Mini Mahanadu: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఘనంగా మినీ మహానాడు
ABN, Publish Date - May 25 , 2025 | 02:06 PM
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ టీడీపీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని మినీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ: స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విశ్వవిఖ్యాత అన్న ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు.
ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్వహించిన 34వ మహానాడు అనేక ప్రాధాన్యతలను సంతరించుకుంది. సినీ నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషన్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ సందర్భంగా శాసనసభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ.. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఎన్టీఆరే ఆద్యులని అన్నారు. కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతావస్త్రాల లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జీవించిన కాలం ఎంతనే దాని కన్నా ఎలా జీవించామనేది ముఖ్యమని, ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం తపిస్తూ ఎన్టీఆర్ అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారని కొనియాడారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఫ్రాంక్‌ఫర్ట్ మినీ మహానాడుకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని అన్నారు. యూరప్ దేశాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానాలు, శ్రేణులు తరలి రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు.
సుమంత్ కొర్రపాటి మాట్లాడుతూ కూటమి విజయానికి ప్రవాసాంధ్రులు ఎంతో కృషి చేశారని అన్నారు. టిట్లు మద్దిపట్ల మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ విజయాలను వివరించారు. మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానించారు. దీంతో పాటు పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేశారు. చనిపోయిన కార్యకర్తలకు నివాళి అర్పించారు. చరిత్రాత్మక విజయంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు, ఎన్ఆర్ఐలకు ప్రత్యేక సెల్, పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణను అభినందిస్తూ తీర్మానం చేశారు.
అనంతరం అతిథులకు వివిధ రకాల తెలుగు వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిఒక్కరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తుల, పవన్ కుర్రా, నరేష్ కోనేరు, వెంకట్ కాండ్ర, వంశీ దాసరి, శివశంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
BATA, TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల’ 12వ వార్షికోత్సవం
అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
Updated Date - May 25 , 2025 | 02:21 PM