Ravi Mandalapu: అమెరికాలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం
ABN, Publish Date - Sep 16 , 2025 | 06:36 AM
ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మందలపును ఎన్నారైలు ఘనంగా సత్కరించారు. న్యూ జెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అమెరికా (న్యూజెర్సీ) : ‘టెక్నాలజీ పెరిగిపోవడంతో.. ప్రపంచం దగ్గరయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి కొత్త టెక్నాలజీ నూతన అవకాశాలను సృష్టిస్తూ, మానవ జీవితాలను మార్చేస్తోంది. ఏఐ మానవ మేధస్సును సవాల్ చేస్తోంది. వీటన్నింటినీ అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి’ అని ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపు అన్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో ప్రవాసాంధ్రులు ఆయనను ఘనంగా సన్మానించారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు మిర్చీ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.
దేశంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఏపీని రవి మందలపు ముందువరుసలో నిలుపుతారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఏపీలో జరిగే నూతన ఆవిష్కరణలు రేపటి తరాలకు మార్గదర్శకమౌతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిభా పాటవాలు, ఉన్నత విద్యావంతులైన యువతకు కొదవ లేదన్నారు. వారిని ప్రోత్సహించే గొప్ప నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టమని కొనియాడారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. ‘రేపటి విజేతలుగా నిలవాలంటే.. ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను, వేగంగా మారుతున్న సాoకేతికతను అందిపుచ్చుకోవాలి’ అని పిలుపునిచ్చారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన సహజసంపద, మానవవనరులున్నాయి. ప్రతిభావంతులైన, సృజనాత్మకత కలిగిన యువతకు సరైన వేదిక లభిస్తే... వారు ప్రపంచంలోనే ముందువరుసలో ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించి రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలి’ అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ భీమినేని, శ్రీనాథ్ రావుల తదితరులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ చిల్లర, తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సుమారు వెయ్యి మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ
బెతూనే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు పంపిణీ
For More NRI News And Telugu News
Updated Date - Sep 16 , 2025 | 06:36 AM