Indian Americans: అమెరికాలో జనాభా పరంగా నెం.2లో భారతీయులు
ABN, Publish Date - May 06 , 2025 | 09:20 PM
అమెరికాలో ఉంటున్న ఆసియా దేశాల వారిలో భారతీయులు సంఖ్యా పరంగా నెం.2కు చేరుకున్నారు. జనాభాలో చైనీయులు టాప్‌లో ఉండగా అంతర్జాతీయ విద్యార్థుల్లో మాత్రం భారతీయ స్టూడెంట్స్ జనాభానే అత్యధికం.
అమెరికాలో ఉంటున్న ఆసియా దేశాల వారిలో భారతీయులు సంఖ్యా పరంగా రెండవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం చైనా తరువాతి స్థానంలో ఉన్న భారతీయుల జనాభా 5.2 మిలియన్లు. ప్యూ రీసెర్చ సంస్థ నివేదిక ప్రకారం 2000లో భారతీయుల సంఖ్య 1.8 మిలియన్లు కాగా 2023 నాటికి 174 శాతం మేర పెరిగి 4.9 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారత సంతతి వారిలో 66 శాతం మంది స్వదేశం నుంచి వలసెళ్లిన వారే. 2000లో వలసొచ్చిన భారతీయుల వాటా 73 శాతం ఉండేది. అయితే, సంఖ్య పరంగా మాత్రం వలసొచ్చిన భారతీయుల సంఖ్య 3.2 మిలియన్లకు చేరుకుంది. అక్కడి భారతీయుల్లో దాదాపు 60 శాతం మంది పదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. 51 శాతం మందికి అమెరికా పౌరసత్వం లభించింది.
అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు సంఖ్యా పరంగా టాప్‌లో ఉన్నారు. 2023-24 సంవత్సరంలో చైనీయులను దాటి మొదటి స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 331602 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో ఐదేళ్లకు పైబడిన భారతీయుల్లో 84 శాతం మంది ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఇతర ఆసియా దేశాల వారితో పోలిస్తే ఇది అత్యధికం. ఇక భారతీయులు తమ ఇళ్లల్లో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ (18%) ముందు ఉండగా ఆ తరువాతి స్థానాల్లో తెలుగు (11%), గుజరాతీ (10%), తమిళ (7%) భాషలు ఉన్నాయి.
భారతీయ సంతతి వారు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా తొలి స్థానంలో నిలిచింది. అక్కడ సుమారు 960000 మంది భారత మూలాలున్న వారు ఉంటున్నారు. కాలిఫోర్నియాతో పాటు టెక్సాస్ (570,000), న్యూజెర్సీ (440000), న్యూయార్క్ (390000) భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. భారతీయులు అత్యధికంగా ఉండే మెట్రో ప్రాంతాల్లో న్యూయార్క్ (710000), డాలస్ (270000), శాన్‌ఫ్రాన్‌సిస్కో (260000) ముందు వరుసలో ఉన్నాయి ఉన్నాయి. అక్కడి భారతీయుల్లో 48 శాతం మంది తాము హిందూ మతాన్ని అనుసరిస్తామని చెప్పుకొచ్చారు. 15 శాతం మంది తాము క్రిస్టియన్లమని, మరో 15 శాతం మంది తమకు మతం, దేవడు వంటి భావనలపై నమ్మకం లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
Updated Date - May 06 , 2025 | 09:20 PM