగం ఎక్కువగా ఉన్న ఎడారి దేశాల్లో కార్ల మధ్యలో బైకులు నడుపుతూ కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రకంగా ఇబ్బందులకు గురయితే సహాయం కోసం వీరు విలవిల్లాడిపోతున్నారు.
గుంటూరు నగరానికి చెందిన 33 ఏళ్ళ శేఖ్ వలీ.. ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగం కోసం 7 నెలల క్రితం సౌదీ అరేబియాకు రావడం జరిగింది. వలీతో పాటు వచ్చిన అనేక మంది భారతీయులకు చాలా కాలం వరకూ మోటార్ బైక్ లైసెన్సు లేకపోవడంతో ఉద్యోగంలో చేరనందుకు కంపెనీ ఏ రకమైన వేతనం చెల్లించలేదు. దీంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా ఎట్టకేలకు లైసెన్స్ పొంది ఉద్యోగంలో చేరితే వీరికి 2 నెలల పాటు వేతనం అందించలేదు. రేయింబవళ్ళు రెక్కాడినా రొక్కం చేతికందకపోవడంతో విరక్తి చెందిన వలీ తనకు బకాయి వేతనం చెల్లించవల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ తర్వాత రెండు రోజులకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానపడ్డాడు.
పాడైపోయిన వస్తువుగా మూలన పడి ఉన్న వలీని ఎవరు పట్టించుకోలేదు. అల్ప శ్రేణి బీమా సౌకర్యం ఉండడంతో అతనికి కావాల్సిన మేరకు వైద్య సదుపాయం అందలేదు. కనీసం నడవడానికి అవసరమైన చేతి కర్రలు కూడా అతనికి లేకుండా పోయాయి. నడువలేని స్థితిలో ఉండి మంచంలోనే మూత్రం పోసుకొనే పరిస్థితిలో ఉన్న ఆయన తినడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని తెలుసుకొన్న రియాధ్ లోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ప్రతినిధులు భోజన వసతి కల్పించడమే కాకుండా తమకు వీలయిన విధంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలను అందించారు. రియాధ్ నగరంలో ఆపదలో ఉన్న తెలుగు ప్రవాసీయులందరికీ ఆపన్న హస్తం అందిస్తారనే పేరు సాటా సెంట్రల్‌కు ఉంది.
విమాన టిక్కెట్ సమకూర్చడంతో శేఖ్ వలీ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. సాటా సెంట్రల్ వారు విమానాశ్రయం వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. సాటా సెంట్రల్ ప్రతినిధులు రామకృష్ణా, జానీ బాషా, ముజమ్మీల్, రంజీత్, ఆనంద్ పోకూరి, నాగార్జున, సయ్యద్ అన్వర్, రిజ్వాన్‌లు తమ వంతు సహాయం చేసినట్లుగా సాటా సెంట్రల్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం
Updated Date - May 29 , 2025 | 06:50 PM