H-1B Visa Deportation: భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు
ABN, Publish Date - Sep 06 , 2025 | 06:50 PM
60 రోజుల్లో హెచ్-1బీ వీసా స్పాన్సర్‌షిప్ ఉన్న జాబ్ తెచ్చుకోవాలనే మూర్ఖపు నిబంధన కారణంగా తన స్నేహితురాలు 8 ఏళ్ల తరువాత భారత్‌కు వెళ్లిపోతోందని ఓ అమెరికన్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిదేళ్ల పాటు అమెరికాలో ఉన్న ఓ భారతీయురాలిని హెచ్-1బీ వీసా గడువు ముగిసిందని చెప్పి దేశం నుంచి పంపించేయడం అన్యాయమని ఓ అమెరికన్ ఆవేదన వ్యక్తం చేశారు. టాలెంట్ ఉన్న వారిని ఇలా పంపించేస్తే అమెరికాకే నష్టమని హెచ్చరించారు. లింక్డ్‌ఇన్‌లో నేథన్ ప్లాటర్ అనే డాటా సైంటిస్టు పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది (H-1B visa deportation India).
‘ఆమెను ఇక్కడ చదువుకోనిచ్చాము. ఉద్యోగం చేసుకోనిచ్చాము. పన్నుల కట్టించుకున్నాము. ఇప్పుడు ఆమెను దేశం విడిచిపొమ్మంటే ఎలా. నా ఫ్రెండ్ దాదాపు 8 ఏళ్ల తరువాత ఇండియాకు తిరిగి వెళుతోంది (4 ఏళ్ల పాటు అమెరికాలోనే డిగ్రీ చదువు, 2 ఏళ్ల పాటు పోస్టు గ్రాడ్యుయేషన్, మరో రెండేళ్ల పాటు ఉద్యోగం). 60 రోజుల్లోపు హెచ్-1బీ వీసా స్పాన్సర్ చేసే కంపెనీలో జాబ్ దక్కకపోవడంతో పంపించేస్తున్నారు’
‘ఆమె రోజుకు 14 గంటలు కష్టించి పనిచేసినా పట్టించుకోలేదు. స్టెమ్ డిగ్రీని ఖాతరు చేయలేదు. తన టీమ్‌కు ఆమె ఎంత విలువైన వ్యక్తో పరిగణనలోకి తీసుకోలేదు. ఆస్టిన్‌లో తన జీవితాన్ని మొత్తం పెకలించుకుని ఆమె భారత్‌కు వెళ్లిపోతోంది. ఈ వీసా విధానం నిజంగా హాస్యాస్పదం. మేధావులను ఇక్కడ చదివించి, ఆపై మన పోటీదారులకు అప్పగిస్తున్నాము. అంతర్జాతీయ టాలెంట్‌ను అమెరికాలో నిలిపి ఉంచేందుకు మరింత మెరుగైన విధానం కావాలి. హెచ్-1బీ వీసా వ్యవస్థలో వెంటనే సమూల మార్పులు తీసుకురావాలి’ అని నేథన్ పోస్టు పెట్టారు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది అమెరికాలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మాతృదేశ అభివృద్ధికి పాటుపడేందుకు ఎన్నారైలు తిరిగి రావాలని మరికొందరు కోరారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గల్ఫ్ దేశాలు తెలంగాణ వారికి ఉపాధిని ఇచ్చే కల్పతరువు: మంత్రి గడ్డం వివేక్
Updated Date - Sep 06 , 2025 | 06:55 PM