SATA ఆధ్వర్యంలో జెద్ధా నగరంలో తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయిక
ABN, Publish Date - Nov 23 , 2025 | 11:13 PM
జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ శుక్రవారం కార్తీక వనభోజనాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తాము వలస వచ్చిన నగరంలో అసలు తెలుగు వారు ఉన్నారో లేదో తెలియని అయోమయ స్థితి లోంచి ఒక్కసారిగా అనేక మంది తెలుగు కుటుంబాల మధ్య ఆప్యాయత, అనురాగాలతో గడిపినందుకు ఎన్నారైలు సంతోషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రశాంత్ మొదలు చిత్తూరు జిల్లాకు చెందిన దామోదర్ పాడి వరకూ అనేక మంది నూతనంగా వచ్చిన తెలుగు ప్రవాసీయుల ఆనందోత్సాహాలకు అంతులేదు. జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ శుక్రవారం నిర్వహించిన కార్తీక వనభోజనాల సందర్భంగా కనిపించిన సన్నివేశం ఇది.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది తెలుగు ప్రవాసీ కుటుంబాల ఆత్మీయ కలయికగా వనభోజనాల సందర్భాన్ని మలిచారు. తమ ఊరిలో తమ బంధుమిత్రుల మధ్య గడిపిన అనుభూతి కలిగిందని యాదాద్రి జిల్లాకు చెందిన ఉషా కిరణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ నగరానికి చెందిన వాసవి బచ్చు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. పెద్దలే కాదు ప్రవాసంలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు కూడా మాతృభూమి, తెలుగు తోడు లభించిందని విజయవాడకు చెందిన ఇంతియాజ్ అన్నారు.
ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా కేవలం తెలుగుతనం కేంద్రీకృతంగా సాటా పని చేస్తోందని సాటా (యం) అధ్యక్షులు మల్లేషన్ పేర్కొన్నారు. డ్రైవర్లు, లేబర్ల నుండి డాక్టర్లు, ప్రొఫెసర్ల వరకు సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన తెలుగు ప్రవాసీయులకు సాటా ప్రాతినిధ్యం వహిస్తోందని తెలిపారు. సాటా ఆవిర్భావానికి ముందు తెలుగు ప్రవాసీయులు ఒక రకంగా, ఆ తర్వాత మరొక రకంగా బలోపేతంగా అనుసంధానమై ఉన్నారని మల్లేషన్ అన్నారు. సాటా సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా సభికులకు వివరించారు.
ప్రవాసీ ప్రముఖులు రాంబాబు, ప్రొఫెసర్ నాగరాజు, వ్యాపారవేత్త శ్రీనివాస్ తదితరులు కూడా మాట్లాడుతూ సాటా సేవలను కొనియాడారు. ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రీమియం రెసిడెన్సీ ఇస్తోందని, దీన్ని అందుకున్న ప్రొఫెసర్ నాగరాజు-లక్ష్మిల కుటుంబాన్ని ఈ సందర్భంగా ప్రవాసీయులు అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో విజేతలైన చిన్నారులు, మహిళలకు బహుమతులను ప్రదానం చేసారు. తెలుగు, హిందీ భాషాలలో మధురమైన పాటలతో స్థానిక గాయకులు అంజద్ హుస్సేన్ మైమరిపించగా, గోపి కూడా తన పాటలతో సభికులను ఆహ్లాద పరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబురాలు
పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..
Updated Date - Nov 24 , 2025 | 11:39 AM