Schengen Visa Rejections: భారతీయులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్న షెంజెన్ వీసా తిరస్కరణలు
ABN, Publish Date - May 24 , 2025 | 07:31 AM
షెంజెన్ వీసా తిరస్కరణలు భారతీయులు భారీగా నష్టపోతున్నారు. గతేడాది భారతీయులు నాన్ రిఫండబుల్ ఫీజుల కింద రూ.132 కోట్లు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాలకు వెళ్లేందుకు అవసరమైన షెంజెన్ వీసా తిరస్కరణలతో భారతీయులు భారీగా నష్టపోతున్నారు. వీసా దరఖాస్తు కోసం కట్టిన ఫీజులు నాన్ రిఫండబుల్ కావడంతో తిరస్కరణలు భారతీయులకు నష్టాన్ని మిగులుస్తున్నాయి. 2024లో మొత్తం 1.65 దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడంతో భారతీయులు ఏకంగా 134 కోట్ల రూపాయాలు నష్టపోయారు. వీసా తిరస్కరణకు గురవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఆల్జీరియా, తుర్కియే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. యూరోపియన్ కమిషన్ డాటా ప్రకారం, భారతీయుల వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు 15 శాతంగా ఉంది.
కాండీ నాస్ట్ సంస్థ డేటా ప్రకారం, గతేడాది భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో 5.91 అప్లికేషన్లకు అమోదం లభించగా 1.65 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. మొరొక్కో, చైనా దేశస్థుల వీసా దరఖాస్తులు కూడా అధిక సంఖ్యలో రిజెక్షన్‌కు గురవుతున్నాయి. గతేడాది మొత్తం 14 లక్షల షెంజెన్ వీసా దరఖాస్తులను అక్కడి అధికారులు తిరస్కరించారు. ఈ దరఖాస్తుల ఫీజుల ద్వారా రూ. 1410 కోట్లను అభ్యర్థులు చెల్లించారు. ఇదంతా నాన్ రిఫండబుల్ కావడంతో ఆ మేరకు అభ్యర్థులు నష్టపోయారు.
భారతీయుల షెంజెన్ వీసా దరఖాస్తులను తిరస్కరించిన దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 31,314 వీసాలు ఫ్రాన్స్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తరువాత స్థానాల్లో స్విట్జర్‌ల్యాండ్ (26,126), జర్మనీ (15,806), స్పెయిన్ (15,150), నెదర్‌ల్యాండ్స్ (14,569) ఉన్నాయి.
దరఖాస్తుల ఫీజు పెంపు కూడా భారతీయుల నష్టాలను పెంచింది. గతంలో వీసా ఫీజు 80 యూరోలుగా ఉండగా ప్రస్తుతం ఇది 90 యూరోలకు చేరుకుంది. 12 ఏళ్లు పైబడిన వారందరిపైనా ఫీజుల భారం పెరిగింది. 12 ఏళ్ల లోపు చిన్నారులు, విద్యార్థులు, ఎన్జీఓ ప్రతినిధులు, ఇతర ప్రత్యేక కేసుల్లో మాత్రం మినహాయింపు ఇచ్చారు.
వీసా దరఖాస్తు తిరస్కరణలో కలుగుతున్న నష్టంపై భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అవకాశాలపై ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వీసా నిబంధనలపై మరింత స్పష్టత కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
Updated Date - May 24 , 2025 | 07:43 AM