NY Tourist Bus Crash: న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి
ABN, Publish Date - Aug 24 , 2025 | 09:40 AM
న్యూయార్క్‌లో ఇటీవల టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ భారతీయుడు కూడా మరణించినట్టు అధికారులు తాజాగా గుర్తించారు. మృతుల వివరాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో ఇటీవల టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో పోలీసులు మృతులను తాజాగా గుర్తించాడు. ఈ దుర్ఘటనలో ఒక భారతీయుడు కూడా మరణించినట్టు తాజాగా ధ్రువీకరించారు. బిహార్‌కు చెందిన శంకర్ కుమార్ (65), న్యూజెర్సీకి చెందిన పింకీ ఛంగ్రానీ (60), బీజింగ్‌కు చెందిన జీ హాంగ్జో(22), న్యూజెర్సీ స్థానికుడైన జాంగ్ జియోయాన్ (50), జియాన్ మింగ్లీ (56) ఈ ప్రమాదంలో కన్నుమూసినట్టు తెలిపారు. నయాగారా జలపాత సందర్శన తరువాత తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.
శుక్రవారం బఫెలోకు సమీపంలోని పెంబ్రుక్ వద్ద ఇంటర్ స్టేట్ 90 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అదుపు కోల్పోయిన బస్సు పల్టీ కొట్టి రోడ్డు పక్కను ఉన్న చిన్న గొయ్యిలో పడింది. ప్రమాద సమయంలో వాహనంలో పర్యాటకులతో పాటు టూరిస్టు కంపెనీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
బస్సులోని ఐదుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మరణించినట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలు రాత్రి 8.30 వరకూ రోడ్డును మూసేసి సహాయక చర్యలు చేపట్టారు.
వాహనంలో ఎలాంటి మెకానిక్ లోపం లేదని అధికారులు అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో లేడని కూడా అన్నారు. బస్సులోని వారిలో అధిక శాతం మంది భారత్, చైనా, ఫిలిప్సీన్స్ సంతతి వారని తెలిపారు. ఈ ఘటనపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచూల్ కూడా విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. టూరిస్టు బస్సు పల్టీ కొట్టడంతో ఐదుగురి దుర్మరణం
ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం.. విదేశీయులకు మళ్లీ మొదలైన టెన్షన్
Updated Date - Aug 24 , 2025 | 09:49 AM