Mini Mahanadu Qatar: ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం
ABN , Publish Date - May 27 , 2025 | 02:24 PM
ఖతర్‌లో టీడీపీ శ్రేణులు మినీ మహానాడు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: తెలుగుదేశం పార్టీకి ఇంటాబయటా ఉన్న లక్షలాది మంది వీరాభిమానులు ఒక గొప్ప వరం. ఐరోపా లేదా అమెరికా తరహాలో గల్ఫ్ దేశాలలో పార్టీ కార్యకలాపాలను బాహాటంగా నిర్వహించలేకున్నా తమకు ఉన్న పరిమితులకు లోబడి చురుగ్గా పార్టీ జెండాను రెపరెపలాడించే అభిమానులున్న దేశాలలో ఖతర్ ఒకటి.
సహజ వాయువు (ఎల్ఎన్‌జీ) కు రంగు, వాసన ఉండదు కానీ దాన్ని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే ఖతర్‌లోని ఆ రంగంలో, దాని అనుబంధ రంగాల్లో పని చేసే అనేక మంది తెలుగువారికి బయట ఏ రంగు కనిపించకున్నా మనస్సులో మాత్రం పసుపు పచ్చదనం ఉంటుందనడానికి ఇటీవల ఖతర్ రాజధాని దోహాలో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడు ఒక తార్కాణంగా నిలిచింది.

ఖతర్ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి రమణ అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రచించిన ‘తారకరామం’ అనే పుస్తకాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ఆవిష్కరించారు. ఖతర్‌లో కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానులను చూస్తే పార్టీ ఔన్నత్యం గురించి తెలుస్తుందని శివరాం అన్నారు.
పార్టీ ఖతర్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానటుడిగా రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి పాత్రల ద్వారా మన పురాణాలను ప్రాణప్రతిష్టితమయ్యేలా చేయడం మొదలు ప్రతిపక్ష జాతీయ కూటమి కన్వీనర్‌గా భారత రాజకీయాలలో విశిష్ట పాత్ర వరకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేశ్‌ల పాలన తీరుతెన్నులను వివరించారు.

ఖతర్‌లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు కోసం విజయవాడకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసు లేదని, దీన్ని ప్రారంభించాలని తెలుగు దేశం మహానాడు తీర్మానించిందని రమణ చెప్పారు. అదే విధంగా, ప్రవాసీయులకు మరింత చురుకైన పాత్ర కల్పించేందుకు పార్టీ అనుబంధ కమిటీలలో ప్రవాసీయులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీకు ప్రత్యేకంగా ఎన్నారై సెల్‌ను ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేయాలని తీర్మానించినట్లుగా ఆయన పేర్కొన్నారు.
పార్టీ బాధ్యులు శాంతయ్య యలమంచిలి, ఆంజనేయులు, రవి, రమేశ్, నరేశ్, రవీంద్ర, కిరణ్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మహిళా ప్రతినిధులు డాక్టర్ రాధా, ఉజ్వల దేవినేనిలు కూడా తమ వంతు బాధ్యతలను నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు.. భారతీయ విద్యార్థులకు అమెరికా మరో వార్నింగ్