NY Tourish Bus Crash: న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. టూరిస్టు బస్సు పల్టీ కొట్టడంతో ఐదుగురి దుర్మరణం
ABN, Publish Date - Aug 23 , 2025 | 10:35 AM
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో భారతీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. శుక్రవారం బఫెలోకు తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో న్యూయార్క్ రాష్ట్ర హైవేపై ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ సంతతికి చెందిన 54 మంది ఉన్నారు. నయాగారా జలపాతాన్ని సందర్శించాక తిరిగొస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
డ్రైవర్ దృష్టి మళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదుపు తప్పిన బస్సును సరిదిద్దేందుకు ప్రయత్నించగా కుడివైపు పడి పల్టీ కొట్టింది. అయితే, డ్రైవర్ బస్సుపై అకస్మాత్తుగా ఎందుకు అదుపు కోల్పోయాడనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఆ సమయంలో బస్సులో ఏడాది నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న పలువురు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు పల్టీ కొట్టడంతో భారీ కుదుపు కారణంగా పలువురు తమ సీట్లలోంచి ఎగిరిపడ్డారని, ఈ క్రమంలో ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రాణాలు పోగొట్టుకున్న వారందరూ పెద్దలేనని చెప్పారు. వారు ఘటనా స్థలంలోనే మరణించినట్టు తెలిపారు.
బస్సులో చిక్కుకుపోయిన మిగిలిన వారిని సిబ్బంది కాపాడారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రుల్లో చేర్పించారు. మిగతా వారెవరికీ ప్రాణాపాయం లేదని కూడా పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. బస్‌లో ఎలాంటి మెకానికల్ లోపం లేదని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ ప్రమాదంలో సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల్లో కొందరికి కాళ్లు, చేతులు కూడా విరిగినట్టు అత్యవసర సిబ్బంది తెలిపారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని బఫెలోలోని ఈరీ కౌంటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఈ బస్సు ఎమ్ అండ్ వై టూర్ ఇంక్ సంస్థకు చెందినదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాగా, అంతకుముందు జరిగిన ఓ పత్రికా సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ.. పర్యాటకుల్లో అధికశాతం మంది సీట్ బెల్టులు పెట్టుకుని ఉండకపోవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు.
2023లో ఇలాంటి ఓ యాక్సిడెంట్ తరువాత న్యూయార్క్ ప్రభుత్వం చార్టర్డ్ బస్సుల్లో సీటు బెల్టులను తప్పనిసరి చేసింది. 2016 నవంబర్ 28 తరువాత తయారు చేసిన బస్సులు అన్నింటికీ ఈ నిబంధన తప్పనిసరి చేసింది. అయితే, తాజాగా ప్రమాదానికి గురైన బస్సును ఎప్పుడు తయారు చేశారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వలసలపై ఉక్కు పాదం.. వారికి వీసాల జారీని తక్షణం నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటన
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్
Updated Date - Aug 23 , 2025 | 10:48 AM