NRI: నిరుద్యోగులతో చెలగాటం.. సౌదీలో తెలుగు ప్రవాసీ సంఘం ప్రచార ఆరాటం
ABN, Publish Date - Sep 04 , 2025 | 04:46 PM
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు పెట్టే ఫేక్ సౌదీ జాబ్ ఆఫర్స్ బారిన పడి అక్కడి తెలుగు నిరుద్యోగ యువత ఏం చేయాలో తెలియని స్థితిలో కూరుకుపోతున్నారు. ఓవైపు అప్పుల భారం మరోవైపు భవిష్యత్తుపై అనిశ్చితి వెరసి ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనతో కుమిలిపోతున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలియని భాష, భరింపరాని ఎండ, విదేశీయానం కోసం చేసిన అప్పులు, కుటుంబ సమస్యలు ఒకవైపు వేధిస్తుంటే.. కఫిల్ (స్పాన్సర్) సమస్య ఎప్పుడు వచ్చి పడుతుందో ఏమో తెలియని అయోమయ స్థితిలో సౌదీలో ఎందరో నిరుద్యోగ తెలుగు యువత నరకం అనుభవిస్తున్నారు. ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియని స్థితిలో వేదన అనుభవిస్తున్నారు. ఫలానా చోట జాబ్ ఉందని చెప్పిన వెంటనే ఆశతో సీవీలు పంపుతారు.. లేదా ఫోన్ చేస్తారు. అవతలి వైపు నుండి ఎవరూ కూడా ఫోన్ ఎత్తక పోతే నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతుంటారు. ఇలా వేదనా భరితంగా కాలాన్ని గడిపే నిరుద్యోగ యువకులకు సాటి తెలుగువారు ప్రత్యేకంగా ఒక సంఘాన్ని నడుపుతూ నలుగురికీ ఉద్యోగాల విషయంలో సహాయ పడుతున్నారని తెలిస్తే ఒక్కసారి ప్రాణం లేచి వస్తుంది. ఆ అమాయకుల్లో ఆశతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. ఆ తరువాత అదంతా ఉత్తి ప్రచారమని తెలిస్తే మాత్రం గుండె పగిలిపోతుంది. కొందరు తెలుగు యువత అక్కడ సరిగ్గా ఇదే దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. పరాయి దేశంలో ఆశనిరాశల మధ్య మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
సౌదీ అరేబియాలో ప్రముఖమైనదిగా పేరొందిన ఒక సంఘం.. ప్రత్యేకించి దమ్మాం ప్రాంతంలోని ఒక సంఘం.. నౌకాశ్రయంలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లుగా చేసిన విస్తృత ప్రచారాన్ని నమ్మి ఒక యువకుడు గత కొన్ని నెలలుగా సదరు తెలుగు సంఘం నేత వెంట అన్నమో రామచంద్రా అంటూ తిరుగుతున్నాడు. ఉద్యోగ అర్హతలు, వేతనాలు వగైరా అంశాలను అటుంచితే గత మూడు నెలల నుండి ఫోన్ చేస్తున్నా కనీసం ఎత్తడం లేదని సదరు అభ్యర్థి వాపోతున్నాడు. ఫోన్ ఎత్తడం కాదు కదా, తను చేసిన ప్రచారాన్ని నమ్మి పంపిన మేసేజ్‌కు కనీసం సమాధానం ఇవ్వడం లేదని కూడా చెబుతున్నాడు.
ఒక వైపు అప్పులు మరో వైపు అఖమా అనిశ్చిత పరిస్థితిలో ఉన్న ఈ రకమైన అనేక మంది యువకులు.. వాట్సప్ గ్రూపుల్లో సంఘాలు లేదా నాయకులుగా చెలామణిలో ఉన్న వారు చేసే పోస్టులను విశ్వసించి ఆశపడి ఆ తర్వాత నిరాశపడుతున్నారు. ఈ రకమైన నిరాశకు గురయ్యే వారిలో నిరక్షరాస్య కార్మికుల నుండి ఇంజినీరింగ్ పట్టభద్రుల వరకు ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సహాయ స్థితిలో ఉండే వీరు నేరుగా ప్రశ్నించలేక కుమిలిపోతున్నారు. ఉద్యోగ కల్పన అనేది ఎక్కడైనా అంత సులువు కాదు. అర్హతలు, జీతభత్యాలు, పని విధానం తదితర ఆంశాలు అనేకం ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమై ఆంగీకారం కుదిరితే సరే సరి, లేకుంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోవాలి. కానీ జాబ్ ఉందా? లేదా? అన్నది తేల్చకుండా, ఏ రకమైన సమాధానం ఇవ్వకుండా నెలల తరబడి సాగదీయడం మాత్రం ఏ రకంగానూ సమంజసం కాదు. అందునా సంఘ సేవకులుగా అవతారమెత్తే వారు మరింత బాధ్యతతో మెలగాలి.
పనిపాట లేని కొందరు, వివిధ గ్రూపులలో తమ కంటబడిన ప్రతి పోస్టును తమ అనుభవంతో పరిశీలించి ఇతరులకు పంపించడానికి బదులుగా నీటి ఎత్తిపోతలవలె ఒక గ్రూప్ నుండి మరో గ్రూప్‌నకు ఫార్వర్డ్ చేస్తుండడం కూడా గందరగోళానికి దారి తీస్తోంది.
సౌదీ అరేబియాలో కొన్ని తెలుగు ప్రవాసీ సంఘాలు ఈ రకమైన దుష్ట సంస్కృతికి శ్రీకారం చుట్టి ఉద్యోగ కల్పన పేర వారికి అర చేతిలో స్వర్గం చూపుతూ ఆ అమాయకులను తమ వాట్సప్ గ్రూపులలో చేర్చుకుంటూ కృతిమంగా తమ సంఖ్యాబలాన్ని పెంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు లేదా వ్యాపారావకాశాల ఎరతో డిజిటల్ ప్రపంచంలో ప్రాబల్యం పెంపొందించుకోవడం అంటే ఫేక్ వార్తలను వైరల్ చేస్తూ రేటింగ్ పెంచుకునే పెడధోరణి మినహా మరేం కాదు. నిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడకుండా నిర్మాణాత్మకంగా సూచనలు లేదా మార్గదర్శకత్వం చేసినా చాలు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న గురజాడ మాటలను ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మెల్‌బోర్న్ నగరంలో జనరంజకంగా అష్టావధాన కార్యక్రమం
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Updated Date - Sep 04 , 2025 | 06:30 PM